మా జగనన్నా మోదీకి బానిసే, జైల్లో పెడతారని భయమేమో!
x

'మా జగనన్నా మోదీకి బానిసే, జైల్లో పెడతారని భయమేమో!'

జగన్ చేసిన పనికి మా నాన్న ఆత్మ ఘోషిస్తోందన్న షర్మిల


'మా జగనన్నా మోదీ పార్టీకి దత్తపుత్రుడేనని, విపక్షాలను విమర్శించే అర్హత మా అన్నకు లేదని' కాంగ్రెస్ పార్టీ ఏపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల వైసీపీ అధినేత, తన సోదరుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై విరుచుకుపడ్డారు. డీలిమిటేషన్ బిల్లును మహిళా బిల్లుతో ఎలా తీసుకువస్తారని ప్రశ్నించాల్సిన వ్యక్తే కమలం పార్టీ చంకలో దూరతారా అని నిలదీశారు.
జగన్‌ బీజేపీ దత్తపుత్రుడేనని తేలిపోయిందని, రాజ్యాంగానికి విఘాతం కలిగించే అక్రమ బిల్లులకు వంతపాడటంతో ఆయన ముసుగు తొలగిపోయిందని షర్మిల విమర్శించారు. బీజేపీతో పెట్టుకున్న అక్రమ పొత్తు కూడా బయటపడిందన్నారు. తనపై ఉన్న కేసుల నుంచి రక్షణ కోసం వైసీపీ అధ్యక్షుడు జగన్‌.. మోదీకి బానిసలా బతుకుతున్నారని విరుచుకుపడ్డారు. డీలిమిటేషన్‌ బిల్లులపై ఎన్డీయే పక్షాన నిలబడినందుకు జగన్‌మోహన్‌రెడ్డికి సిగ్గుండాలని శనివారం ఓ ప్రకటనలో ధ్వజమెత్తారు. వైఎస్సార్‌ ఆశయాలు, వారసత్వాన్ని ముందుకు తీసుకెళ్లడమంటే ఇదేనా అని జగన్‌ను ప్రశ్నించారు. రాజ్యాంగ రక్షణ కంటే బీజేపీకి భజనే తన సోదరుడికి ముఖ్యమన్నట్లుందని మండిపడ్డారు.
‘వైసీపీ ప్రభుత్వ హయాంలో చేసిన అవినీతి నుంచి బయటపడేందుకు ఆ పార్టీకి అంతగా అంటకాగాలా? బీజేపీ పెట్టిన బిల్లులకు గుడ్డిగా తలాడించాలా? మోదీ మెప్పు కోసం సొంతంగా కాకిలెక్కలు అల్లాలా? బీజేపీ తెచ్చిన అక్రమ బిల్లులకు విపక్షాలు అడ్డుపడి విజయం సాధిస్తే, ఏం సాధించారని ప్రశ్నించడం హాస్యాస్పదం కదా? దొంగ బిల్లులకు ఓటేసి మీరేం సాధించారు’ అని షర్మిల ప్రశ్నలు సంధించారు. జగన్‌ చేసిన నీచపు పనికి వైఎస్సార్‌ ఆత్మ ఘోషిస్తోందని వ్యాఖ్యానించారు.
‘వైసీపీ విపక్షాలకు మద్దతు ఇవ్వాల్సింది పోయి అధికార పక్షానికి ఇలా సలాం కొట్టడమా? మహిళా రిజర్వేషన్ల బిల్లును డీలిమిటేషన్‌కు లింకు పెట్టడం జగన్‌ అవివేకానికి నిదర్శనం. మహిళా బిల్లు 2023లోనే పాస్‌ అయింది. ఇప్పుడు విపక్షాలు అడ్డుకున్నది మోదీ లబ్ధి కోసం ప్రవేశపెట్టిన డీలిమిటేషన్‌ బిల్లును మాత్రమే. బిల్లులకు మద్దతు ఇవ్వడం ద్వారా రాష్ట్రంలో విపక్షం ముసుగులో ఉన్నది కూడా ఆరెస్సెస్‌ పక్షమేననే విషయం ప్రజలందరికీ తెలిసిపోయింది. ఇక రాష్ట్రంలో ప్రతిపక్షం ఒక్క కాంగ్రెస్‌ పార్టీ మాత్రమే’ అని షర్మిల పేర్కొన్నారు.
తెలుగుదేశం, జనసేన కూడా ఇప్పటికైనా సిగ్గు తెచ్చుకోవాలని, బీజేపీ పంచన ఉండి రాజ్యాంగానికి తూట్లు పొడుస్తూ ఉంటే చూస్తూ ఉంటారా అని ప్రశ్నించారు.
Read More
Next Story