
పాక్ హెచ్చరిక.. మోదీపై మమతా విమర్శలు
కోల్‌కతాపై పాకిస్థాన్ హెచ్చరికలపై మమతా బెనర్జీ సీరియస్ అయ్యారు. కేంద్రం మౌనంగా ఉండటాన్ని ఆమె తప్పుబట్టారు.
పశ్చిమ బెంగాల్ ఎన్నికల వేళ పాకిస్థాన్ చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా చర్చకు దారితీశాయి. పాక్ రక్షణ మంత్రి ఖ్వాజా ఆసిఫ్ (Khawaja Asif ) కోల్‌కతాపై దాడి చేసే అవకాశాన్ని ప్రస్తావించడం వివాదానికి కారణమైంది.
‘ప్రధాని ఒక్క మాట కూడా మాట్లాడలేదు..’
ఈ వ్యాఖ్యలపై పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ (Mamata Banerjee) తీవ్రంగా స్పందించారు. కేంద్ర ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (Narendra Modi) ఈ అంశంపై మౌనం వహించారని ఆరోపించారు.
బెంగాల్‌లో ఎన్నికల ప్రచారంలో భాగంగా మాట్లాడిన మమత.. “పాక్ బెంగాల్‌పై దాడి చేస్తామని చెబుతుంటే, ప్రధాని ఒక్క మాట కూడా మాట్లాడటం లేదు. కానీ ఎన్నికల సభల్లో బెంగాల్‌ను విమర్శిస్తున్నారు. ఇది సరైంది కాదు,” అని అన్నారు. ఈ వ్యవహారంలో బాధ్యత తీసుకుని ప్రధాని రాజీనామా చేయాలని ఆమె డిమాండ్ చేశారు.
“దేశానికి ముప్పు వస్తే ఎలా స్పందిస్తామో, కోల్‌కతాకు ముప్పు వచ్చినా అలాగే ఎదుర్కొంటాం. బెంగాల్ భద్రతపై ఎలాంటి రాజీ ఉండబోదు,” అని మమతా స్పష్టం చేశారు.
భారత్ భవిష్యత్తులో ఏదైనా చర్యకు దిగితే, పాకిస్థాన్ దానికి ప్రతిస్పందనగా కోల్‌కతాను లక్ష్యంగా చేసుకోవచ్చని అని హెచ్చరించారు ఖ్వజా ఆసిఫ్. ఆయన ఇస్లామాబాద్ సమీపంలో ఖ్వజా ఆసిఫ్ మీడియాతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు.
‘కఠినంగా వ్యవహరిస్తాం’
ఈ వ్యాఖ్యలకు ముందు, భారత రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ (Rajnath Singh) కూడా స్పందించారు. పాకిస్థాన్ నుంచి ఏదైనా దుస్సాహసం జరిగితే, భారత్ కఠినంగా, నిర్ణయాత్మకంగా చర్యలు తీసుకుంటుందని హెచ్చరించారు.
మొత్తంగా పాకిస్థాన్ వ్యాఖ్యలు కేంద్రం స్పందనపై వివాదం, బెంగాల్ ఎన్నికల ప్రచారంలో కీలక అంశంగా మారాయి. మమతా-మోదీ మధ్య మాటల యుద్ధం మరింత తీవ్రంగా కొనసాగుతోంది.

