
పశ్చిమ బెంగాల్: మ్యానిఫెస్టో రిలీజ్ చేసిన మమత..
రాష్ట్రంలో “అప్రకటిత రాష్ట్రపతి పాలన” విధించారని మోదీని తూర్పారబట్టిన టీఎంసీ చీఫ్..
అసెంబ్లీ ఎన్నికలు దగ్గరపడుతుండడంతో పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) చీఫ్ మమతా బెనర్జీ శుక్రవారం (మార్చి 20) పార్టీ మేనిఫెస్టోను ఆవిష్కరించారు. ఇదే సందర్భంలో ఆమె ఎన్నికల సంఘం (ఈసీ)పై తీవ్రంగా విమర్శలు గుప్పించారు. బీజేపీ చేతిలో ఈసీ కీలుబొమ్మగా మారిందని ఆరోపించారు.
‘అప్రకటిత రాష్ట్రపతి పాలన..’
రాష్ట్రంలో “అప్రకటిత రాష్ట్రపతి పాలన” విధించారని ఆరోపిస్తూ, ఎన్నికల్లో గెలవడానికి ప్రధాని మోదీకి ఇలాంటి చర్యలు అవసరమా? అని బెనర్జీ ప్రశ్నించారు.
"ఇక్కడ అప్రకటిత రాష్ట్రపతి పాలన విధించారు. సిగ్గుచేటు! ఓట్ల కోసం ఇంతకు దిగజారాలా? మోదీ రాష్ట్రపతి పాలన విధించాలా? బెంగాల్ ప్రజలంటే వాళ్లకు అంత భయమా? చరిత్ర పునరావృతమవుతుంది. ఒకప్పుడు కోల్‌కతా బ్రిటిష్ వారి రాజధానిగా ఉండేది. కానీ భయంతో దాన్ని మార్చేశారు. ఇక్కడి ప్రజలను లొంగదీసుకోలేమని వాళ్లు గ్రహించారు. వాళ్లు ఎప్పటికీ తలవంచరు," అని బెనర్జీ స్వరం పెంచారు.
ఈసీ, బీజేపీపై దాడి..
"బెంగాల్‌ను చాలా కాలం నుంచి టార్గెట్ చేశారు. వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ గెలవడానికి వీలుగా కేంద్రం, ఈసీ నియోజకవర్గాల పునర్విభజనకు ప్రణాళిక రచిస్తున్నారు’’ అని టీఎంసీ అధినేత ఆరోపించారు.
అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఐఏఎస్, ఐపీఎస్ అధికారులను బదిలీ చేయడంపై మమత ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో హింసను రెచ్చగొట్టడం, బీజేపీకి అనుకూలమైన వాతావరణాన్ని సృష్టించడం కోసమే ఈ బదిలీలు జరిగాయని ఆరోపించారు.
ఓటర్లకు విజ్ఞప్తి..
మమతా బెనర్జీ రాష్ట్ర ప్రజలకు మత సామరస్యాన్ని కాపాడాలని, శాంతియుతంగా ఎన్నికల ప్రక్రియలో పాల్గొనాలని కోరారు మమత. “ప్రజలు ఎల్లప్పుడూ గెలుస్తారు. నిరంకుశ మోదీ ప్రభుత్వం, రైతు వ్యతిరేక విధానాలు త్వరలోనే అంతమవుతాయి. ప్రజలే విజయాన్ని నిర్ణయిస్తారు,” అని పేర్కొన్నారు.

