
బొలిశెట్టి సత్యనారాయణ (ఫైల్ ఫోటో)
పవన్ కళ్యాణ్ పార్టీకి సీనియర్ నేత బొలిశెట్టి దూరం
జనసేనకు కొంతకాలం దూరంగా ఉండనున్నట్టు ప్రకటించిన బొలిశెట్టి!
జనసేన పార్టీలో ముఖ్యునిగా వ్యవహరిస్తున్న ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి బొలిశెట్టి సత్యనారాయణ వినూత్న నిర్ణయం తీసుకున్నారు. తాను జనసేన పార్టీ బాద్యతల నుంచి కొన్నాళ్లపాటు తప్పుకుంటున్నట్టు ప్రకటించారు. ఆయన నిర్ణయం జనసేన శ్రేణులతో పాటు రాజకీయ వర్గాల్లోనూ చర్చనీయాంశమైంది. ఇంతకీ ఆయన జనసేనకు ఎందుకు దూరంగా ఉండాలనుకుంటున్నారు? ఎందుకీ నిర్ణయం తీసుకున్నారు?
పర్యావరణ పరిరక్షణకు ఉద్యమిస్తూ..
పర్యావరణ పరిరక్షణ కోసం కొన్నేళ్లుగా బొలిశెట్టి సత్యనారాయణ జాతీయ స్థాయిలో ఉద్యమిస్తున్నారు. జల బిరాదరి జాతీయ కన్వీనర్గానూ వ్యవహరిస్తున్నారు. పర్యావరణానికి విఘాతం కలిగించే సంస్థలపై ఆయన పలు కేసులు వేశారు. పర్యావరణం కోసం ఉద్యమిస్తున్న వారితో కలిసి పని చేస్తున్నారు. వాటర్ మ్యాన్ డాక్టర్ రాజేంద్రసింగ్ తదితరులతో కలిసి మన నుడి-మన నది పేరిట నదులు, జలవనరుల రక్షణ కోసం రాజకీయ యాత్ర చేస్తున్నారు. పర్యావరణంపై ఉద్యమిస్తూనే గతంలోనే జనసేన పార్టీలో చేరారు.
జనసేనలో ఆయన ప్రధాన కార్యదర్శి (పర్యావరణం) పదవిలో ఉన్నారు. ఆంధ్రప్రదేశ్లో జనసేన భాగస్వామ్యం ఉన్న కూటమి ప్రభుత్వం వచ్చాక కూడా ఆయన పర్యావరణ పరిరక్షణపై తన అంకితభావాన్ని కొనసాగిస్తున్నారు.
ఇప్పుడెందుకు తాత్కాలిక విరామం?
బొలిశెట్టి సత్యనారాయణ గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం పాలనలో (2020లో) పర్యావరణానికి సంబంధించి అప్పటి రాష్ట్ర ప్రభుత్వంపై హైకోర్టులో పిల్ (డబ్ల్యుపీ పిల్ 248/2020) దాఖలు చేశారు. ప్రస్తుత ప్రభుత్వంలో పవన్ కల్యాణ్ పర్యావరణ శాఖ మంత్రిగా ఉన్నారు. ఆయన పార్టీలో బొలిశెట్టి ప్రధాన కార్యదర్శిగా వ్యవహరిస్తున్నారు. 'అదే శాఖ ప్రతివాదిగా ఉన్న కేసులో తాను పిటిషనర్ కొనసాగడం వల్ల నైతిక ఇబ్బందులు తలెత్తకూడదన్న ఉద్దేశం.. ఈ కేసులో రాష్ట్ర ప్రభుత్వం, పర్యావరణ మంత్రిత్వశాఖ ప్రతివాదులుగా ఉన్నందున న్యాయ ప్రక్రియ నిష్పక్షపాతంగా జరగాలని, కూటమికి ఎలాంటి రాజకీయ ఇబ్బందులు కలగకూడదని నేను జనసేన బాధ్యతల నుంచి తాత్కాలికంగా తప్పుకుంటున్నాను. హైకోర్టులో తాను దాఖలు చేసిన పిల్పై తుది తీర్పు వచ్చే వరకు పార్టీకి దూరంగా ఉంటాను. ఈ సమయంలో మురుగు నీరు, పారిశ్రామిక కాలుష్య సమస్యలపై నా పోరాటాన్ని కొనసాగిస్తాను. జనసేన పార్టీ పదవుల నుంచి తప్పుకున్నప్పటికీ పార్టీ సిద్ధాంతాలకు, పవన్ కల్యాణ్ ఆశయాలకు కట్టుబడి ఉంటాను. 'మన నుడి-మన నది' రాజకీయ యాత్రను కొనసాగిస్తాను. అని మంగళవారం విడుదల చేసిన ప్రకటనలో వివరించారు.
బొలిశెట్టి నిర్ణయంపై పలువురు పర్యావరణవేత్తలు, పర్యావరణ ఉద్యమకారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఆయనకు ఫోన్ల ద్వారా అభినందనలు తెలియజేస్తున్నారు.
పవన్ కు చెప్పే విరామం...
'నేను జనసేన పార్టీ నుంచి తాత్కాలికంగా తప్పుకోవాలన్న నిర్ణయాన్ని, కారణాలను ఇప్పటికే పవన్ కల్యాణ్కు తెలియజేశాను. ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్న జనసేనలో ఉంటూ ప్రభుత్వంపై పర్యావరణ కేసుల్లో పిటిషనర్గా ఉండడం అనైతికమని భావించినట్టు ఆయనకు చెప్పాను. నా నిర్ణయాన్ని ఆయన స్వాగతించారు. నైతిక విలువలకు కట్టుబడే ఈ నైతిక విరామం నిర్ణయం తీసుకున్నాను. ఆ లేఖను మంగళవారం జనసేన అధినేత, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్కు పంపించాను' అని బొలిశెట్టి సత్యనారాయణ ‘ద ఫెడరల్ ఆంధ్రప్రదేశ్' ప్రతినిధితో చెప్పారు.
Next Story

