
కర్ణాటక కాంగ్రెస్‌లో అంతర్గత పోరు..పార్టీ చీఫ్‌ను కలిసేందుకు ఢిల్లీకి..
మంత్రివర్గ మార్పు, సీఎంను మార్చాలన్న డిమాండ్లతో హస్తినకు చేరుకున్న పార్టీ ఎమ్మెల్యేలు..
కర్ణాటకలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వంలో అంతర్గత విభేదాలు తీవ్రరూపం దాల్చాయి. మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ, ముఖ్యమంత్రి మార్పు డిమాండ్లతో రాష్ట్ర రాజకీయాలు ఇప్పుడు ఢిల్లీ కేంద్రంగా మారాయి. పార్టీ హైకమాండ్ నిర్ణయం కోసం ఎమ్మెల్యేలు రాజధానిలో మకాం వేసి ఎదురు చూస్తున్నారు.
సుమారు 30 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు మంత్రివర్గంలో చోటు కోసం తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. తమకు అవకాశం కల్పించాలంటే ప్రస్తుత మంత్రివర్గంలో మార్పులు అవసరమని వారు వాదిస్తున్నారు. 20 మందికి పైగా మంత్రులను తొలగించి కొత్తవారికి అవకాశం ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. ప్రస్తుత మంత్రుల పనితీరుపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ, తమ సమస్యలకు స్పందన లేదని ఆరోపిస్తున్నారు.
పార్టీ చీఫ్ అపాయింట్‌మెంట్ కోసం..
ఈ నేపథ్యంలో పార్టీ చీఫ్ మల్లికార్జున ఖర్గే (Mallikarjun Kharge), కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) మరో కీలక నేత రణదీప్ సింగ్ సుర్జేవాలా (Randeep Singh Surjewala)తో సమావేశం కోసం ఎమ్మెల్యేలు అపాయింట్‌మెంట్లు కోరారు. అయితే ఇప్పటివరకు వారికి సమయం కేటాయించలేదు. హైకమాండ్ పిలిస్తే తమ అభ్యర్థనలు వినిపించేందుకు సిద్ధంగా ఉన్నారు.
సీఎంను కూడా మార్చాలి..
ఇదే సమయంలో, ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ (D. K. Shivakumar)కు మద్దతుగా ఉన్న వర్గం మరో డిమాండ్‌ను ముందుకు తెచ్చింది. కేవలం మంత్రివర్గ మార్పు కాకుండా, ముఖ్యమంత్రి మార్పు కూడా జరగాలని వారు కోరుతున్నారు. పునర్వ్యవస్థీకరణపై చర్చ జరిగితే, తమ వాదనను కూడా వినాలని ఈ వర్గం స్పష్టం చేసింది.
ఈ రెండు వర్గాల మధ్య పోరు పెరుగుతుండడంతో, కర్ణాటక కాంగ్రెస్ రాజకీయాలు పూర్తిగా ఢిల్లీకి చేరాయి. హైకమాండ్ ఎవరికి మద్దతు ఇస్తుందనే దానిపై తీవ్ర ఆసక్తి నెలకొంది. తదుపరి పరిణామాలు రాష్ట్ర రాజకీయాల్లో కీలక మలుపు తిప్పే అవకాశముంది.

