
ఢిల్లీ మద్యం పాలసీ కేసు: కేజ్రీవాల్, సిసోడియా విడుదల
తీర్పును హైకోర్టులో సవాల్ చేయనున్న కేంద్ర దర్యాప్తు సంస్థ..
ఢిల్లీ మద్యం పాలసీ కేసులో మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా సహా 23 మంది నిందితులకు ఢిల్లీ కోర్టు క్లీన్ చిట్ ఇచ్చింది. ఈ కేసులో నిందితులపై సీబీఐ సాక్ష్యాధారాలను నిరూపించలేకపోయిందని స్పష్టం చేసింది.
కేసు నేపథ్యం..
గతంలో ఢిల్లీలో అధికారంలో ఉన్న ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) ప్రభుత్వం.. మద్యం విక్రయాల విధానాన్ని సులభతరం చేయడం, మద్యం అమ్మకం ద్వారా ప్రభుత్వానికి అదనపు ఆదాయం రావడం కోసం కొత్త ఎక్సైజ్ విధానాన్ని తీసుకొచ్చింది. అయితే ఈ విధానంలో అవినీతి, అక్రమాల చోటుచేసుకున్నాయని కేజ్రీవాల్, సిసోడియా సహా మరికొంతమందిని నిందితులుగా పేర్కొంటూ సీబీఐ కేసు నమోదు చేసింది. ఆ తర్వాత జరిగిన పరిణామాల నేపథ్యంలో ఆప్ ముఖ్య నేతలు జైలుకెళ్లి బెయిల్‌పై బయటకు వచ్చారు. అయితే ఈ కేసుకు సంబంధించి నిందితుల లావాదేవీలకు సంబంధించి ఎలాంటి ఆధారాలను సీబీఐ చూపలేకపోయింది. దీంతో నిందితులను కోర్టు విడుదల చేసింది.
హైకోర్టులో సీబీఐ అప్పీల్..
కోర్టు తీర్పుపై సీబీఐ అసంతృప్తి వ్యక్తం చేసింది. కోర్టు తీర్పును హైకోర్టులో సవాల్ చేయనున్నారు. "దర్యాప్తులోని అనేక అంశాలను పరిగణనలోకి తీసుకోవడం వల్ల నిందితులను విడుదల చేసింది. ట్రయల్ కోర్టు తీర్పుపై హైకోర్టులో అప్పీలుకు వెళ్తాం" అని దర్యాప్తు అధికారి ఒకరు చెప్పారు.
కేజ్రీవాల్ కామెంట్..
తీర్పు వెలువడిన వెంటనే కేజ్రీవాల్ మీడియాతో మాట్లాడారు. ఈ కేసును "స్వతంత్ర భారతదేశ చరిత్రలో అతిపెద్ద రాజకీయ కుట్ర"గా ఆయన అభివర్ణించారు. "ఈ కేసు పూర్తిగా నకిలీది. దీని వెనక ప్రధాని మోదీ, హోం మంత్రి అమిత్ షా పాత్ర ఉంది" అని ఆరోపించారు.

