
జాతీయ రాజకీయాల్లో మమత ప్రముఖ పాత్ర పోషించబోతున్నారా?
S.I.Rను తీవ్రంగా తప్పుబడుతున్న పశ్చిమ బెంగాల్ సీఎం మమత బెనర్జీ రానున్న రోజుల్లో ఏం చేయబోతున్నారు? ఆమె వ్యూహమేంటి?
“కేంద్రంలోని భారతీయ జనతా పార్టీకి ఎదురొడ్డి పోరాటే నాయకురాలు మమతా బెనర్జీ మాత్రమే. ఆమె అనుసరిస్తున్న మార్గమే బీజేపీ(BJP)ని ఎదుర్కొనే సరైన మార్గం,” - అఖిలేష్ యాదవ్
పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఓటరు జాబితా సవరణ ప్రక్రియ(SIR)పై భారత ఎన్నికల సంఘంతో (EC) చాలాకాలంగా విభేదిస్తున్న విషయం తెలిసిందే. అయితే ఈ వివాదాన్ని కాస్త ఆమె జాతీయ స్థాయికి తీసుకెళ్లాలని నిర్ణయించారు. రాష్ట్రంలో మొదలైన ఈ వివాదాన్ని ప్రతిపక్ష రాజకీయాల ప్రధాన అంశంగా మార్చేందుకు ప్రయత్నిస్తున్నారు.
‘‘చాలా లోపాలున్నాయి.’’
SIR ప్రక్రియను “లోపభూయిష్టమైనది”గా పేర్కొన్న మమతా.. అది ప్రజాస్వామ్య హక్కులను, సమాఖ్య వ్యవస్థను దెబ్బతీస్తుందని ఆరోపిస్తున్నారు. బీజేపీయేతర, ఎన్డీయేతర పార్టీలన్నింటికీ ఒక తాటిపైకి తేవాలని, వాటికి ఆమె సారధ్యం వహించే యోచనలో ఉన్నట్లు రాజకీయ వర్గాల సమాచారం.
‘ఓటర్లకు తీవ్ర నష్టం’
SIR ఇలాగే కొనసాగితే ఓటర్లకు భారీ నష్టం జరుగుతుందని మమత హెచ్చరించారు. భారీ సంఖ్యలో ఓటర్లు తమ ఓటు హక్కును కోల్పోయే ప్రమాదం ఉందన్నారు. ఇది ప్రజాస్వామ్య పునాదులపై దాడి అని పేర్కొన్నారు. SIRలో ఉన్న లోపాలపై ఆమె ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్‌కు ఇప్పటికే లేఖలు ద్వారా ఫిర్యాదు కూడా చేశారు.
ఈసీని కలవనున్న టీఎంసీ బృందం..
న్యూఢిల్లీలోని నిర్వాచన్ సదన్‌లో 15 మంది సభ్యులతో కూడిన తృణమూల్ కాంగ్రెస్ (TMC) ప్రతినిధి బృందం ఫిబ్రవరి 2న సాయంత్రం 4 గంటలకు ఈసీ అధికారులను కలవనుంది. అందుకు ఎన్నికల సంఘం కూడా అనుమతి ఇచ్చింది. బృందంలో టీఎంసీ జాతీయ ప్రధాన కార్యదర్శి అభిషేక్ బెనర్జీ, పలువురు ఎంపీలు, అలాగే SIR ప్రక్రియ వల్ల తీవ్ర ఆందోళనకు గురై మరణించిన వారి కుటుంబ సభ్యులు ఉండే అవకాశం ఉంది. అంతేకాదు, ఎన్నికల జాబితాల్లో చనిపోయిన వారి జాబితాల్లో ఉండి ప్రస్తుతం జీవించి ఉన్న వ్యక్తులు కూడా బృందంలో ఉండొచ్చని భావిస్తున్నారు.
నేరుగా సీఈసీతో మమతా భేటి?
మమత కూడా ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్‌ను నేరుగా కలసి సమస్యలను వివరించే అవకాశం ఉంది. ముందుగా జనవరి 28న ఢిల్లీకి వెళ్లాలని ఆమె భావించినప్పటికీ, మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ విమాన ప్రమాదంలో మృతి చెందడం, అలాగే కోల్‌కతాలో జరిగిన భారీ అగ్నిప్రమాదం కారణంగా పర్యటన వాయిదా వేసుకున్నారు. సింగూర్‌లో జరిగిన బహిరంగ సభలో “ఒకటి లేదా రెండు రోజుల్లో ఢిల్లీకి వెళ్తాను” అని ప్రకటించిన విషయం తెలిసిందే.
నవంబర్ 4 SIR..
పశ్చిమ బెంగాల్‌లో నవంబర్ 4 నుంచి SIR ప్రక్రియ ప్రారంభమైంది. అప్పటి నుంచి అనేక మరణాలు చోటుచేసుకున్నాయని టీఎంసీ ఆరోపిస్తోంది. ఇవన్నీ “SIR వల్ల ఏర్పడిన భయాందోళన” కారణంగానే జరిగాయని మృతుల కుటుంబసభ్యులు చెబుతున్నారని టీఎంసీ పేర్కొంది.
‘వ్యతిరేకిస్తున్న టీఎంసీ ..’
SIR ప్రక్రియను మొదటి నుంచే టీఎంసీ వ్యతిరేకిస్తోంది. సరైన సన్నాహాలు లేకుండా, తొందరపడి ఈ ప్రక్రియను ప్రారంభించారని పార్టీ విమర్శిస్తోంది. సామాన్య ప్రజలను వేధించడానికి, ఎన్నికల జాబితాల నుంచి ఎంపిక చేసుకుని ఓటర్ల పేర్లు తొలగించడానికి దీన్ని ఉపయోగిస్తున్నారనే అనుమానాలు వ్యక్తం చేసింది.
బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వంతో ఎన్నికల సంఘం కుమ్మక్కై పనిచేస్తోందని మమత, అభిషేక్ బెనర్జీ ఆరోపించారు. దీనికి వ్యతిరేకంగా కోల్‌కతాలో వీధి నిరసనలకు కూడా వారు నాయకత్వం వహించారు. అయితే ఈసీ ఈ ఆరోపణలను తీవ్రంగా ఖండించింది.
రాజకీయ ఐక్యతపై మమత దృష్టి..
రాజకీయ ఐక్యత కోసం మమత ప్రయత్నాలు చేస్తున్నారు. మంగళవారం కోల్‌కతాలో సమాజ్‌వాదీ పార్టీ నాయకుడు అఖిలేష్ యాదవ్‌తో ఆమె భేటీ అయ్యారు. బీజేపీకి సమర్థవంతంగా ఎదుర్కోగల నాయకురాలు మమతనే అని అఖిలేష్ ప్రశంసించారు. ఢిల్లీలో ఉన్న సమయంలో ఎన్డీఏయేతత నేతలతో మమత సమావేశాలు నిర్వహించనున్నారు.
జాతీయ ప్రతిపక్ష నాయకురాలిగా మమత..
పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం–కేంద్ర ఎన్నికల సంఘానికి మధ్య కొనసాగుతున్న ప్రతిష్టంభన అటుంచితే.. అసెంబ్లీ ఎన్నికల ముందు మమత తనను తాను జాతీయ ప్రతిపక్ష నాయకురాలిగా చెప్పుకునే ప్రయత్నమని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
“దేశవ్యాప్తంగా బీజేపీకి నిజంగా ఎదురుగా నిలబడగల నాయకురాలు మమతా బెనర్జీ మాత్రమే. ఆమె చూపిస్తున్న మార్గమే బీజేపీని ఎదుర్కొనే సరైన మార్గం,” అని అఖిలేష్ యాదవ్ వ్యాఖ్యానించారు.

