‘గీతం’కి సర్కారీ భూమి సంతర్పణేనా?
x
గీతంకి భూకేటాయింపులను నిరసిస్తూ మాట్లాడుతున్న బొత్స

‘గీతం’కి సర్కారీ భూమి సంతర్పణేనా?

విశాఖలోని గీతం విశ్వవిద్యాలయం ఆక్రమణలో ఉన్న రూ.5 వేల కోట్ల విలువైన భూమిని ఆ సంస్థకు కట్టబెట్టడానికి జీవీఎంసీ మార్గాన్ని సుగమం చేసింది.

అంతా అనుకున్నట్టే జరిగింది. కూటమి కార్పొరేటర్ల మంద బలంతో టీడీపీ విశాఖ ఎంపీ విద్యా సంస్థకు రూ.వేల కోట్ల విలువైన ప్రభుత్వ భూమిని దారాత్తం చేయడానికి జీవీఎంసీ లైన్‌ క్లియర్‌ చేసింది. ప్రతిపక్షాల అభ్యంతరాలు, ఆందోళనలు, నినాదాలు, నిరసనలను పెడచెవిన పెడుతూ మంత్రి లోకేష్‌ తోడల్లుడు, విశాఖ ఎంపీ శ్రీభరత్‌కు చెందిన గీతం విశ్వవిద్యాలయానికి 54.79 ఎకరాల ప్రభుత్వ భూమిని సంతర్పణ చేయడానికి కీలక అడుగు పడింది. రూ.5 వేల కోట్ల విలువైన ఈ భూమి గీతం యూనివర్సిటీ కబ్జాలో ఉంది. కూటమి ప్రభుత్వం వచ్చాక దీనిని క్రమబద్ధీకరించుకోవడానికి ఆ విద్యా సంస్థ శరవేగంగా పావులు కదిపింది. దీనికి జీవీఎంసీ కౌన్సిల్‌లో తీర్మానం అవసరం. అందుకోసం శుక్రవారం కౌన్సిల్‌ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. అజెండాలో ఇతర అంశాలతో పాటు గీతం ఆక్రమిత భూమి అంశాన్ని కూడా చేర్చారు. ఈ సంగతి తెలుసుకున్న వైఎస్సార్‌సీపీ, సీపీఐ, సీపీఐ (ఎం), కాంగ్రెస్‌ పార్టీలు కొన్నాళ్లుగా అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి.


మేయర్‌ పోడియం వద్ద బైఠాయించి నిరసన తెలుపుతున్న వైఎస్సార్‌సీపీ కార్పొరేటర్లు

ఆందోళనలను పట్టించుకోకుండా..
జీవీఎంసీ కౌన్సిల్‌లో గీతం భూ దోపిడీకి వీలుగా తీర్మానానికి అధికార పార్టీ సన్నద్ధమవడంతో ప్రతిపక్షాలన్నీ ఏకతాటిపై నిలిచాయి. శుక్రవారం ఆయా పార్టీల నాయకులు జీవీఎంసీ వద్దకు చేరుకున్నారు. వైఎస్సార్‌సీపీకి చెందిన మాజీ మంత్రులు బొత్స సత్యనారాయణ, కురసాల కన్నబాబు, గుడివాడ అమర్నాథ్‌ల నేతృత్వంలో ఆ పార్టీ శ్రేణులు జీవీఎంసీ ఎదురుగా ఉన్న గాంధీ విగ్రహం వద్ద నిరసన చేపట్టారు. సీపీఐ, సీపీఐ(ఎం), కాంగ్రెస్‌ నేతలు జీవీఎంసీ ప్రధాన గేటు వద్ద ఆందోళన బాట పట్టారు. గీతం చెరలో ఉన్న 54.79 ఎకరాల భూమిని ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలని డిమాండ్‌ చేశారు. మరోవైపు కౌన్సిల్‌లో వైఎస్సార్‌సీపీ కార్పొరేటర్లు గీతం విద్యా సంస్థలకు భూమిని కట్టబెట్టడాన్ని వ్యతిరేకిస్తూ నినాదాలు చేశారు. వీరు నల్ల కండవాలు ధరించి స్పీకర్‌ పోడియం వద్ద బైఠాయించి నిరసన తెలియజేశారు. వీరికి అడ్డుతగులుతూ టీడీపీ, జనసేన కార్పొరేటర్లు ప్రతి నినాదాలు చేశారు. పేదలకు ఉన్నత విద్యను అందిస్తున్న గీతంపై కక్ష సాధింపు చర్యలో భాగమే ప్రతిపక్షాల ఆందోళన అంటూ ఎదురుదాడికి దిగారు. దీంతో కూటమి కార్పొరేటర్లతో జరిగిన ఘర్షణలో వైఎస్సార్‌సీపీ కార్పొరేటర్లకు స్వల్పంగా గాయాలయ్యాయి. ఒకదశలో మేయర్‌పై కూడా దాడికి ప్రయత్నించడంతో పోలీసులు, సెక్యూరిటీ సిబ్బంది ఆయన ఛాంబర్‌కు తరలించారు.

కౌన్సిల్‌లో కుర్చీలు ఎత్తి తలపడుతున్న కూటమి, వైఎస్సార్‌సీపీ కార్పొరేటర్లు

మీడియాను సైతం అనుమతించకుండా..
జీవీఎంసీ పరిసరాల్లో భారీగా పోలీసులను మోహరించారు. కౌన్సిల్‌ సమావేశానికి మీడియాను సైతం అనుమతించలేదు. మీడియా ప్రతినిధులు పోలీసులు, అధికారులతో వాగ్వాదానికి దిగారుు. గతంలో మీడియా పట్ల ఈ తరహా నిరంకుశ ధోరణి లేదంటూ దుయ్యబట్టిని పట్టించుకోలేదు.

జీవీఎంసీ ఎదుట ఆందోళన చేస్తున్న వామపక్ష నేతలు

భూ దోపిడీకి జీవీఎంసీ సై..
ఇలా బయట ప్రతిపక్షాలను, మీడియాను కట్టడి చేస్తూ కౌన్సిల్‌లో లోపల కూటమి కార్పొరేటర్ల మంద బలంతో తాము అనుకున్నది సాధించారు. మేయర్‌ పీలా శ్రీనివాసరావు అధ్యక్షతన జరిగిన కౌన్సిల్‌ సమావేశంలో మొత్తం అజెండాలో మొత్తం 15 అంశాలను చేర్చారు. అందులో ఆఖరి అంశంగా గీతం భూ కబ్జా క్రమబద్ధీకరణను పొందుపరిచారు. కౌన్సిల్‌ సమావేశానికి 54 మంది కూటమి కార్పొరేటర్లు హాజరయ్యారు. వీరికి కూటమికి చెందిన ఎక్స్‌ అఫీషియో సభ్యులైన ముగ్గురు ఎమ్మెల్యేలు కూడా మద్దతుగా నిలవడంతో కోరం సరిపోయిందని మేయర్‌ వెల్లడించారు. ఆపై ముందస్తు వ్యూహంలో భాగంగా మేయర్‌ పీలా.. అజెండాలోని అన్ని అంశాలను 15 నిమిషాల్లోనే చదువుకుంటూ పోయి, ఎలాంటి చర్చకు తావివ్వకుండా చివరకు అన్నిటినీ ఆమోదిస్తున్నట్టు ప్రకటించారు. దీంతో ఈ 54.79 ఎకరాల ప్రభుత్వ భూమి లోకేష్‌ తోడల్లుడు, విశాఖ ఎంపీ మతుకుమిల్లి శ్రీభరత్‌కు చెందిన గీతం విశ్వవిద్యాలయానికి కట్టబెట్టేందుకు మార్గాన్ని సుగమం చేసేశారు. దీంతో ఇక కేబినెట్‌లో ఆమోదం తెలపడమే తరువాయి.
Read More
Next Story