‘SIR’ నేపథ్యంలో కర్ణాటక క్యాబినెట్ భేటీ
x

‘SIR’ నేపథ్యంలో కర్ణాటక క్యాబినెట్ భేటీ

ప్రత్యేక రాజకీయ వ్యూహానికి ప్రణాళిక..


Click the Play button to hear this message in audio format

బీహార్‌లో అమలు చేసిన నమూనాను కర్ణాటకలో కూడా అమలుచేయాలని ఎన్నికల కమిషన్ చూస్తున్న నేపథ్యంలో, సిద్ధరామయ్య నేతృత్వంలోని ప్రభుత్వం రాజకీయ వ్యూహాన్ని సిద్ధం చేస్తున్నట్లు సమాచారం. లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ బెంగళూరు వేదికగా ఓట్ల తారుమారుపై మొదటిసారి ఆరోపణలు చేస్తూ ప్రచారం ప్రారంభించారు. లోక్‌సభ ఎన్నికల సమయంలో మహదేవపుర అసెంబ్లీ నియోజకవర్గంలో ఓటు మార్పిడి జరిగిందని ఆయన పేర్కొన్నారు. అనంతరం పార్లమెంట్‌లో కూడా ఎన్నికల కమిషన్ ప్రతిపాదించిన SIR ప్రక్రియను తీవ్రంగా విమర్శిస్తూ, “నిజమైన ఓటర్లను జాబితాల నుంచి తొలగించే ప్రయత్నం జరుగుతోంది” అని ఆరోపించారు.

గతంలో బీహార్‌లో నిర్వహించిన SIR ప్రక్రియలో లక్షలాది ఓటర్ల పేర్లు తొలగించి ముసాయిదా ఓటరు జాబితా తయారుచేసిన విషయం తెలిసిందే. అవసరమైన పత్రాలు లేకపోవడం, సాంకేతిక కారణాలు వంటి అంశాలతో పెద్ద ఎత్తున పేర్లు తొలగించడంపై దేశవ్యాప్తంగా చర్చ జరిగింది. ఇదే విధానాన్ని కర్ణాటకలో అమలు చేస్తే లక్షలాది మంది ఓటర్లు జాబితా నుంచి తొలగిస్తారన్న ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.

ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ SIR‌ను “ఓటర్ల హక్కులను హరించే కుట్ర”గా అభివర్ణిస్తోంది. మరోవైపు BJP, JD(S) సహా ప్రతిపక్షాలు ఈ ప్రక్రియకు మద్దతు తెలుపుతూ.. నకిలీ ఓటర్లు, డూప్లికేట్ ఎంట్రీలను తొలగించేందుకు ఇది అవసరమని వాదిస్తున్నాయి.

క్యాబినెట్ సమావేశంలో SIR‌కు వ్యతిరేకంగా తీర్మానం ఆమోదించడం, లేక చట్టపరమైన సవాళ్లపై ముందడుగు వేయడం వంటి అంశాలపై చర్చ జరిగే అవకాశముంది. ఓటర్ల జాబితా సవరణ అనే పేరుతో ఈ ప్రక్రియను రాజకీయ ప్రయోజనాలకు వాడుకుంటున్నారనే విమర్శలు ఒకవైపు వినిపిస్తుండగా, పారదర్శకత కోసం ఇది అవసరమనే వాదనలు మరోవైపు కొనసాగుతున్నాయి. దీంతో కర్ణాటక రాజకీయాల్లో SIR అంశం మరింత వేడి పుట్టిస్తోంది.

Read More
Next Story