
మోదీ ఆలింగనాలు వర్కౌట్ కాలేదు
భారత్–అమెరికా వాణిజ్య ఒప్పందంపై కేంద్రాన్ని తప్పుబట్టిన కాంగ్రెస్
భారత్–అమెరికా మధ్య కుదిరిన తాత్కాలిక వాణిజ్య ఒప్పందం అమెరికా రైతులకు మేలు చేసేలా ఉందని, భారత్‌ను రష్యా చమురు దిగుమతులు ఆపేలా బలవంతం చేస్తోందని కాంగ్రెస్ పార్టీ ఆరోపించింది.
ఒప్పంద వివరాలపై స్పష్టత లేదని కూడా పేర్కొంది. భారత్–అమెరికా తాత్కాలిక వాణిజ్య ఒప్పందంపై విడుదలైన సంయుక్త ప్రకటనపై కాంగ్రెస్ శనివారం స్పందించింది. ఈ ఒప్పందం వివరాల విషయంలో “నిశ్శబ్దంగా ఉన్నాయి” అని విమర్శించింది.
ప్రధాని నరేంద్ర మోదీని ఉద్దేశిస్తూ, “అన్ని ఆలింగనాలు పెద్దగా ఉపయోగపడలేదు” అంటూ ఎద్దేవా చేసింది. 1964లో వచ్చిన ‘సంగమ్’ సినిమాలోని “దోస్త్ దోస్త్ నా రహా” అనే పాట పంక్తిని ప్రస్తావిస్తూ ప్రభుత్వం పై కాంగ్రెస్ చమత్కరించింది. శనివారం భారత్ , అమెరికా దేశాలు తాత్కాలిక వాణిజ్య ఒప్పందానికి వచ్చాయని ప్రకటించాయి.
ఈ ఒప్పందం ద్వారా రెండు దేశాలు కొన్ని వస్తువులపై దిగుమతి సుంకాలను తగ్గించి ద్వైపాక్షిక వాణిజ్యాన్ని పెంచాలని లక్ష్యంగా పెట్టుకున్నాయి. కాంగ్రెస్ కమ్యూనికేషన్స్ విభాగం ప్రధాన కార్యదర్శి జైరాం రమేష్ మాట్లాడుతూ, తాజాగా విడుదలైన భారత్–అమెరికా సంయుక్త ప్రకటనలో వివరాలు లేవని అన్నారు. “ఇప్పటివరకు వెల్లడైన సమాచారాన్ని చూస్తే, భారత్ ఇకపై రష్యా నుంచి చమురు దిగుమతి చేసుకోదని స్పష్టంగా తెలుస్తోంది.
రష్యా నుంచి ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా చమురు కొంటే 25 శాతం పెనాల్టీ మళ్లీ విధించవచ్చని అమెరికా ప్రకటించింది” అని ఆయన ఎక్స్ లో తెలిపారు. అదేవిధంగా, అమెరికా రైతులకు మేలు చేయడానికి భారత ప్రభుత్వం దిగుమతి సుంకాలను భారీగా తగ్గిస్తోందని, దీని వల్ల భారత రైతులు నష్టపోతారని రమేష్ ఆరోపించారు.
“అమెరికా నుంచి భారత్ చేసే దిగుమతులు మూడింతలు పెరుగుతాయి. దీంతో మనకు ఉన్న వాణిజ్య ఆదాయం పూర్తిగా పోతుంది. ఐటీ సహా ఇతర సేవల ఎగుమతులపై అనిశ్చితి కొనసాగుతుంది. అమెరికాకు మన వస్తువుల ఎగుమతులపై గతంతో పోలిస్తే ఎక్కువ సుంకాలు విధించబడతాయి” అని ఆయన అన్నారు.
ఈ పరిణామంపై ప్రధాని నరేంద్ర మోదీ స్పందిస్తూ, ఈ ఒప్పందం ద్వారా ‘మేక్ ఇన్ ఇండియా’ కార్యక్రమం బలపడుతుందని చెప్పారు. రైతులు, వ్యాపారవేత్తలకు కొత్త అవకాశాలు లభిస్తాయని, మహిళలు, యువతకు ఉద్యోగాలు ఏర్పడతాయని తెలిపారు. భారత్–అమెరికా సంబంధాలను బలోపేతం చేయడంలో వ్యక్తిగతంగా సహకరించినందుకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు ప్రధాని కృతజ్ఞతలు తెలిపారు.
“భారత్, అమెరికాలకు ఇది గొప్ప వార్త. రెండు గొప్ప దేశాల మధ్య తాత్కాలిక వాణిజ్య ఒప్పందానికి ఏకాభిప్రాయానికి వచ్చాము” అని మోదీ ఎక్స్‌లో పేర్కొన్నారు. ఈ ఒప్పందం వల్ల రైతులు, వ్యాపారవేత్తలు, ఎంఎస్‌ఎంఈలు, స్టార్టప్ కంపెనీలు , మత్స్యకారులకు కొత్త అవకాశాలు లభిస్తాయని, పెద్దఎత్తున ఉద్యోగాలు సృష్టిస్తుందని ప్రధాని చెప్పారు.
ఒప్పంద వివరాలు
తాత్కాలిక వాణిజ్య ఒప్పందం ప్రకారం, రష్యా నుంచి చమురు కొనుగోలు చేసినందుకు గత ఆగస్టులో భారత్‌పై విధించిన 25 శాతం అదనపు సుంకాలను ట్రంప్ తొలగించారు. రష్యా నుంచి ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా చమురు దిగుమతులు ఆపేందుకు భారత్ కీలక చర్యలు తీసుకుందని అమెరికా పేర్కొంది.
ఈ ఒప్పందం ద్వారా భారత ఎగుమతిదారులకు 30 ట్రిలియన్ డాలర్ల మార్కెట్ అందుబాటులోకి వస్తుంది. ముఖ్యంగా ఎంఎస్‌ఎంఈలు, రైతులు, మత్స్యకారులకు లాభం చేకూరుతుంది. భారత వస్తువులపై అమెరికా సుంకాలు గతంలో ఉన్న 50 శాతం నుంచి 18 శాతానికి తగ్గుతాయి.
సంయుక్త ప్రకటన ప్రకారం, ఈ ఒప్పందాన్ని రెండు దేశాలు త్వరితగతిన అమలు చేసి, పరస్పర లాభదాయకమైన ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందం (BTA)ను పూర్తి చేయడానికి కృషి చేస్తాయి.
అమెరికా నుంచి వచ్చే పారిశ్రామిక వస్తువులు, అలాగే ఎండబెట్టిన ధాన్యాలు, జొన్నలు, డ్రై ఫ్రూట్స్, పండ్లు, సోయాబీన్ ఆయిల్, వైన్, మద్యం తదితర వ్యవసాయ, ఆహార ఉత్పత్తులపై భారత్ సుంకాలను తగ్గించనుంది లేదా పూర్తిగా తొలగించనుంది.
Next Story

