లోక్‌సభ స్పీకర్‌పై అవిశ్వాస తీర్మానం
x

లోక్‌సభ స్పీకర్‌పై అవిశ్వాస తీర్మానం

మార్చి 9న కీలక చర్చ, ఓటింగ్‌కు సిద్ధం సభ


Click the Play button to hear this message in audio format

లోక్‌సభ స్పీకర్ ‘ఓం బిర్లా’పై ప్రతిపక్షాలు ప్రతిపాదించిన అవిశ్వాస తీర్మానం మార్చి 9న లోక్‌సభలో చర్చకు రానుంది. చర్చ అనంతరం అదే రోజు ఓటింగ్ కూడా నిర్వహించనున్నట్లు కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరెన్ రిజిజు వెల్లడించారు. బడ్జెట్ సమావేశాల విరామం ముగిసిన వెంటనే, రెండో విడత మొదటి రోజునే ఈ అంశాన్ని తీసుకోవడం సభ నియమ ప్రకారం జరుగుతుందని ఆయన వివరించారు.

బడ్జెట్ సమావేశాలు జనవరి 28న రాష్ట్రపతి ప్రసంగంతో ప్రారంభమై, ఫిబ్రవరి 12న ముగిశాయి. ఈ సమావేశాల్లో 2026–27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన కేంద్ర బడ్జెట్‌ను ఫిబ్రవరి 1న ప్రవేశపెట్టారు. మార్చి 9 నుంచి ఏప్రిల్ 2 వరకు కొనసాగే రెండో విడతలో బిల్లులు చర్చకు రానున్నాయని కేంద్ర ప్రభుత్వం సంకేతాలు ఇస్తోంది.


‘రెండో విడత సమావేశాలు చాలా ముఖ్యం’

రెండో విడత బడ్జెట్ సమావేశాలు చాలా ముఖ్యమైనవని కిరణ్ రిజుజు అభిప్రాయపడ్డారు. “మేం చాలా ముఖ్యమైన బిల్లులను సభ ముందుకు తీసుకువస్తాం. వాటిలో ఒక కీలక బిల్లు కూడా ఉంది. దాని వివరాలను ఇప్పుడే వెల్లడించము. కానీ రెండో విడతలో అత్యంత ప్రాధాన్యాతాంశాలు చర్చకు వస్తాయి” అని పేర్కొన్నారు. ప్రతిపక్షాలు సభను అడ్డుకోవద్దని, అలా జరిగితే ప్రభుత్వానికి “గిలెటిన్” విధానాన్ని అనుసరించక తప్పదని, అది చివరికి ప్రతిపక్షాలకే నష్టమని హెచ్చరించారు.

పశ్చిమ బెంగాల్, తమిళనాడు, అస్సాం, కేరళ రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతమైన పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల సమయానికి సమాంతరంగా ఈ సమావేశాలు జరుగుతున్నాయి. అందువల్ల రాజకీయంగా కూడా ఈ సెషన్‌కు అధిక ప్రాధాన్యం ఏర్పడింది.


అవిశ్వాస తీర్మానం నేపథ్యం..

లోక్‌సభలో ఫిబ్రవరి మొదటి వారంనుంచి ప్రతిపక్షాలు నిరసనలు చేపట్టడం వల్ల సభా కార్యక్రమాలకు పలుమార్లు అంతరాయం ఏర్పడింది. ఆర్మీ మాజీ చీఫ్ ఎం.ఎం. నరవాణే రాసిన పుస్తకంలోని కొన్ని వ్యాఖ్యలను కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ ఉటంకించేందుకు అనుమతి ఇవ్వని కారణంగా స్పీకర్‌పై విమర్శలు వెల్లువెత్తాయి. ఈ పరిణామం ప్రతిపక్షాల్లో అసంతృప్తిని పెంచింది. ఫిబ్రవరి 4న రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై చర్చ సందర్భంగా ప్రధాని మోదీ ప్రసంగించాల్సి ఉన్నా.. నిరసనల కారణంగా అది సాధ్యపడలేదు. అనంతరం ఫిబ్రవరి 5న ప్రధాని ప్రసంగం లేకుండానే తీర్మానం వాయిస్ ఓటుతో ఆమోదం పొందింది. స్పీకర్ స్వయంగా ధన్యవాద తీర్మానాన్ని చదివి వినిపించారు. తర్వాత సభలో అనుచిత ప్రవర్తన ఆరోపణలతో 8 మంది ప్రతిపక్ష సభ్యులను బడ్జెట్ సమావేశాల మిగిలిన కాలానికి సస్పెండ్ చేశారు. ఈ చర్య ప్రతిపక్షాలను మరింత ఆగ్రహానికి గురిచేసింది.


ప్రతిపక్షాలు కలిసి వస్తాయా?

స్పీకర్ ఓం బిర్లా “పక్షపాత ధోరణి”తో వ్యవహరిస్తున్నారంటూ ప్రతిపక్ష కూటమి అవిశ్వాస తీర్మానం సమర్పించింది. అయితే ప్రతిపక్షాల ఐక్యతపై కూడా సందేహాలు వ్యక్తమవుతున్నాయి. కొన్ని ప్రాంతీయ పార్టీలు ఈ తీర్మానానికి పూర్తి మద్దతు ఇవ్వకపోవడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది.

సభకు హాజరు కావొద్దని ప్రధానికి తానే సూచించానని స్పీకర్ బిర్లా పేర్కొనగా, కాంగ్రెస్ నేత ప్రియాంక గాంధీ వాద్రా ఆ వాదనను ఖండించారు.


మార్చి 9 కీలక రోజు...

ఇప్పటివరకు జరిగిన పరిణామాలన్నింటి మధ్య, మార్చి 9న జరిగే చర్చ, ఓటింగ్ రాజకీయంగా అత్యంత కీలకంగా మారింది. అవిశ్వాస తీర్మానం ఫలితం ఏదైనా, బడ్జెట్ సమావేశాల రెండో విడతలో ప్రభుత్వ–ప్రతిపక్షాల మధ్య తీవ్ర వాగ్వాదాలు కొనసాగనున్నాయని స్పష్టంగా కనిపిస్తోంది. సభలో చట్టాల ఆమోదం, ప్రతిపక్ష వ్యూహాలు, ఎన్నికల సమీకరణాలు - ఇవన్నీ కలిపి ఈ సెషన్‌ను దేశ రాజకీయాల్లో ప్రత్యేక ఘట్టంగా నిలబెట్టనున్నాయి.

Read More
Next Story