జగన్ కాలువలు పారించారు... చంద్రబాబు కాలువలు తవ్వే పనిలో ఉన్నారు...
x
శ్రీ పూలసుబ్బయ్య వెలిగొండ ప్రాజెక్టులో రెడీ అయిన మొదటి టెన్నెల్

జగన్ కాలువలు పారించారు... చంద్రబాబు కాలువలు తవ్వే పనిలో ఉన్నారు...

వెలిగొండ ప్రాజెక్టు కరువు ప్రాంతాలకు వరప్రసాదం. కానీ వాస్తవికత ఏమిటి? దీని నిర్మాణం ఆలస్యంలో ఎవరి పాపం ఎంత?


ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీ పూలసుబ్బయ్య వెలిగొండ ప్రాజెక్టు నిర్మాణంలో పాలకుల నిర్లక్ష్యం, అవినీతి స్పష్టంగా వెలుగులోకి వస్తోంది. ఎందుకంటే 2006లో మొదలైన ఈ కీలక నీటిపారుదల ప్రాజెక్టు 2009 నాటికి పూర్తి కావాల్సి ఉంది. 2026 వచ్చినా ఇంకా అసంపూర్తిగా మిగిలిపోయింది. దీనివల్ల ప్రకాశం (మార్కాపురం), నెల్లూరు, కడప జిల్లాల రైతులు తీవ్ర నష్టాలు చవిచూస్తున్నారు. గత వైఎస్‌ఆర్‌సీపీ ప్రభుత్వాన్ని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ 2025లో తీవ్రంగా విమర్శించారు. అవినీతి, నిర్లక్ష్యం కారణంగా ప్రాజెక్టు ఆలస్యమైందని ఆరోపించారు. అయితే గత ప్రభుత్వాలు కూడా ఇందుకు బాధ్యత వహించాల్సి ఉంది.

ప్రాజెక్టు నిర్మాణం పూర్తి కాకుండానే కాలువల్లో కాసిన్ని నీళ్లు పోసి గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం ప్రాజెక్టును జాతికి అంకితం చేసింది. ఇటీవల ముఖ్యమంత్రి చంద్రబాబు ఫీడర్ కెనాల్స్ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఇటువంటి వ్యవహారాల వల్ల ప్రజల్లో పాలకులపై ఉన్న విశ్వాసం దెబ్బతినడమే కాకుండా, రాష్ట్ర అభివృద్ధి కూడా అడ్డంకులు ఎదుర్కొంటోంది. ఒకరు నీళ్లు పారిస్తే... మరొకరు ఫీడర్ కెనాల్స్ కు శంకుస్థాపన చేయడం విడ్డూరంగా ఉంది. ప్రశ్నించే ప్రజలు ప్రజాస్వామ్యంలో ముఖ్యం. వారు లేరనే నమ్మకం పాలకుల్లో ఉంది. అందుకే పాలకుల ఆటలు సాగుతున్నాయి. విజన్ ల పేర్లు చెప్పి సీఎం చంద్రబాబు పాలిస్తుంటే తాను చెప్పింది చేశానని జగన్ చెప్పుకుంటుంటున్నారు. ఇద్దరూ ఇద్దరేనని, ప్రజలను భ్రమల్లో బతికేలా చేస్తున్నారనే చర్చ ఆంధ్రప్రదేశ్ ప్రజల్లో ఉంది.


సుంకేసుల వద్ద నిర్మించిన వెలిగొండ ప్రాజెక్టు ఆనకట్ట

కరవు సీమకు వర ప్రసాదం

మార్కాపురం జిల్లా ప్రాంతం ఒకప్పుడు కరువు కాటుకు గురవుతూ రైతులను ఇబ్బంది పెట్టేది. ఇప్పుడు కూడా భూగర్భ జలాలపై ఆధారపడి బోర్లతో పంటలు పండిస్తున్నారు. ఎర్రనేలలు సమృద్ధిగా ఉన్న ఈ ప్రాంతంలో పండ్ల తోటలలైన బొప్పాయి, అరటి, దానిమ్మ, నిమ్మ, బత్తాయి వంటివి పండుతున్నాయి. ఇవి ఢిల్లీ, ముంబయి, చెన్నై, బెంగళూరు వంటి నగరాలకు ఎగుమతి అవుతున్నాయి. అయితే ప్రాసెసింగ్ యూనిట్ల లోపంతో రైతులు మరిన్ని లాభాలు ఆర్జించలేకపోతున్నారు. ఇటువంటి పరిస్థితుల్లో శ్రీ పూలసుబ్బయ్య వెలిగొండ ప్రాజెక్టు మార్కాపురం జిల్లాతో పాటు కర్నూలు, కడప జిల్లాలలోని పలు మండలాలకు వరప్రసాదంగా మారనుంది. ఈ ప్రాజెక్టు పూర్తయితే, కరువు ప్రాంతాల్లో సాగు, తాగునీటి సమస్యలు తీరి, ఆర్థిక వృద్ధి పెరుగుతుంది.

ప్రాజెక్టు ప్రాముఖ్యత

వెలిగొండ ప్రాజెక్టు ఆంధ్రప్రదేశ్‌లోని కరువు, ఫ్లోరైడ్ సమస్యలతో సతమతమవుతున్న ప్రాంతాలకు జీవనాడిగా రూపుదిద్దుకుంది. ఇది కృష్ణా నది నుంచి శ్రీశైలం రిజర్వాయర్‌లోని వరద నీటిని నల్లమల సాగర్ రిజర్వాయర్‌కు మళ్లించడం ద్వారా సాగు, తాగునీటి అవసరాలు తీరుస్తుంది. ప్రాజెక్టు మొత్తం సామర్థ్యం 43.5 టీఎమ్‌సీలు. ఇందులో ఇరిగేషన్‌కు 4.48 లక్షల ఎకరాలు (మొదటి దశలో 1.19 లక్షల ఎకరాలు, రెండో దశలో 3.28 లక్షల ఎకరాలు), తాగునీటికి 15.25 లక్షల మంది (మొదటి దశలో 4 లక్షలు, రెండో దశలో 11.25 లక్షలు) లబ్ధి పొందుతారు. ఇది మార్కాపురం (ప్రకాశం), నెల్లూరు, కడప జిల్లల్లోని 30 మండలాలను కవర్ చేస్తుంది. ఇందులో ప్రకాశం జిల్లాలోని దొనకొండ మెగా ఇండస్ట్రియల్ హబ్‌కు 2.58 టీఎమ్‌సీలు, పామూరు, పెదచెర్లోపల్లి మండలాల్లోని నేషనల్ ఇన్వెస్ట్‌మెంట్ అండ్ మాన్యుఫ్యాక్చరింగ్ జోన్‌కు 1.27 టీఎమ్‌సీలు కూడా కేటాయించారు.


ఈ ప్రాజెక్టు కేవలం సాగు మాత్రమే కాకుండా ఫ్లోరైడ్ ప్రభావిత ప్రాంతాల్లో తాగునీటి సమస్యను పరిష్కరిస్తుంది. వరద కాలంలో కృష్ణా నది నుంచి నీటిని మళ్లించడం ద్వారా భూగర్భ జలాలపై ఆధారపడకుండా రైతులు అన్ని రకాల పంటలు పండించవచ్చు. ఇది ఆర్థికంగా వెనుకబడిన ప్రాంతాల్లో వ్యవసాయ ఉత్పాదకత పెంచి, ఉపాధి అవకాశాలు సృష్టిస్తుంది. అయితే ప్రస్తుతం రైతులు ప్రాసెసింగ్ లేకపోవడంతో పూర్తి లాభాలు పొందలేకపోతున్నారు. ప్రాజెక్టు పూర్తయితే ఇది మారవచ్చు.

చరిత్ర, నిర్మాణ పురోగతి

1996లో అప్పటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శంకుస్థాపన చేశారు. అయితే పనులు మొదలు కాలేదు. 2004-2009లో డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో పునఃప్రారంభమై, 18.5 కి.మీ. దూరంలోని శ్రీశైలం రిజర్వాయర్ నుంచి నీటిని మళ్లించేందుకు రెండు సమాంతర సొరంగాలు (పెద్దదోర్నాల మండలం కొత్తూరు వద్ద) తవ్వారు. మొదటి సొరంగం పూర్తయింది. రెండోది 2 కి.మీ. తక్కువగా పూర్తి చేశారు. ఆయన హటాన్మరణం తర్వాత కె రోశయ్య, నల్లారి కిరణ్‌కుమార్ రెడ్డి హయాంలో పనులు సరిగ్గా ముందుకు సాగలేదు. 2014-2019లో చంద్రబాబు హయాంలో కూడా పూర్తి కాలేదు. 2019-2024లో వైఎస్ జగన్ హయాంలో రెండో సొరంగం పూర్తి చేసినట్లు చెప్పుకుని 2024 మార్చిలో ట్విన్ టన్నెల్స్‌ను ప్రారంభించారు. అయితే పూర్తి ప్రాజెక్టు 100 శాతం పూర్తి కాకముందే నీటిని తీసుకొచ్చినట్లు ప్రకటించడం వివాదాస్పదమైంది.

ప్రస్తుతం 2024లో అధికారంలోకి వచ్చిన చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఈ ప్రాజెక్టును ప్రాధాన్యతగా తీసుకుంది. 2026 మార్చి 5తో 30 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ట్విట్టర్‌లో స్పందిస్తూ ‘‘నేను శంకుస్థాపన చేశాను, నేనే ప్రారంభిస్తాను’’ అని పేర్కొన్నారు. వారం రోజుల క్రితం ఫీడర్ కాలువలకు శంకుస్థాపన చేశారు. అయితే రెండో సొరంగంలో ఇంకా 0.5 కి.మీ. పూర్తి కావాలి. మెయిన్ కెనాల్స్ మరమ్మతులు అవసరం. ప్రభుత్వం 2025 సెప్టెంబర్‌లో రూ.4,000 కోట్లు అదనపు నిధులు విడుదల చేసి, 2026 ఆగస్టుకు పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది.


నల్లమల సాగర్ డ్యామ్ లోపలి భాగం

ప్రభుత్వ ప్రాధాన్యతలు

ప్రభుత్వాలు మారినప్పుడల్లా ప్రాజెక్టు ప్రాధాన్యతలు మారుతున్నాయి. YSR హయాంలో వేగవంతమైన పురోగతి కనిపించింది. కానీ తర్వాతి పాలకులు ఫండింగ్, టెక్నికల్ సమస్యలతో (నల్లమల అడవుల్లో సొరంగాలు) ఆలస్యం చేశారు. ప్రస్తుత ప్రభుత్వం గోదావరి-కృష్ణా-పెన్నా నదుల ఇంటర్‌లింకింగ్‌లో భాగంగా దీన్ని చూస్తోంది. ఇది భవిష్యత్ నీటి సురక్షితకు కీలకం. అయితే 20,946 కుటుంబాల వలసలు, పరిహారం ఆలస్యాలు వివాదాలు సృష్టిస్తున్నాయి.

ఈ ప్రాజెక్టు పూర్తయితే రైతులు భూగర్భ జలాలపై ఆధారపడకుండా స్థిరమైన సాగు చేయవచ్చు. ఆర్థిక వృద్ధి పెరుగుతుంది. కానీ ఆలస్యాలు ప్రజలలో అసంతృప్తి సృష్టిస్తున్నాయి. పాలకులు ప్రకటనలకు మాత్రమే పరిమితమవుతున్నారా అనే సందేహాలు ఉన్నాయి. ప్రభుత్వం ఇప్పుడు వేగవంతం చేస్తే, ఇది నిజంగా వరప్రసాదమవుతుంది. లేకుంటే మరో ఆలస్యం ప్రజలను మరింత బాధపెడుతుంది.

Read More
Next Story