
ప్రపంచ హిందూ సమాజానికి తలవంచి క్షమాపణలు: నారా లోకేష్ సంచలన ప్రకటన
లోకేష్ సారథ్యంలో జాతీయ సమస్యగా లడ్డూ వివాదం
దేశ ఆర్థిక రాజధాని ముంబయి నడిబొడ్డున.. జాతీయ స్థాయి మేధావులు, పాత్రికేయుల సాక్షిగా ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేష్ ఒక సంచలన ప్రకటన చేశారు. ’తిరుమల లడ్డూ ప్రసాదం విషయంలో గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన అపచారానికి రాష్ట్ర ప్రతినిధిగా తాను ప్రపంచవ్యాప్త హిందూ సమాజానికి బేషరతుగా క్షమాపణలు చెబుతున్నా‘నంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు ఒక్కసారిగా సదస్సులో నిశ్శబ్దాన్ని నింపాయి. కేవలం రాజకీయ ఆరోపణలకే పరిమితం కాకుండా, ఒక బాధ్యతాయుతమైన మంత్రిగా ఆయన తీసుకున్న ఈ ’క్షమాపణ‘ నిర్ణయం.. లడ్డూ వివాదాన్ని గల్లీ స్థాయి నుంచి ఢిల్లీ స్థాయికి, అంతర్జాతీయ వేదికల వరకు తీసుకెళ్లింది. జగన్ సర్కార్ హయాంలో జరిగిన ఈ కెమికల్ క్రైమ్ పై లోకేష్ చేసిన ఘాటు విమర్శలు ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమవుతున్నాయి.
అపచారానికి పాల్పడితే ’వెయ్యి సార్లు‘ వణకాల్సిందే లోకేష్ అల్టిమేటం
"2019 నుంచి 2024 వరకు తిరుమల పవిత్రతపై జరిగిన దాడి అక్షరాలా వాస్తవం.. అది కేవలం నెయ్యి కల్తీ మాత్రమే కాదు, భక్తుల నమ్మకంపై జరిగిన కుట్ర" అంటూ మంత్రి నారా లోకేష్ నిప్పులు చెరిగారు. లడ్డూ తయారీలో అప్పట్లో వాడిన ప్రమాదకరమైన కెమికల్ కాంపౌండ్స్ వివరాలను ప్రస్తావిస్తూ, జగన్ ప్రభుత్వ హయాంలో ఈ ఘోర అపచారం జరిగిందని ఆయన తీవ్రంగా ఖండించారు. ఈ క్రమంలో ఏర్పాటైన సిట్ (SIT) విచారణ నివేదిక ఆధారంగా, ’అప్పటి టీటీడీ చైర్మన్ మొదలుకుని ఈ పాపంలో పాలుపంచుకున్న ఏ ఒక్కరినీ వదిలిపెట్టే ప్రసక్తి లేదని, చట్టం తన పని తాను చేసుకుపోతుందని‘ స్పష్టం చేశారు.
చరిత్రలో నిలిచిపోయే శిక్షలు
’తిరుమల కొండపై ఇలాంటి అపచారానికి పాల్పడాలంటే భవిష్యత్తులో ఎవరైనా వెయ్యి సార్లు ఆలోచించేలా కూటమి ప్రభుత్వ చర్యలు ఉంటాయని‘ లోకేష్ వెల్లడించారు. ’రాబోయే రోజుల్లో ఇచ్చే శిక్షలు ఒక గుణపాఠంలా ఉండాలి. దేవుడి ప్రసాదంతో ఆటలాడుకుంటే పరిణామాలు ఎంత దారుణంగా ఉంటాయో ఈ కేసు నిరూపిస్తుంది‘ అని ఆయన హెచ్చరించారు. ’బాధ్యులు ఎంతటి వారైనా, ఏ హోదాలో ఉన్నా సరే.. హిందూ సమాజం మనోభావాలను దెబ్బతీసినందుకు తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని‘ లోకేష్ ఈ సందర్భంగా హెచ్చరికలు జారీ చేశారు.
మంత్రి లోకేష్ బహిరంగ క్షమాపణ
’తిరుమల లడ్డూ అంటే అది కేవలం ఒక ప్రసాదం మాత్రమే కాదు.. కోట్లాది మంది భక్తుల నమ్మకం, ఒక పవిత్రమైన అనుబంధం‘ అంటూ మంత్రి నారా లోకేష్ భావోద్వేగానికి గురయ్యారు. భక్తులు లడ్డూను స్వీకరించేటప్పుడు కనీసం చెప్పులు కూడా వేసుకోకుండా, ఎంతటి భక్తిశ్రద్ధలతో ఉంటారో గుర్తు చేస్తూ.. అలాంటి పవిత్ర ప్రసాదంలో కల్తీ జరగడం అక్షరాలా క్షమించరాని నేరమని పేర్కొన్నారు. గత ప్రభుత్వ హయాంలో జరిగిన ఈ తప్పిదానికి, ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధిగా తాను ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందూ సమాజానికి తలవంచి క్షమాపణలు చెబుతున్నానని ఆయన ప్రకటించడం సదస్సులో అందరినీ ఆకట్టుకునే ప్రయత్నం చేశారు.
కల్తీకి చెక్.. తిరుమలలో వరల్డ్ క్లాస్ ల్యాబ్
తిరుమల పవిత్రతను కాపాడటంలో ఇకపై ఎటువంటి రాజీ ఉండబోదని లోకేష్ స్పష్టం చేశారు. భవిష్యత్తులో కల్తీ నెయ్యి కొండపైకి అడుగుపెట్టకుండా ఉండేందుకు తిరుమలలో ’వరల్డ్-క్లాస్ టెస్టింగ్ ఫెసిలిటీ‘ (అత్యాధునిక ప్రయోగశాల)ను యుద్ధప్రతిపాదికన నిర్మిస్తున్నట్లు వెల్లడించారు. టీటీడీకి సరఫరా అయ్యే ప్రతి చుక్క నెయ్యిని అంతర్జాతీయ ప్రమాణాలతో పరీక్షించిన తర్వాతే లడ్డూ తయారీకి అనుమతిస్తామని, ఈ విషయంలో అత్యంత కఠినమైన నిబంధనలను అమలు చేస్తున్నామని ఆయన వివరించారు.
జాతీయ స్థాయిలో రాజకీయ వ్యూహం
ముంబయి వేదికగా జాతీయ మీడియా ప్రతినిధి మేఘప్రసాద్ అడిగిన ప్రశ్నలకు లోకేష్ ఇచ్చిన సమాధానాల వెనుక లోతైన రాజకీయ వ్యూహం కనిపిస్తోంది. లడ్డూ వివాదాన్ని కేవలం ఆంధ్రప్రదేశ్ సరిహద్దులకే పరిమితం చేయకుండా, దేశవ్యాప్త హిందూ భక్తుల సమస్యగా మార్చడంలో లోకేష్ సరికొత్త వ్యూహానికి తెరలేపారు. తద్వారా వైఎస్సార్‌సీపీని జాతీయ స్థాయిలో డిఫెన్స్‌లోకి నెట్టడమే కాకుండా, సనాతన ధర్మ పరిరక్షణలో కూటమి ప్రభుత్వం ఎంత చిత్తశుద్ధితో ఉందో చాటిచెప్పడానికి పావులు ముమ్మరం చేశారు. లోకేష్ సారథ్యంలో ఇప్పుడు ఈ లడ్డూ వివాదం ఒక ’నేషనల్ ఇష్యూ‘గా మారి దేశవ్యాప్త చర్చకు దారితీసింది.
Next Story

