
జగన్ ’మర్చంట్ ఆఫ్ డెత్‘ అట
జగన్‌కు విధ్వంసం, శవ రాజకీయాలంటేనే ఇష్టమంటూ సోమిరెడ్డి తీవ్ర విమర్శలు గుప్పించారు.
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సాక్షిగా వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై మాజీ మంత్రి, టీడీపీ సీనియర్ నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి విరుచుకుపడ్డారు. జగన్‌ను ’మర్చంట్ ఆఫ్ డెత్‘ (మృత్యు వ్యాపారి) అంటూ అభివర్ణించి సంచలనం సృష్టించారు. జగన్ రెడ్డికి విధ్వంసం అన్నా, రాజకీయాల్లో శవాలతో ఆడుకోవడం అన్నా ఎంతో ఇష్టమని సోమిరెడ్డి ఎద్దేవా చేశారు. శవ రాజకీయాలు చేసేందుకే ఆయన రాజకీయ పార్టీని స్థాపించారని తీవ్ర ఆరోపణలు చేశారు.
డిక్కీలో శవం తెస్తే భుజం తట్టి అభినందిస్తారా?
సభలో సోమిరెడ్డి మాట్లాడుతూ.. వైసీపీ హయాంలో జరిగిన దారుణాలను గుర్తు చేశారు. కారు డిక్కీలో శవాన్ని వేసుకుని వచ్చిన తన పార్టీ ఎమ్మెల్సీ భుజం తట్టి జగన్ అభినందిస్తారు. తన ర్యాలీలో కార్యకర్తలు చనిపోతే కనీసం పరామర్శకు కూడా వెళ్లరు. కానీ, ప్రత్యర్థులను బూతులు తిట్టే వారి కోసం మాత్రం ప్రత్యేకంగా ర్యాలీలు చేపడతారు. ఆ ర్యాలీల్లో కూడా ఒకరో ఇద్దరో చనిపోయేలా ప్లాన్ చేస్తారు.. అందుకే ఆయన్ని మర్చంట్ ఆఫ్ డెత్ అంటాను అని సోమిరెడ్డి విమర్శనాస్త్రాలు సంధించారు.
తల్లిదండ్రులను దూషిస్తే ఊరుకోం.. చట్టం తేవాల్సిందే
రాజకీయ ప్రత్యర్థుల తల్లిదండ్రులను అత్యంత దారుణంగా దూషించే సంస్కృతిని వైసీపీ ప్రోత్సహించిందని సోమిరెడ్డి మండిపడ్డారు. బూతులు తిట్టే నేతలను జగన్ కనీసం కట్టడి చేయలేకపోయారని, పైగా వారిని ప్రోత్సహించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజకీయాల్లో ఇలాంటి పోకడలు ఆగిపోవాలని, నేతల తల్లిదండ్రులను దూషించే వారిని కఠినంగా శిక్షించేలా రాష్ట్రంలో ఒక ప్రత్యేక చట్టాన్ని తీసుకురావాలని ఆయన కూటమి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

