
తేదీలతో సహా హెరిటేజ్ బండారం విప్పిన జగన్..కూటమిలో కలకలం
హెరిటేజ్ మీద, నెయ్యి కల్తీ మీద జగన్ చేసిన వ్యాఖ్యలు ఏపీ రాజకీయ వర్గాల్లో కలకలం రేపుతున్నాయి.
స్క్రీన్ మీద ఆధారాలు.. నోటి వెంట తేదీల వారీగా లెక్కలు.. వెబ్‌సైట్ మార్పుల వెనుక దాగి ఉన్న అసలు గుట్టు, తిరుమల నెయ్యి కల్తీ వ్యవహారంలో ఇన్నాళ్లూ తనపై పడిన బురదను, ఆధారాల అస్త్రాలతో ఒక్క ఉదుటున చంద్రబాబు వైపు మళ్లించారు వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి. నెయ్యి సరఫరా చేసిన సంస్థలు ఎవరివి? ఆ సంస్థలకు హెరిటేజ్‌కు ఉన్న విడదీయలేని బంధం ఏంటి? రాత్రికి రాత్రే వెబ్‌సైట్ నుంచి ఆధారాలు ఎందుకు మాయం చేశారు?' అంటూ జగన్ సంధించిన ప్రశ్నలు ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో పెను ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. దేవుడి ప్రసాదం సాక్షిగా సాగుతున్న ఈ నెయ్యి నాటకంలో అసలు సూత్రధారులు ఎవరో జగన్ నేడు లెక్కలతో సహా రట్టు చేశారు. గురువారం ఆయన తాడేపల్లి వైసీపీ కేంద్ర కార్యాలయంలో మాట్లాడుతూ అనేక ఆరోపణలు గుప్పించారు.
తేదీల మాయాజాలం.. వెబ్‌సైట్ ఎడిటింగ్
హెరిటేజ్ సంస్థ తన తప్పును కప్పిపుచ్చుకోవడానికి ఎంతలా ప్రయత్నించిందో జగన్ తేదీల వారీగా వివరించారు. 2026 ఫిబ్రవరి 10 వరకు హెరిటేజ్ వెబ్‌సైట్‌లో ఇందాపూర్ డెయిరీని తమ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ గా చూపించారని, ఈ విషయం బయటకు రాగానే ఫిబ్రవరి 15న రాత్రికి రాత్రే దానిని కో-మ్యానుఫ్యాక్చరింగ్ గా మార్చేశారని ఆధారాలు చూపారు. సరిగ్గా దీనికి ఒక రోజు ముందే, అంటే ఫిబ్రవరి 14న హెరిటేజ్ ఫుడ్స్ హెడ్ రాజీనామా చేయడం వెనుక ఉన్న మర్మమేంటని ఆయన నిలదీశారు.
నాడు 320.. నేడు 658.. బాబు మార్క్ మాయాజాలం
ఇందాపూర్ డెయిరీ అసలు టీటీడీలోకి ఎలా వచ్చిందో జగన్ విశ్లేషించారు. 2015లో చంద్రబాబు అధికారంలో ఉండగానే ఈ డెయిరీ ఎంటర్ అయ్యింది. 2016లో కల్తీ ఆరోపణలతో డిస్‌క్వాలిఫై అయినా, మళ్ళీ మూడు నెలలకే దానికి అర్హత కల్పించారు. 2018లో కేజీ నెయ్యిని రూ. 320కి అమ్మిన అదే సంస్థ, ఇప్పుడు బాబు రాగానే రూ. 658కి టెండర్ దక్కించుకుంది. అంటే ధర రెట్టింపు అవ్వడం వెనుక ఉన్న కమీషన్ల గుట్టు ఎవరిది? అని నిలదీశారు.
భోలే బాబా.. సిట్ ఛార్జ్‌షీట్ నిజాలు
నెయ్యి సరఫరా చేసిన మరో సంస్థ భోలే బాబా (హర్ష్ ఫ్రెష్ డెయిరీ) కు టెక్నికల్ క్వాలిఫికేషన్ ఇచ్చింది కూడా 2018లో చంద్రబాబు బోర్డేనని జగన్ గుర్తు చేశారు. సీబీఐ సిట్ ఛార్జ్‌షీట్ ప్రకారం.. 2025 జూలైలో రిజెక్ట్ అయిన ట్యాంకర్ల నెయ్యిని ఆగస్టు, సెప్టెంబర్ నెలల్లో లడ్డూ తయారీలో వాడారని, అదంతా చంద్రబాబు పాలనలోనే జరిగిందని స్పష్టం చేశారు.
మండలిలో చర్చకు భయం అందుకే
తిరుమల తిరుపతి లడ్డూ ప్రసాదం అపవిత్రతకు, నెయ్యి కల్తీకి సంబంధించి అన్నీ కనెక్షన్లు చంద్రబాబు వైపే ఉంటే.. వైసీపీకి ఏం సంబంధం? అని జగన్ ప్రశ్నించారు. హెరిటేజ్ సంస్థతో ఉన్న ఈ వ్యాపార సంబంధాలు బయటపడతాయనే భయంతోనే శాసన మండలిలో ప్రభుత్వం చర్చకు అనుమతించడం లేదని ఆయన విమర్శించారు. అబద్ధాలు, మోసాలతో దేవుడితో చంద్రబాబు చెలగాటమాడుతున్నారని మండిపడ్డారు.

