పశ్చిమ బెంగాల్‌లో మమత ఎన్నికల ప్రచారం..
x

పశ్చిమ బెంగాల్‌లో మమత ఎన్నికల ప్రచారం..

పరిశీలనలో ఉన్న 60 లక్షల ఓటర్ల పేర్లలో 30 లక్షల తిరిగి చేరిస్తే.. అది తృణమూల్ కాంగ్రెస్ (TMC) కృషి ఫలితమేనన్న తృణమూల్ కాంగ్రెస్ చీఫ్..


Click the Play button to hear this message in audio format

పశ్చిమ బెంగాల్‌లో ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ (SIR) ప్రక్రియపై రాజకీయ వాదోపవాదాలు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కీలక వ్యాఖ్యలు చేశారు.

బీర్భూమ్ జిల్లాలో జరిగిన టీఎంసీ ర్యాలీలో మాట్లాడుతూ.. పరిశీలనలో ఉన్న 60 లక్షలకు పైగా ఓటర్ల పేర్లలో సుమారు 30 లక్షల పేర్లు తిరిగి జాబితాలో చేరిస్తే, అది తృణమూల్ కాంగ్రెస్ (TMC) కృషి ఫలితమేనని అన్నారు.

ఇదే సమయంలో తుది ఓటర్ల జాబితాను విడుదల చేయాలని ఈసీని ఆమె డిమాండ్ చేశారు. పరిశీలన జాబితా నుంచి ఎవరి పేర్లు తొలగించారన్నది ఇంకా స్పష్టంగా తెలియలేదని విమర్శించారు.

జాబితాలో పేరు లేని వారికి ట్రిబ్యునల్స్ ముందు తమ వాదనలు వినిపించేందుకు టీఎంసీ న్యాయవాదులు సాయం చేస్తారని మమతా బెనర్జీ తెలిపారు.

SIR ప్రక్రియలో బీజేపీ ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తోందని ఆమె ఆరోపించారు. పెద్ద నోట్ల రద్దు, ఆధార్, ఓటర్ల జాబితా వంటి అంశాల్లో ప్రజలు క్యూలలో నిలబడాల్సి వచ్చిందని విమర్శించారు.

రాజకీయంగా కూడా బీజేపీపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. బెంగాలీ మాట్లాడితే బంగ్లాదేశీయులుగా ముద్ర వేస్తున్నారని ఆరోపించారు. ఈ విషయాల్లో తాను కోర్టుల ద్వారా పోరాడుతున్నానని తెలిపారు.

సంక్షేమ పథకాలు కొనసాగాలంటే టీఎంసీకి ఓటు వేయాలని ప్రజలను కోరారు. తిరిగి అధికారంలోకి వస్తే ఎన్ఆర్సీని అమలు చేయనివ్వబోమని స్పష్టం చేశారు.

ఇదిలా ఉండగా, ఈసీ ఇప్పటికే ‘విచారణలో ఉన్న’ ఓటర్ల ప్రాథమిక జాబితాను విడుదల చేసింది. అయితే తొలగించిన, చేర్చిన పేర్ల పూర్తి వివరాలు వెల్లడించలేదు.

అధికారుల ప్రకారం, ఇప్పటివరకు సుమారు 32 లక్షల కేసులు పరిష్కారమయ్యాయి. ఇంకా 28 లక్షల పేర్లపై విచారణ కొనసాగుతోంది.

పశ్చిమ బెంగాల్‌లోని 294 అసెంబ్లీ స్థానాలకు ఏప్రిల్ 23, 29 తేదీలలో పోలింగ్ జరగనుండగా, మే 4న ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు.

Read More
Next Story