మండలిలో ’లడ్డూ‘ పోరు
x

మండలిలో ’లడ్డూ‘ పోరు

అధికార, విపక్షాల వాగ్వాదం.. సభ రేపటికి వాయిదా.


ఆంధ్రప్రదేశ్ శాసనమండలిలో తిరుమల లడ్డూ ప్రసాదం అంశంపై గురువారం హైడ్రామా చోటుచేసుకుంది. ఈ అంశంపై చేపట్టిన స్వల్పకాలిక చర్చ అధికార, ప్రతిపక్ష సభ్యుల మధ్య తీవ్ర వాగ్వాదానికి దారితీసింది. ఇరుపక్షాల ఆందోళనలతో సభలో గందరగోళం నెలకొనడంతో ఛైర్మన్ కొయ్యే మోషేన్ రాజు సమావేశాలను శుక్రవారానికి వాయిదా వేశారు.

స్టేట్‌మెంట్ వర్సెస్ రిప్లై .. నిబంధనలపై రచ్చ

చర్చ ప్రారంభమైన సమయంలో ప్రభుత్వం తరఫున స్టేట్‌మెంట్ ఇచ్చేందుకు తనకు అవకాశం ఇవ్వాలని మంత్రి పయ్యావుల కేశవ్ కోరారు. అయితే, స్వల్పకాలిక చర్చలో మంత్రికి కేవలం సమాధానం (Reply) ఇచ్చే అవకాశం మాత్రమే ఉంటుందని, ముందుగా స్టేట్‌మెంట్ ఇచ్చే వెసులుబాటు ఉండదని ఛైర్మన్ స్పష్టం చేశారు. స్టేట్‌మెంట్ కాపీలు సిద్ధం చేయాలంటూ ఛైర్మన్ కార్యాలయం నుంచి లేఖ వచ్చిందని మంత్రి పేర్కొనగా, తన అనుమతి లేకుండా ఆ లేఖ ఎలా సిద్ధం చేశారని ఛైర్మన్ ప్రశ్నించడం సభలో చర్చనీయాంశమైంది.

రాజకీయాల కోసం దేవుడి ప్రసాదమా? బొత్స ధ్వజం

ప్రభుత్వం చర్చకు భయపడుతోందని ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ ఆరోపించారు. కోట్లాది మంది కొలిచే దేవదేవుడి ప్రసాదాన్ని ప్రభుత్వం రాజకీయ అవసరాల కోసం వాడుకుంటోంది అని ఆయన విమర్శించారు. లడ్డూ అంశంపై పూర్తిస్థాయిలో చర్చ జరగాలని వైఎస్సార్‌సీపీ సభ్యులు సభలో ఆందోళనకు దిగారు. మరోవైపు, ప్రభుత్వం చర్చకు సిద్ధంగా ఉందని, అయితే నిబంధనల ప్రకారమే ముందుకెళ్లాలని మంత్రి పయ్యావుల కేశవ్ వాదించారు.

గందరగోళం.. వాయిదా

చర్చ సాగుతున్న క్రమంలో ఇరుపక్షాల సభ్యులు పోడియం వద్దకు చేరుకుని నినాదాలు చేయడంతో సభలో తీవ్ర గందరగోళం ఏర్పడింది. ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటూ సభను స్తంభింపజేయడంతో, చర్చ కొనసాగించే పరిస్థితి లేక ఛైర్మన్ మోషేన్ రాజు సభను రేపటికి వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు.

Read More
Next Story