
మోదీ “మిత్రుడికంటే ఎక్కువ”
సోషల్ మీడియాలో వైరల్ అయిన ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నేతన్యాహు వ్యాఖ్యలు
తనకు భారత ప్రధాని మోదీ “మిత్రుడికంటే ఎక్కువ” అన్న ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నేతన్యాహు వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. భారతదేశాన్ని “అపార శక్తి కలిగిన దేశం”గా ఆయన కొనియాడారు. అక్టోబర్ 7, 2023న జరిగిన హమాస్ దాడి తర్వాత, ఇజ్రాయెల్‌కు మోదీ మద్దతుగా నిలిచినందుకు నేతన్యాహు కృతజ్ఞతలు తెలిపారు. హమాస్ దాడిలో సుమారు 1,200 మంది ఇజ్రాయెలీయులు మరణించగా, సుమారు 250 మందిని కిడ్నాప్ చేశారు. ఈ దాడిని ఖండించిన తొలి ప్రపంచ నాయకుల్లో మోదీ ఒకరు అని నేతన్యాహు చెప్పారు.
2017లో ఇజ్రాయెల్‌ను మోదీ సందర్శించినప్పుడు, ఇద్దరూ సముద్రతీరంలో చెప్పులు తీసి నడిచిన ఘటనను గుర్తుచేసుకున్నారు. “మేము నీటిపై నడవలేదు కానీ అద్భుతాలు సాధించాం” అని నేతన్యాహు పేర్కొన్నారు.
ఇరుదేశాల మధ్య వాణిజ్య సంబంధాలు రెట్టింపు అయ్యాయని, పరస్పర సంబంధాలు బలపడినట్లు చెప్పారు. విమానాశ్రయంలో ఒకరినొకరు ఆలింగనం చేసుకోవడంను “మోదీ హగ్” గా పేర్కొన్నారు నేతన్యాహు. ఇది ఇరుదేశాల మధ్య ఉన్న స్నేహపూర్వక సంబంధాలను సూచిస్తుంది.
ఇరుదేశాల చారిత్రక సంబంధాలను ప్రస్తావిస్తూ.. సింధు లోయ నాగరికత, జోర్డాన్ లోయ నాగరికత గురించి మాట్లాడారు. బ్రిటిష్ పాలన నుంచి బయటపడి ప్రజాస్వామ్యాన్ని కాపాడుకున్నట్లు చెప్పారు.
మోదీ “ప్రపంచస్థాయి నాయకుడు” అని నేతన్యాహు కొనియాడారు. ఈ వ్యాఖ్యలతో భారత్-ఇజ్రాయెల్ సంబంధం మరింత బలపడే అవకాశాలు ఉన్నాయి.

