చంద్రబాబు స్కిల్ కేసులో కీలక ట్విస్ట్
x

చంద్రబాబు స్కిల్ కేసులో కీలక ట్విస్ట్

సీఐడీ క్లోజర్ రిపోర్ట్‌పై హైకోర్టులో పోరాటానికి దిగిన అజయ్‌రెడ్డి.


ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలను కుదిపేసిన స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో తాజాగా ఊహించని మలుపు చోటుచేసుకుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై నమోదైన ఈ కేసును మూసివేస్తూ సీఐడీ దాఖలు చేసిన క్లోజర్ రిపోర్ట్‌ పై ఇప్పుడు న్యాయపోరాటం మొదలైంది. అసలు ఫిర్యాదుదారుడనైన తనకే కనీస నోటీసు ఇవ్వకుండా, తన వాదన వినకుండా కేసును ఎలా ముగిస్తారని ప్రశ్నిస్తూ స్కిల్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ అజయ్‌రెడ్డి హైకోర్టును ఆశ్రయించారు. సీఐడీ వ్యూహమా? లేక నిబంధనల ఉల్లంఘనా? అన్న చర్చ ఇప్పుడు ఏపీ న్యాయ వర్గాల్లో వేడెక్కింది.

నేనే ఫిర్యాదుదారుని.. నాకు నోటీసు ఎక్కడ?
ఫిర్యాదుదారుడు అజయ్‌రెడ్డి తరఫున సీనియర్ న్యాయవాది పాపెల్లుగారి వీరారెడ్డి గురువారం హైకోర్టులో బలమైన వాదనలు వినిపించారు. సీఐడీ నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్‌లో ఫిర్యాదుదారు (Complainant) కాలమ్‌లో అజయ్‌రెడ్డి పేరే ఉంది. చంద్రబాబు గతంలో దాఖలు చేసిన క్వాష్ పిటిషన్లలో కూడా అజయ్‌రెడ్డిని డీఫ్యాక్టో ఫిర్యాదుదారుగా పేర్కొన్నారు. మరి ఇప్పుడు క్లోజర్ రిపోర్ట్ ఇచ్చే సమయంలో ఆయనను థర్డ్ పార్టీ అని ఏసీబీ కోర్టు ఎలా అంటుంది? అని వాదించారు. కేసును పూర్తిగా మూసివేసేలోపు, ఆ రిపోర్టును వ్యతిరేకిస్తూ ప్రొటెస్ట్ పిటిషన్ దాఖలు చేసే అవకాశం కల్పించాలని కోరారు.
ఏసీబీ కోర్టు ఉత్తర్వులపై అభ్యంతరం
గతంలో ఏసీబీ కోర్టు అజయ్‌రెడ్డి పిటిషన్‌ను కొట్టివేస్తూ, ఆయనను ఈ కేసుతో సంబంధం లేని వ్యక్తిగా పరిగణించింది. ఈ నిర్ణయాన్ని రద్దు చేయాలని అజయ్‌రెడ్డి హైకోర్టును కోరారు. ఒక ఫిర్యాదుదారుడిగా, కేసు దర్యాప్తు ముగింపు దశలో తన వాదనలు వినాల్సిన బాధ్యత దర్యాప్తు సంస్థపై ఉంటుందని, కానీ సీఐడీ ఆ నిబంధనలను ఉల్లంఘించిందని ఆయన తరఫు న్యాయవాదులు కోర్టు దృష్టికి తీసుకువచ్చారు.
విచారణార్హత లేదన్న సిట్ (SIT) న్యాయవాదులు
మరోవైపు, సీఐడీ సిట్ తరఫున సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాదులు ముకుల్ రోహత్గీ, మాధవ్ ఖురానా వాదనలు వినిపిస్తూ.. ఈ వ్యాజ్యానికి అసలు విచారణార్హత లేదని కొట్టిపారేశారు. ఈ కేసులో అజయ్‌రెడ్డి పిటిషనరే కాదని, కాబట్టి ప్రతివాదులకు నోటీసులు ఇవ్వాల్సిన అవసరం కూడా లేదని స్పష్టం చేశారు. ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయమూర్తి డాక్టర్ జస్టిస్ వెంకట జ్యోతిర్మయి ప్రతాప, తదుపరి విచారణను ఈ నెల 12కి వాయిదా వేశారు.
Read More
Next Story