
ప్రాజెక్టులపై కేంద్రంలో సీఎం చంద్రబాబు చక్రం తిప్పుతున్నారా?
కృష్ణా నదీ జల వివాదం: రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై చంద్రబాబు మౌనం వెనుక కారణాలు ఏమిటి? రేవంత్ రెడ్డి తన మాటలకు ఎందుకు మరింత పదును పెడుతున్నారు?
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కృష్ణా నదీ జలాల వివాదంపై శుక్రవారం చేసిన వ్యాఖ్యలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరో సారి తీవ్ర చర్చకు దారి తీశాయి.
రంగారెడ్డి జిల్లా రావిర్యాలలో సుజెన్ మెడికేర్ ప్రారంభోత్సవంలో మాట్లాడుతూ రేవంత్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును ఉద్దేశించి కీలక వ్యాఖ్యలు చేశారు. ఉమ్మడి రాష్ట్రంలో కృష్ణా నదిపై నిర్మాణమైన ప్రాజెక్టుల అనుమతులకు అడ్డంకులు సృష్టిస్తున్నారు. ఇలాంటి అడ్డంకుల వల్ల కేంద్రం నుంచి నిధులు అందడం లేదు. ఆర్థిక భారం పెరుగుతోంది. వివాదాలు కాకుండా సామరస్య పరిష్కారం కోసం రెండు రాష్ట్రాలు సహకరించుకోవాలి. ఆంధ్రప్రదేశ్ ఒక అడుగు ముందుకు వేస్తే తెలంగాణ పది అడుగులు ముందుకు వేస్తుంది. అని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు కృష్ణానదిలోని నీటిని వివాదాలకు అతీతంగా వాడుకోవాలని చెప్పినా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి వినపోవడం చర్చనియాంశమైంది.
చంద్రబాబు వ్యూహం ఏమిటి?
తెలంగాణం సీఎం రేవంత్ రెడ్డి తన మాటల్లో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుకు ఆల్టిమేటం ఇచ్చినట్లు చెప్పొచ్చు. వివాదాలు సృష్టిస్తున్నారనే ఆరోపణలు చేశారు. ఆంధ్రప్రదేశ్ ప్రజల్లో చంద్రబాబు మౌనం వెనుక ఏముందనే చర్చ ఊపందుకుంది. చంద్రబాబు స్పందన లేకపోవడం రాజకీయ విశ్లేషకులను ఆలోచనలో పడేసింది. ఈ మౌనం వెనుక బలమైన రాజకీయ వ్యూహాలు ఉన్నాయని అంచనాలు వ్యక్తమవుతున్నాయి.
కేంద్రం ద్వారానే చంద్రబాబు జల వివాదాలు పరిష్కరిస్తారా?
ప్రధానంగా చంద్రబాబు మౌనానికి కారణం రెండు రాష్ట్రాల మధ్య జల వివాదాలను కేంద్ర మధ్యవర్తిత్వంతో పరిష్కరించుకోవాలనే ఉద్దేశ్యం కావచ్చు. గతంలో జలాల పంపిణీ విషయంలో రెండు రాష్ట్రాలు కోర్టులు ఎక్కాయి. 2025 జూలైలో న్యూఢిల్లీలో జరిగిన సమావేశంలో ఆంధ్రప్రదేశ్ తెలంగాణ మధ్య కీలక జల సమస్యలు పరిష్కారమయ్యాయి. ఈ సమావేశానికి కేంద్ర జలవనరుల శాఖ మంత్రి అధ్యక్షత వహించారు. చంద్రబాబు త్వరలో జల వివాదాలను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. రేవంత్ వ్యాఖ్యలపై ప్రత్యక్ష స్పందన ఇవ్వకుండా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ ఆపివేతకు సంబంధించిన ఆరోపణలను తోసిపుచ్చింది.
చంద్రబాబు మౌనం వెనుక మరో కారణం
తెలుగుదేశం పార్టీ ఎన్డీఏ భాగస్వామి. కేంద్రంతో సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. రేవంత్ రెడ్డి కాంగ్రెస్ నాయకుడు. రెండు రాష్ట్రాల మధ్య వివాదాలు పెరిగితే కేంద్ర జోక్యం అవసరం పెరుగుతుంది. చంద్రబాబు ఈ వివాదాన్ని రాజకీయంగా ఉపయోగించుకోకుండా సహకార వైఖరి అవలంబించారు. తెలుగు మహాసభల్లో చంద్రబాబు జల వివాదాలపై మాట్లాడుతూ రెండు రాష్ట్రాలు సహకరించుకోవాలని పేర్కొన్నారు.
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి చంద్రబాబును తన రాజకీయ గురువుగా భావిస్తున్నారనేది ప్రచారమన్నారు. రాయలసీమ ప్రాజెక్ట్ ఆపివేతకు రేవంత్ ప్రయత్నాలు కారణమని ఆయన తెలంగాణ అసెంబ్లీలో చెప్పారు. కానీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ వాదనలను ఖండించింది. జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వంలోనే అనుమతులు లేకుండా ప్రాజెక్ట్ ప్రారంభమైందని ఎన్‌జీటీ ఆదేశాలతో ఆపివేశారని వివరించింది. ఈ వివాదాలు రాజకీయ లబ్ధికి ఉపయోగపడుతున్నాయని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆరోపించింది.
చంద్రబాబు మౌనం వెనుక ఆర్థిక అభివృద్ధి లక్ష్యాలు కూడా ఉన్నాయా?
ఆంధ్రప్రదేశ్ పోర్టు కనెక్టివిటీ వంటి అభివృద్ధి ప్రాజెక్టుల విషయంలో ఏపీ అవసరం తెలంగాణకు ఉంది. రెండు రాష్ట్రాలు పరస్పర సహకారంతో ముందుకు సాగితే సమస్యలు పరిష్కారమవుతాయని చంద్రబాబు భావిస్తున్నారు. వైఎస్‌ఆర్‌సీపీ నాయకులు చంద్రబాబు రాయలసీమ ప్రాజెక్ట్ ఆపివేతతో రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టు పెట్టారని విమర్శిస్తున్నారు.
వివాదాలతో ఉపయోగం లేదు: కేవీవీ
కృష్ణా జలాల వినియోగం విషయంలో వివాదాల వల్ల ఉపయోగం లేదు. ఇందుకోసం కృష్ణా నీటి యాజమాన్య బోర్డు ఉంది. ఈ బోర్డు నిర్ణయాలు రెండు తెలుగు రాష్ట్రాలకు శిరోధార్యం కావాలి అని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ప్రధాన కార్యదర్శి కెవివి ప్రసాద్ పేర్కొన్నారు. ఆయన ‘ది ఫెడరల్ ఆంధ్రప్రదేశ్’ ప్రతినిధితో మాట్లాడారు. విభజన సమయంలో ఏ నిర్ణయాలు కేంద్ర ప్రభుత్వం చేసిందో ఆ నిర్ణయాలను అమలు చేయడంలో అటు కేంద్రం, ఇటు రాష్ట్రాలు పద్ధతి ప్రకారం నడుచుకోవాలి. లేకుంటే సమస్యలు మరింత జఠిలం అవుతాయి. సమస్యలు పెరగటం వల్ల వచ్చే లాభం లేదు. సంపూర్ణమైన అనుమతులు లేకుండా ఏ ప్రాజెక్టు నిర్మాణం చేపట్టినా ఇబ్బందులు పడాల్సిందే. అనుమతులు లేకుండా ప్రాజెక్టు నిర్మాణం చేపట్టిన వైఎస్సార్సీపీ ది తప్పే. ప్రాజెక్టును పూర్తిగా ఆపివేసి కూర్చోవడం కూడా తెలుగుదేశం పార్టీ చేసిన తప్పు. కావాల్సిన అనుమతులు తీసుకునే ప్రయత్నాలు చేయాలి. రాయలసీమ ఎత్తిపోతల వల్ల పెద్దగా ఉపయోగం లేదని చెప్పలేము. అలాగని వద్దనలేము.
ప్రభుత్వాలు ప్రజా ధనాన్ని వృధా చేస్తుంటూ చూస్తూ ఊరుకోము. ప్రభుత్వం ప్రజలకు జవాబుదారీగా ఉండాలి. అంతే కాని తాను ఏది చేసినా సరిపోతుందనే ధోరణితో సాగటం మంచిది కాదు. రాయలసీమ ఎత్తిపోతల విషయంలో ఇప్పటి వరకు చేసిన ఖర్చుకు ప్రజలకు సమాధానం చెప్పాల్సిన బాధ్యత సీఎం చంద్రబాబు నాయుడుపై ఉంది.
నిగూఢ ఒప్పందాలు రాష్ట్ర ప్రయోజనాలను దెబ్బతీస్తాయి: సీపీఎం
రాయలసీమ ఎత్తిపోతల (లిఫ్ట్ ఇరిగేషన్) ప్రాజెక్టు వివాదంపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, తెలంగాణ ముఖ్యమంత్రి ఎ రేవంత్ రెడ్డి మధ్య జరిగినట్లు రహస్య ఒప్పందాలను బయట పెట్టాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు డిమాండ్ చేశారు. ప్రాజెక్టు పనులను వేగవంతం చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రయోజనాలకు హాని కలిగించే ఏవైనా నిగూఢ ఒప్పందాలను వెల్లడించాలని కోరారు.
"అదే నిజమైతే అది మన రాష్ట్రానికి తీరని అన్యాయం చేసినవారు అవుతారు. నిగూఢ ఒప్పందాలు రాష్ట్ర ప్రయోజనాలను దారుణంగా దెబ్బతీస్తాయి. సీఎం చంద్రబాబు వాస్తవాలను వెల్లడించాలి. చీకటి ఒప్పందాలను దాచి పెట్టుకోవడానికే ఇరిగేషన్‌పై ఆర్భాట ప్రకటనలు చేస్తున్నారు. రాయలసీమ, ఉత్తరాంధ్ర, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లోని వెనుకబడిన ప్రాంతాలకు లిఫ్ట్ ఇరిగేషన్ నీటిపారుదల ప్రాజెక్టులు ప్రారంభించాలి. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పనులు వేగంగా సాగించడం ద్వారా రేవంత్‌రెడ్డి ప్రకటనకు సమాధానం ఇవ్వాలి." అని పేర్కొన్నారు.
ఈ వ్యాఖ్యలు రాయలసీమ ప్రాంతంలోని వెనుకబడిన ప్రదేశాలకు నీటి సరఫరా ప్రాజెక్టులను ప్రారంభించాలని మరియు ప్రస్తుత ప్రభుత్వం ఈ విషయంలో పారదర్శకతను పాటించాలని నొక్కి చెప్పుతున్నాయి.
మొత్తంగా చంద్రబాబు మౌనం రాజకీయ వ్యూహాత్మకమైంది. ప్రత్యక్ష వివాదాలు పెంచకుండా కేంద్ర మధ్యవర్తిత్వంతో పరిష్కారం కోసం ప్రయత్నిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఈ మౌనం వెనుక రాష్ట్ర ప్రయోజనాలు రక్షణే ప్రధానమని భావిస్తున్నారు. రానున్న రోజుల్లో ఈ వివాదం ఎలాంటి మలుపు తిరుగుతుందో చూడాలి.

