
కాంగ్రెస్ కు గుడ్ బై చెప్పిన మాజీ మంత్రి టి.జీవన్ రెడ్డి
సీఎం రేవంత్ ను సవాల్ చేసి జీవన్ రెడ్డి రాణించగలరా?
జీవన్ రెడ్డి దారెటు? 'క్లీన్ ఇమేజ్', సీనియారిటీలు ఇవాళ్టి పరిస్థితులకు పనికి వస్తాయా?
తెలంగాణ రాజకీయాల్లో నాలుగు దశాబ్దాల పాటు 'క్లీన్ ఇమేజ్' ఉన్న సీనియర్ నేతగా పేరుగాంచిన టి. జీవన్ రెడ్డి తీసుకున్న నిర్ణయం ఇప్పుడు కలకలం సృష్టించింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వైఖరిని ఎండగడుతూ, కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన ఆయన భవిష్యత్తు ఇప్పుడు ప్రశ్నార్థకమైంది. "రేవంత్‌ను సవాల్ చేసి జీవన్ రెడ్డి నిలవగలరా?" అనే దానిపై రాష్ట్రవ్యాప్తంగా చర్చసాగుతోంది.
జీవన్ రెడ్డిది ధర్మపోరాటమా?
జీవన్ రెడ్డి రాజీనామా కేవలం ఒక ఎమ్మెల్యే లేదా ఎమ్మెల్సీ రాజీనామా కాదు. అది ఒక సిద్ధాంతానికి, పార్టీ విధేయతకు జరిగిన పరాభవంగా ఆయన అనుచరులు భావిస్తున్నారు. అయితే, అధికారంలో ఉన్న రేవంత్ రెడ్డి లాంటి దూకుడున్న నాయకుడిని ఎదిరించి, క్షేత్రస్థాయిలో జీవన్ రెడ్డి ఎంతవరకు నెట్టుకురాగలరనేది ఇప్పుడు అసలు చర్చ.
ఒంటరి పోరాటం ఫలించేనా?
జీవన్ రెడ్డి తన సుదీర్ఘ రాజకీయ ప్రస్థానంలో ఎన్టీఆర్, చంద్రబాబు, కేసీఆర్ వంటి దిగ్గజాలను ఎదుర్కొన్నారు. కానీ అప్పుడు ఆయన వెనుక ఒక బలమైన పార్టీ వ్యవస్థ ఉండేది. ఇప్పుడు కాంగ్రెస్‌ను వీడి, రేవంత్‌పై యుద్ధం ప్రకటించిన వేళ.. ఆయనకు మద్దతుగా నిలిచే "రాజకీయ వేదిక" ఏది? అనే ప్రశ్న ఉదయిస్తోంది.
జనం నాడి ఎటువైపు?
జగిత్యాల ప్రాంతంలో జీవన్ రెడ్డికి వ్యక్తిగత చరిష్మా ఉన్నప్పటికీ, నేటి రాజకీయాలు 'అధికారం', 'సంక్షేమం' చుట్టూ తిరుగుతున్నాయి. రేవంత్ రెడ్డి సర్కార్ అమలు చేస్తున్న పథకాలు, పాలనను కాదని.. కేవలం 'నైతికత' ప్రాతిపదికన జనం ఆయన వెంట నడుస్తారా? అన్నది అనుమానమే. ఇప్పటికే నియోజకవర్గంలో బీఆర్ఎస్ నుంచి వచ్చిన నేతల ప్రాబల్యం పెరుగుతుండటంతో, జీవన్ రెడ్డి కేడర్ డైలమాలో పడింది.
ఈ పరిణామాలపై రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చ జరుగుతోంది. "జీవన్ రెడ్డి నిర్ణయం భావోద్వేగంతో తీసుకున్నది. 40 ఏళ్ల అనుబంధాన్ని తెంచుకోవడం అంటే.. తన రాజకీయ పునాదిని తానే కదిలించుకోవడమే. రేవంత్ రెడ్డిని కాదని ఆయన ఏ పార్టీలోకి వెళ్లినా 'గత వైభవం' రావడం కష్టమే" అని సీనియర్ రాజకీయ విశ్లేషకుడు ఎం.శ్రీనివాస్ అన్నారు.
"పార్టీలో ఉండి పోరాడాల్సింది పోయి, కీలక సమయంలో రాజీనామా చేయడం వల్ల ఆయన అనుచరులే దిక్కుతోచని స్థితిలో పడ్డారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో రేవంత్ రెడ్డిని ఢీకొట్టడం అంటే అది ఆషామాషీ వ్యవహారం కాదు" అని శ్రీనివాస్ అభిప్రాయపడ్డారు.
జీవన్ రెడ్డి ముందున్న సవాళ్లు...
జీవన్ రెడ్డి రాజీనామా తర్వాత ఆయన రాజకీయ ప్రయాణంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఏ పార్టీ తీర్థం పుచ్చుకుంటారు?, బీజేపీనా లేక బీఆర్ఎస్సా? ప్రస్తుతానికి ఆయన స్వతంత్రంగా ఉంటానని సంకేతాలిస్తున్నా, రాజకీయాల్లో అది సుదీర్ఘ కాలం సాధ్యం కాదు. సొంతంగా పార్టీ పెట్టి నడపగలిగే శక్తి సామర్థ్యాలు జీవన్ రెడ్డికి ఉన్నాయా అనే సందేహాలు ఉండనే ఉన్నాయి.
సకాలంలో తీసుకున్న నిర్ణయమేనా?
ప్రభుత్వం ఏర్పడి రెండేళ్లు కూడా కాకముందే రాజీనామా చేయడం వల్ల, ప్రజల్లో "మంత్రి పదవి దక్కలేదనే అసంతృప్తి"తో బయటకు వెళ్తున్నట్టుగా భావించే ప్రమాదం ఉంది.
రేవంత్ రెడ్డి ఇప్పటికే ఇతర పార్టీల నేతలను చేర్చుకుంటూ తన బలాన్ని పెంచుకుంటున్నారు. జీవన్ రెడ్డి ఖాళీ చేసిన స్థానాన్ని భర్తీ చేసేందుకు అధిష్టానం ఇప్పటికే ప్రత్యామ్నాయ నేతలను సిద్ధం చేస్తోంది.
జీవన్ రెడ్డి లేవనెత్తిన అంశాలు (పార్టీ ఫిరాయింపులు, కార్యకర్తల రక్షణ) నైతికంగా సరైనవే అయినప్పటికీ, రాచరిక రాజకీయాల నుండి 'రియల్ పాలిటిక్స్' వైపు మళ్లిన నేటి కాలంలో ఆయన నిలదొక్కుకోవడం ఒక పెద్ద సవాలే. రేవంత్ రెడ్డిని ఢీకొట్టి ఆయన విజేతగా నిలుస్తారా? లేక కాలక్రమంలో తెరమరుగవుతారా? అన్నది కాలమే నిర్ణయించాలి.
అంతకుముందు ఆయన ఏమన్నారంటే...
జగిత్యాలలో బుధవారం జరిగిన తన ముఖ్య అనుచరుల సమావేశంలో పార్టీకి రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ తీరుపై నిప్పులు చెరిగారు. సీఎం రేవంత్‌పై కూడా సంచలన ఆరోపణలు చేశారు.
‘శాసనమండలిలో ఏకైక సభ్యుడిగా నేనే నాయకుణ్ణి, నేనే సభ్యుడిగా పోరాడాను. 1995 ఎన్నికల్లో టీడీపీ గాలిలో కూడా జగిత్యాల స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ గెలిచింది. అది నాటి కాంగ్రెస్ ఐక్యతకు నిదర్శనం. టీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు పదేళ్లు ప్రతిపక్ష ఎమ్మెల్యేగా, ఎమ్మెల్సీగా కాంగ్రెస్ నుంచి ఒంటిచేత్తో పోరాటం చేశాను.
పది స్థానాల్లో పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించడం అనైతికం. దశాబ్ద కాలంగా చేసిన పోరాటంపై ఆధిపత్యం చెలాయించడమే అవుతుంది. అంతకుముందు ఆధిపత్యం చేసిన వాళ్లే మళ్లీ ఆధిపత్యం చేయడమేంటి?. స్థానిక సంస్థల ఎన్నికల వ్యూహాలపై సమావేశం గాంధీభవన్‌లో నిర్వహిస్తే అక్కడికి బీఆర్ఎస్ ఎమ్మెల్యే ఎలా వస్తారు? పార్లమెంట్ వంటి అత్యున్నత ఎన్నికల్లో ఒక పార్టీలో గెల్చి దానికి రాజీనామా చేయకుండా మరో పార్టీ నుంచి పోటీ చేయడం ఏం సంకేతం ఇస్తుంది?. సరే అభివృద్ధిలో కలిసి వస్తే పర్లేదు కానీ పార్టీ అంతర్గత వ్యవహారాల్లో వారి జోక్యం ఏంటి?' అని ప్రశ్నించారు.
కార్యకర్త హత్యపై రేవంత్ మౌనం
చంద్రబాబు, కేసీఆర్ పై పోరాటం చేసిన నేను ఇక నుంచి రేవంత్ రెడ్డిపై పోరాటం చేస్తా. ఇంకెంత కాలం ఈ అవమానాలు?. కాంగ్రెస్ పార్టీలో ఇంకెవరూ ఎదుగొద్దని రేవంత్ ఇదంతా చేస్తున్నారా?. రాహూల్ గాంధీ ఆలోచనలకు అనుగుణంగా నడిచే నాలాంటి వాడిని అణగదొక్కుతారా?. వేం నరేందర్ రెడ్డి ఎవరు? అని ప్రశ్నించారు
Next Story

