
జోగి రమేష్ నివాసంపై పెట్రోల్ బాంబులతో దాడి
ఆదివారం మధ్యాహ్నం సుమారు వందలాది మంది టీడీపీ కార్యకర్తలు నిరసన తెలుపుతూ జోగి రమేష్ నివాసాన్ని చుట్టుముట్టారు.
ఎన్టీఆర్ జిల్లా విజయవాడకు సమీపంలోని ఇబ్రహీంపట్నంలో ఆదివారం మధ్యాహ్నం రాజకీయ సెగలు ఒక్కసారిగా దావాగ్నిలా మారాయి. వైఎస్సార్సీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి జోగి రమేష్ నివాసాన్ని వందలాది మంది టీడీపీ శ్రేణులు ముట్టడించి, పెట్రోల్ బాంబులతో నిప్పు పెట్టడం ఏపీ రాజకీయాల్లో పెను సంచలనం సృష్టించింది. సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్‌లపై జోగి చేసిన వ్యాఖ్యలే ఈ బీభత్సానికి ఆజ్యం పోయగా..నివాసంలో ఆయన కుటుంబ సభ్యులు ఉన్న సమయంలోనే ఈ విధ్వంసం జరగడం రాష్ట్రవ్యాప్తంగా కలకలం రేపుతోంది. అసలేం జరిగిందంటే..
దాడికి దారితీసిన నేపథ్యం
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేశ్‌లను ఉద్దేశించి శనివారం జోగి రమేష్ చేసిన ఘాటు వ్యాఖ్యలు ఈ వివాదానికి కేంద్రబిందువుగా మారాయి. ముఖ్యంగా లోకేశ్‌కు చిప్ దెబ్బతింది అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలపై టీడీపీ శ్రేణులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాయి. దీనికి తోడు తిరుమల లడ్డూ కల్తీ అంశంపై ఆయన చేసిన విమర్శలు, ఫ్లెక్సీల వివాదం తోడవ్వడంతో టీడీపీ కార్యకర్తలు భారీ ఎత్తున ఛలో ఇబ్రహీంపట్నం పిలుపునిచ్చారు.
ముట్టడి.. విధ్వంసం.. దహనం
ఆదివారం మధ్యాహ్నం సుమారు వందలాది మంది టీడీపీ కార్యకర్తలు నిరసన తెలుపుతూ జోగి రమేష్ నివాసాన్ని చుట్టుముట్టారు. నిరసన కాస్తా హింసాత్మకంగా మారడంతో ఆందోళనకారులు ఒక్కసారిగా రెచ్చిపోయారు. చేతిలో ఉన్న కర్రలు, రాళ్లతో ఇంటిపై దాడికి దిగారు. ఇంటి ముందున్న వైఎస్సార్సీపీ ఫ్లెక్సీలను పీకి పడేశారు. కిటికీలు, తలుపులు బద్దలు కొట్టి లోపలికి చొచ్చుకెళ్లే ప్రయత్నం చేశారు.
పరిస్థితి ఇంతటితో ఆగకుండా, మరికొందరు వ్యక్తులు తమ వెంట తెచ్చుకున్న పెట్రోల్ బాంబులను విసిరి ఇంటికి నిప్పు పెట్టారు. క్షణాల్లో మంటలు వ్యాపించి, ఇల్లు మొత్తం దట్టమైన పొగలు కమ్ముకున్నాయి. ఇంట్లోని ఖరీదైన ఫర్నిచర్, ఇతర సామగ్రి మంటల్లో పూర్తిగా ఆహుతయ్యాయి. ఆ సమయంలో జోగి రమేష్ తిరుపతిలో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఇంట్లో ఉన్నారు.
పోలీసుల తీరుపై విమర్శలు
ఈ ఘటన జరిగిన సమయంలో పోలీసులు అక్కడే ఉన్నప్పటికీ, కేవలం 'ప్రేక్షక పాత్ర' పోషించారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఆందోళనకారులు ఇంటికి నిప్పు పెట్టి అంత విధ్వంసం చేస్తున్నా పోలీసులు నిలువరించడంలో విఫలమయ్యారని వైఎస్సార్సీపీ నేతలు మండిపడుతున్నారు. ప్రస్తుతం ఇబ్రహీంపట్నంలో తీవ్ర ఉద్రిక్తత కొనసాగుతుండటంతో అదనపు బలగాలను మోహరించారు. ప్రస్తుతం జోగి రమేష్ తిరుపతిలో ఉండటంతో ఆయన అనుచరులు, వైఎస్సార్సీపీ కార్యకర్తలు కూడా భారీగా ఇబ్రహీంపట్నం చేరుకుంటున్నారు. దీంతో శాంతిభద్రతల పరిస్థితి మరింత ఆందోళనకరంగా మారింది.

