పశ్చిమాసియా ఘర్షణపై స్పందించిన మోదీ
x
ప్రధాని నరేంద్ర మోదీ

పశ్చిమాసియా ఘర్షణపై స్పందించిన మోదీ

లోక్ సభలో సుదీర్ఘంగా ప్రసంగం, గల్ఫ్ యుద్ధం వల్ల భారత్ తో పాటు ప్రపంచవ్యాప్తంగా ప్రభావం ఉందని వ్యాఖ్య


అమెరికా, ఇజ్రాయెల్ - ఇరాన్ మధ్య జరుగుతున్న యుద్ధం నాలుగో వారంకి చేరిన నేపథ్యం, ప్రపంచంపై దాని ప్రభావం పెరుగుతున్న సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ సోమవారం లోక్ సభలో మాట్లాడారు.

"పశ్చిమ ఆసియాలోని పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. ఇది ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై, ప్రజల జీవితాలపై తీవ్రమైన ప్రభావాన్ని చూపుతోంది" అని ఆయన అన్నారు. ఈ సుదీర్ఘ సంక్షోభానికి త్వరిత పరిష్కారం కోసం ప్రపంచవ్యాప్తంగా కృషి జరుగుతోందని అన్నారు.

ఇంధన దిగుమతులు, వాణిజ్య మార్గాలు, గల్ఫ్‌లోని భారీగా ఉపాధి పొందుతున్న ప్రవాస భారతీయుల ద్వారా భారతదేశానికి ఈ సంక్షోభంతో లోతైన సంబంధం ఉందని ఇది యుద్ధ పరిణామాలను మరింత తీవ్రతరం చేసిందని ఆయన నొక్కి చెప్పారు.
"ఈ యుద్ధం దేశానికి ఆర్థిక, జాతీయ భద్రతకు సంబంధించిన, మానవతాపరంగా కూడా అపూర్వమైన సవాళ్లను విసిరింది" అని ప్రధాని మోదీ అన్నారు. తమ ప్రభుత్వం దౌత్య మార్గాలను, సహాయక వ్యవస్థలను క్రియాశీలం చేసిందని, రాయబార కార్యాలయాలు పౌరులకు సాయం చేస్తున్నాయని, సలహాలు జారీ చేస్తున్నాయని, 24/7 హెల్ప్‌లైన్‌లను నిర్వహిస్తున్నాయని మోదీ తెలిపారు. ఇరాన్ నుంచి తరలించబడిన వారితో సహా వేలాది మందిని తిరిగి తీసుకువచ్చామని, ప్రభావిత కుటుంబాలకు సహాయం అందిస్తున్నామని ఆయన తెలిపారు.
హార్ముజ్ జలసంధి గుండా చమురు నౌకల రవాణాకు తీవ్ర అంతరాయం ఏర్పడిన నేపథ్యంలో దేశంలో వ్యూహాత్మక నిల్వలు, వైవిధ్యభరితమైన వనరుల సాయంతో ఇంధన సంక్షోభం తలెత్తకుండా చేస్తున్నామని అన్నారు. సంఘర్షణ ప్రభావాలు కొనసాగవచ్చని సూచించారు.

లోక్ సభలో ముఖ్యాంశాలు..

"పశ్చిమ ఆసియాలోని పరిస్థితి ఆందోళన కలిగిస్తోంది. ఈ యుద్ధం దేశానికి అపూర్వమైన ఆర్థిక, భద్రతా, మానవ సవాళ్లను సృష్టించింది. దేశానికి ముడి చమురు, గ్యాస్ సరఫరాకు ఈ ప్రాంతం కీలకం.
పార్లమెంటు ప్రపంచానికి బలమైన, ఏకీకృత సందేశాన్ని పంపాలి." ఆ ప్రాంతంలో నివసిస్తున్న, పనిచేస్తున్న ప్రతి భారతీయుడి భద్రతను పరిశీలిస్తున్నాము. నేను దేశాధినేతలతో వ్యక్తిగతంగా మాట్లాడాను. దురదృష్టవశాత్తు, కొంతమంది భారతీయులు ప్రాణాలు కోల్పోయారు లేదా గల్లంతయ్యారు.
యుద్ధ ప్రభావిత దేశాల్లోని మా రాయబార కార్యాలయాలు క్రమం తప్పకుండా సలహాలు జారీ చేస్తూ, భారతీయులకు సాధ్యమైన అన్ని విధాలుగా సాయం చేస్తున్నాయి. మేము 24/7 హెల్ప్‌లైన్‌ను ఏర్పాటు చేశాము. భారతీయుల భద్రతే మా ప్రాధాన్యత. యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి, ఇరాన్ నుంచి వచ్చిన 1000 మంది భారతీయులతో సహా 3.75 లక్షలకు పైగా భారతీయులు సురక్షితంగా తిరిగి వచ్చారు.
ముడి చమురు, గ్యాస్, కీలక సరఫరాలు హార్ముజ్ జలసంధి ద్వారా వస్తాయి. అంతరాయాలను తగ్గించడానికి మేము ప్రయత్నిస్తున్నాము. మన ఎల్‌పిజిలో అరవై శాతం ఇక్కడి నుంచే దిగుమతి అవుతుంది. ఎల్పీజీ అంతరాయాల కారణంగా దేశీయ వినియోగానికి మొదట ప్రాధాన్యత ఇస్తున్నాం.
ఇంధన భద్రత కోసం గత దశాబ్దంలో తీసుకున్న చర్యలు నేడు మరింత అవసరంగా మారాయి. గత 12 సంవత్సరాలుగా మేము ఇంధన వనరులను వైవిధ్యపరిచాము. నేడు 41 దేశాల నుంచి ఇంధనాన్ని దిగుమతి చేసుకుంటున్నాము. గత 11 సంవత్సరాలలో మన శుద్ధి సామర్థ్యం కూడా పెరిగింది. సాధ్యమైన చోటల్లా చమురు, గ్యాస్ సరఫరాను నిర్ధారించడమే మా ప్రయత్నం.
ఇంధన భద్రత, సరఫరాను నిర్ధారించడానికి మేము అన్ని మిత్ర దేశాలతో నిరంతరం సంప్రదింపులు జరుపుతున్నాము. గత దశాబ్దంలో ఇథనాల్ మిశ్రమంపై చేసిన పని నేడు ఉపయోగంలోకి వచ్చింది.
రైల్వేల విద్యుదీకరణ కూడా డీజిల్‌పై ఆధారపడటాన్ని తగ్గించడంలో సాయపడుతోంది. ప్రత్యామ్నాయ ఇంధన వనరులపై జరుగుతున్న పనులు దేశ భవిష్యత్తును సురక్షితం చేశాయి. ఈ సంఘర్షణ వల్ల ప్రపంచ ఆర్థిక వ్యవస్థ తీవ్రంగా ప్రభావితమైంది. అయితే ఈ నష్టాల తీవ్రతను తగ్గించడానికి మేము ప్రయత్నిస్తున్నాము. దిగుమతి, ఎగుమతి సంబంధిత సమస్యలపై చర్చించడానికి ప్రభుత్వం ఒక అంతర్-మంత్రివర్గ బృందాన్ని ఏర్పాటు చేసింది, ఇది ప్రతిరోజూ సమావేశమవుతుంది" అని మోదీ లోక్ సభలో అన్నారు.
‘‘వ్యవసాయరంగంపై యుద్ధ ప్రభావం ఒక ప్రధాన ప్రశ్న. మన ధాన్యాగారాలు బాగున్నాయి. మా వద్ద తగినంత ధాన్యం నిల్వ ఉంది. మా రైతులపై ఒత్తిడి పడనీయము."
"భారతదేశ దౌత్య వైఖరి స్పష్టం. యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి, వీలైనంత త్వరగా శాంతియుత పరిష్కారం వైపు పయనించాలని, ఇంధన మౌలిక సదుపాయాలపై దాడులకు దూరంగా ఉండాలని మేము అన్ని దేశాలకు విజ్ఞప్తి చేస్తున్నాము’’.
చర్చలు, దౌత్యమే సమస్యకు పరిష్కారాలు. మా దౌత్య ప్రయత్నాలన్నీ ఈ దిశగానే ఉన్నాయి." తీరప్రాంత భద్రత, సరిహద్దు భద్రత, శాంతిభద్రతలు, సైబర్ భద్రత, వ్యూహాత్మక స్థావరాలను అత్యంత అప్రమత్తంగా ఉంచుతున్నాము.
మనం కోవిడ్ మహమ్మారిని ఎదుర్కొన్న విధంగానే ఐక్యంగా ఉండాలి. ఈ పరిస్థితిని అవకాశంగా తీసుకుని సమస్యలు సృష్టించడానికి, బ్లాక్ మార్కెట్ వ్యాపారానికి పాల్పడటానికి ప్రయత్నించే వారి పట్ల మనం అప్రమత్తంగా ఉండాలన్నారు.


Read More
Next Story