
అన్నీ అబద్ధాలే..అంకెల గారడీలే
బడ్జెట్‌పై మాజీ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ ఘాటు విమర్శలు.
కూటమి ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్.. అభ్యుదయ బాట కాదు, అసత్యాల మూట అంటూ మాజీ ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ నిప్పులు చెరిగారు. అసెంబ్లీ సాక్షిగా అంకెల గారడీ చేస్తూ, ‘సూపర్ సిక్స్’ హామీలను తుంగలో తొక్కారని ఆయన ధ్వజమెత్తారు. ‘గతేడాది బడ్జెట్ పుస్తకాన్నే మళ్ళీ చదువుతున్నట్లు ఉంది తప్ప, ఇందులో కొత్తదనం ఎక్కడ?’ అని ప్రశ్నించిన బుగ్గన.. అప్పుల లెక్కలపై మౌనం వహిస్తూ, ఊహల్లో విహరిస్తున్న ఆదాయ అంచనాలను ప్రజలు నమ్మే స్థితిలో లేరని ఎద్దేవా చేశారు. వైసీపీ హయాంలో నిర్మించిన విలేజ్ క్లీనిక్‌లు, ఆర్బీకేల పునాదులపై నిలబడి.. అబద్ధాలతో కూటమి ప్రభుత్వం పగటి కలలు కంటోందని ఆయన విమర్శల విల్లు ఎక్కుపెట్టారు.
మీడియాతో మాట్లాడిన బుగ్గన రాజేంద్రనాథ్, కూటమి ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ ప్రసంగంపై నిప్పులు చెరిగారు. అసెంబ్లీ సాక్షిగా ప్రజలకు అబద్ధాలు చెప్పడం అనేది రాజ్యాంగ రీత్యా పెద్ద నేరమని ఆయన మండిపడ్డారు. ప్రభుత్వం చెప్పే మాటలకు, బడ్జెట్ అంకెలకూ పొంతన లేదని, ప్రజలను తప్పుదోవ పట్టించేలా ప్రసంగం అంతా అసత్యాలతో నిండిపోయిందని ఆయన ఆరోపించారు.
నిధుల కేటాయింపులో స్పష్టత కరువు
బడ్జెట్‌లో ఏ రంగానికి ఎంత మొత్తం కేటాయించారో స్పష్టంగా వివరించలేదని బుగ్గన ధ్వజమెత్తారు. గతేడాది బడ్జెట్ పుస్తకాన్ని మళ్ళీ చూస్తున్నట్లే ఉంది తప్ప, ఇందులో ఎలాంటి కొత్తదనం కనిపించడం లేదు. కేవలం ఊహాజనితమైన లెక్కలతో బడ్జెట్‌ను రూపొందించారు అని ఆయన ఎద్దేవా చేశారు. ముఖ్యంగా అప్పుల వివరాలను ప్రభుత్వం దాచాలని చూస్తోందని, రాష్ట్రంపై ఉన్న అసలు అప్పు ఎంతో చెప్పడానికి ప్రభుత్వం ఎందుకు వెనకాడుతోందని ఆయన ప్రశ్నించారు.
సూపర్ సిక్స్ ఎక్కడ?
ఎన్నికల సమయంలో సూపర్ సిక్స్ పేరుతో ప్రజలకు భారీ హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన కూటమి, తీరా బడ్జెట్ వచ్చేసరికి వాటిని విస్మరించిందని బుగ్గన విమర్శించారు. నిరుద్యోగ భృతి, ఆడబిడ్డ నిధి వంటి పథకాలకు సరైన కేటాయింపులు లేవని, ఈ బడ్జెట్ ప్రజలను ఆశపెట్టి నిరాశకు గురిచేసేలా ఉందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. కేవలం మూడు నెలల్లో రూ. 44,500 కోట్ల ఆదాయం వస్తుందని చెప్పడం నమ్మశక్యం కాదని, ఇదంతా కేవలం అంకెల గారడీ అని ఆయన కొట్టిపారేశారు.
వైసీపీ హయాంలో అభివృద్ధిని విస్మరించలేరు
తమ పాలనలో జరిగిన అభివృద్ధిని ఈ సందర్భంగా బుగ్గన గుర్తు చేశారు. లక్షా 35 వేల మంది యువకులకు ఉపాధి కల్పించడంతో పాటు, రాష్ట్రవ్యాప్తంగా 10,032 విలేజ్ క్లీనిక్‌లు, 10,775 రైతు భరోసా కేంద్రాలను తాము ఏర్పాటు చేశామని చెప్పారు. నాడు-నేడు ద్వారా ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలు మార్చడానికి రూ. 3,700 కోట్లు ఖర్చు చేశామని, ఈ వాస్తవాలను కప్పిపుచ్చి ప్రభుత్వం కేవలం ప్రచారానికే ప్రాధాన్యత ఇస్తోందని అని ఆయన ఎద్దేవా చేశారు.
వైసీపీ హయాంలో అభివృద్ధిపై బుగ్గన వివరణ
తమ పాలనలో రాష్ట్రం అన్ని రంగాల్లో గణనీయమైన అభివృద్ధి సాధించిందని బుగ్గన రాజేంద్రనాథ్ ఈ సందర్భంగా గణాంకాలతో సహా వివరించారు. ముఖ్యంగా నిరుద్యోగ సమస్య పరిష్కారానికి తమ ప్రభుత్వం పెద్దపీట వేసిందని, ఐదేళ్ల కాలంలో ఏకంగా లక్షా 35 వేల మంది యువకులకు ప్రభుత్వ రంగంలో శాశ్వత ప్రాతిపదికన ఉపాధి కల్పించామని ఆయన గుర్తు చేశారు. కూటమి ప్రభుత్వం ఇప్పుడు ఉద్యోగాల గురించి మాట్లాడుతోందే తప్ప, తాము చేసిన స్థాయిలో నియామకాలు చేపట్టలేదని విమర్శించారు.
వైద్య, వ్యవసాయ రంగాల్లో తాము విప్లవాత్మక మార్పులు తెచ్చామని బుగ్గన పేర్కొన్నారు. సామాన్యులకు వైద్యం చేరువ చేసేందుకు రాష్ట్రవ్యాప్తంగా 10,032 విలేజ్ క్లీనిక్‌లను, రైతులకు అండగా నిలిచేందుకు 10,775 రైతు భరోసా కేంద్రాలను (RBK) ఏర్పాటు చేశామని తెలిపారు. ఈ వ్యవస్థలు క్షేత్రస్థాయిలో ప్రజలకు ఎంతో మేలు చేస్తున్నాయని, వీటిని నిర్మించిన ఘనత తమ ప్రభుత్వానిదేనని ఆయన స్పష్టం చేశారు.
పాఠశాలల అభివృద్ధి గురించి మాట్లాడుతూ..
నాడు-నేడు కార్యక్రమం ద్వారా ప్రభుత్వ స్కూళ్ల రూపురేఖలు మార్చడానికి రూ. 3,700 కోట్లు ఖర్చు చేశామని బుగ్గన వెల్లడించారు. తాము నిర్మించిన మౌలిక సదుపాయాలను చూపిస్తూ, ఆ అభివృద్ధి క్రెడిట్‌ను ఇప్పుడు కూటమి ప్రభుత్వం తమ ఖాతాలో వేసుకోవాలని చూడటం హాస్యాస్పదమని ఆయన మండిపడ్డారు. ప్రభుత్వం కొత్తగా చేసేది ఏమీ లేదని, తాము చేసిన పనులనే రంగులు మార్చి చూపిస్తున్నారని ఆరోపించారు.

