
అసెంబ్లీలో ’జాకీ‘లు పెట్టి లేపుకుంటున్నారు: జగన్ పొలిటికల్ పంచ్
చంద్రబాబు జాకీ పెట్టి లోకేష్ ను లేపుతుంటే, లోకేష్ జాకీ పెట్టి చంద్రబాబును లేపుతున్నారు. వీరిద్దరిని జాకీ పెట్టి పవన్ కల్యాణ్ లేపుతున్నారని జగన్ ఎద్దేవా చేశారు.
ఆంధ్రప్రదేశ్ రాజకీయ యవనికపై ఇప్పుడు జాకీల పాలిటిక్స్ ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. అసెంబ్లీ సాక్షిగా సాగుతున్న తండ్రీకొడుకుల ప్రహసనంపై వైఎస్సార్‌సీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి తనదైన శైలిలో విరుచుకుపడ్డారు. సొంతంగా నిలబడలేక తడబడుతున్న నారా లోకేష్‌ను రాజకీయంగా పైకి లేపేందుకు (Lift) చంద్రబాబు భారీ జాకీలు వాడుతున్నారని, అది ఆయన ఒక్కరి వల్ల కాక పవన్ కళ్యాణ్‌ను కూడా మరో జాకీ గా మార్చుకున్నారని జగన్ ఎద్దేవా చేశారు. ప్రజా సమస్యలను గాలికొదిలేసి, అసెంబ్లీ వేదికను కేవలం వారసుడికి ఎలివేషన్లు ఇచ్చుకునే సెల్ఫ్ డబ్బాల కార్యక్రమంగా మార్చేశారని, ఈ తండ్రీకొడుకుల ఆటలో పవన్ కేవలం ఒక సహాయక పాత్రకే పరిమితమయ్యారని జగన్ సంధించిన వ్యంగ్యాస్త్రాలు ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారాయి.
అసెంబ్లీ వేదికగా తండ్రీకొడుకులు ఒకరినొకరు పొగుడుకోవడాన్ని జగన్ తీవ్రంగా తప్పుబట్టారు. చంద్రబాబు తన కొడుక్కి జాకీలు పెట్టి ఎత్తితే, లోకేష్ తన తండ్రికి జాకీలు పెట్టి ఎత్తుతాడు. అసెంబ్లీలో ప్రజా సమస్యలు పక్కనపెట్టి, ఈ తండ్రీకొడుకుల సెల్ఫ్ డబ్బాలు, ఒకరికొకరు ఇచ్చుకునే ఎలివేషన్లు చూస్తుంటే విడ్డూరంగా ఉంది అని జగన్ వ్యాఖ్యానించారు. లోకేష్‌కు క్షేత్రస్థాయిలో పట్టు లేకపోయినా, కృత్రిమంగా ఆయన ఇమేజ్‌ను పెంచేందుకు చంద్రబాబు తాపత్రయపడుతున్నారని విమర్శించారు.
పవన్ కళ్యాణ్.. ఆ మూడో జాకీ
ఈ లిఫ్టింగ్ ప్రక్రియలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పాత్రపై జగన్ ఘాటు విమర్శలు చేశారు. చంద్రబాబు ఒక్కరి వల్ల కాకపోవడంతో, ఇప్పుడు పవన్ కళ్యాణ్ కూడా ఒక జాకీగా మారి లోకేష్‌ను లేపేందుకు సాయం చేస్తున్నారు. లోకేష్‌ను రాజకీయంగా నిలబెట్టడమే ఈ కూటమి ప్రభుత్వ ఏకైక లక్ష్యంగా కనిపిస్తోంది. పవన్ కళ్యాణ్ తన ఉనికిని చాటుకోవడం మానేసి, కేవలం లోకేష్‌ను ప్రమోట్ చేసే మూడో జాకీ'గా మారిపోయారు అని జగన్ ఎద్దేవా చేశారు.
డైవర్షన్ పాలిటిక్స్..ప్రజా వంచన
కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న డైవర్షన్ పాలిటిక్స్ వెనుక అసలు ఉద్దేశం లోకేష్ భవిష్యత్తేనని జగన్ ఆరోపించారు. సూపర్ సిక్స్ హామీలు, నిరుద్యోగ భృతి, మహిళలకు ఆర్థిక సాయం వంటి అంశాలను గాలికొదిలేసి.. కేవలం తన వారసుడికి బిల్డప్ ఇవ్వడానికే అసెంబ్లీ సమయాన్ని వృధా చేస్తున్నారని మండిపడ్డారు. 16 రోజుల అసెంబ్లీ సమావేశాల్లో ప్రజలకు ఒరిగింది సున్నా అని, కేవలం ఈ జాకీల ఆట తప్ప అక్కడ మరేమీ జరగలేదని జగన్ స్పష్టం చేశారు.
వ్యవస్థలన్నీ వారసుడి కోసమేనా
ప్రభుత్వ యంత్రాంగం, మిత్రపక్షాలు, చివరకు అసెంబ్లీ వేదికను కూడా లోకేష్ రాజకీయ ఎదుగుదలకు అనుగుణంగా చంద్రబాబు వాడుకుంటున్నారని జగన్ ధ్వజమెత్తారు. ప్రజల ఆస్తులను దోచిపెట్టడం, వారసుడిని ఎత్తడం తప్ప ఈ ప్రభుత్వానికి మరో ఎజెండా లేదు. తండ్రీకొడుకులు ఆడుతున్న ఈ ఆటను, దీనిలో పవన్ కళ్యాణ్ వహిస్తున్న పాత్రను ప్రజలు గమనిస్తున్నారు అని జగన్ హెచ్చరించారు.

