
సోషల్ మీడియా పోస్టుపై కాంగ్రెస్ Vs బీజేపీ
కమలం పార్టీ పోస్టుతో వేడెక్కిన కర్ణాటక రాజకీయాలు..
కర్ణాటక(Karnataka)లో అధికార–ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం కొత్త మలుపు తిరిగింది. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ‘స్కామ్ లార్డ్స్’గా చిత్రీకరిస్తూ బీజేపీ చేసిన సోషల్ మీడియా పోస్టు రాజకీయ ఉద్రిక్తతలకు తెరలేపగా, పరువు నష్టం కలిగించే ప్రచారమంటూ కెపీసీసీ సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించింది. అవినీతి ఆరోపణలు, కౌంటర్ దాడులతో రాష్ట్ర రాజకీయాలు మరోసారి ఘర్షణాత్మక దశలోకి ప్రవేశించాయి.
సిద్ధరామయ్య నేతృత్వంలోని కాంగ్రెస్(Congress) ప్రభుత్వాన్ని లక్ష్యంగా చేసుకుని ‘స్కామ్ లార్డ్స్’ అంటూ సోషల్ మీడియాలో పోస్ట్ చేసినందుకు కర్ణాటక బీజేపీపై కర్ణాటక ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (కెపీసీసీ) సైబర్ క్రైమ్ పోలీసులను ఫిర్యాదు చేసింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. కాంగ్రెస్ ప్రభుత్వంపై తప్పుడు ఆరోపణలు చేస్తూ గందరగోళం సృష్టించాలనే ఉద్దేశంతో ఈ పోస్టు పెట్టారని కెపీసీసీ తన ఫిర్యాదులో పేర్కొంది.
ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. ఈ పోస్టులో ఏవైనా చట్టపరమైన ఉల్లంఘనలు జరిగాయా? అనే కోణంలో దర్యాప్తు కొనసాగుతోందని వెల్లడించారు.
ఇంతకు ఆ పోస్ట్ ఏమిటి?
ముఖ్యమంత్రి సిద్ధరామయ్య(CM Siddaramaiah), ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్(DK Shivakumar)తో పాటు ఇతర మంత్రులను ‘స్కామ్ లార్డ్స్’గా అభివర్ణిస్తూ తమ అధికారిక X (ట్విట్టర్) హ్యాండిల్‌లో బీజేపీ పెట్టిన పోస్ట్ పరువు నష్టం కలిగించేదిగా ఉందని కెపీసీసీ ఆరోపించింది. ఈ మేరకు బెంగళూరులోని సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్‌లో కెపీసీసీ లీగల్ సెల్ ఫిర్యాదు చేసింది. బీజేపీ(BJP) తన పోస్టులో “కర్ణాటకను పగలు, రాత్రి దోచుకుంటున్న @INCKarnataka ప్రభుత్వ స్కామ్ సామ్రాజ్యానికి ఇదే నిజమైన కథ” అంటూ వ్యాఖ్యానిస్తూ #CongressFailsKarnataka, #ScamSarkara హ్యాష్‌ట్యాగ్‌లను ఉపయోగించింది.
‘ఎక్సైజ్ మంత్రి రాజీనామా చేయాలి’
ఇదిలా ఉండగా.. రాష్ట్రంలో రూ.6వేల కోట్లకు పైగా జరిగినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎక్సైజ్ కుంభకోణంపై సమగ్ర దర్యాప్తు జరపాలని కర్ణాటక బీజేపీ అధ్యక్షుడు బి.వై. విజయేంద్ర డిమాండ్ చేశారు. ఈ వ్యవహారంపై రాష్ట్ర ఎక్సైజ్ మంత్రి రామప్ప తిమ్మాపూర్ రాజీనామా చేయాలని పట్టుబడుతున్నారు. ఈ కుంభకోణంలో మంత్రి కుటుంబ సభ్యుల ప్రమేయం ఉన్నట్లు ఇప్పటికే ఆధారాలు బయటపడ్డాయని, అయినప్పటికీ సీఎం సిద్ధరామయ్య అసెంబ్లీలో ఈ అంశంపై చర్చకు ముందుకు రావడం లేదని విజయేంద్ర ఆరోపించారు. కుంభకోణంపై సీబీఐ లేదా సిట్టింగ్ హైకోర్టు న్యాయమూర్తితో విచారణ జరపాలన్నది విజయేంద్ర(Vijayendra) డిమాండ్. ఈ మేరకు బీజేపీ, జనతాదళ్ (లౌకిక)తో కలిసి విధాన సౌధ వద్ద మహాత్మా గాంధీ విగ్రహం సమీపంలో నిరసన చేపట్టనున్నట్లు తెలిపారు.

