ఇరాన్ యుద్ధం ప్రభావం: పార్లమెంటులో గందరగోళం
x

ఇరాన్ యుద్ధం ప్రభావం: పార్లమెంటులో గందరగోళం

చర్చకు ప్రతిపక్షం డిమాండ్


Click the Play button to hear this message in audio format

పశ్చిమాసియాలో జరుగుతోన్న యుద్ధం కారణంగా పార్లమెంటులో గందరగోళం నెలకొంది. పార్లమెంట్ సమావేశాలు సోమవారం (మార్చి 9) నుంచి ప్రారంభమైనప్పటికీ, ప్రతిపక్ష నిరసనలతో లోక్‌సభ, రాజ్యసభలు హోరెత్తాయి. దేశంలో ఇంధన భద్రతపై పూర్తి స్థాయి చర్చ జరపాలని ప్రతిపక్షం డిమాండ్ చేయగా, కేంద్ర మంత్రులు కేవలం ప్రకటనలతో సరిపెట్టడంతో ప్రతిపక్షం ఆగ్రహం వ్యక్తం చేసింది.


జైశంకర్ ప్రకటనపై నిరసనలు..

పశ్చిమాసియా పరిస్థితిపై విదేశాంగ మంత్రి జయశంకర్ వివరణ ఇచ్చేందుకు ప్రయత్నించినపుడు రాజ్యసభలో ప్రతిపక్ష ఎంపీలు నినాదాలు చేశారు. “మాకు చర్చ కావాలి” అంటూ సభ నుంచి వాకౌట్ చేశారు.

ఇరాన్, ఇజ్రాయిల్-అమెరికా మధ్య జరుగుతోన్న యుద్ధం నేపథ్యంలో భారతదేశంపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉంది. ముఖ్యంగా ఇంధన భద్రత, చమురు ధరలు, స్టాక్ మార్కెట్లు, విదేశాల్లో ఉన్న భారతీయుల భద్రత వంటి అంశాలపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలని ప్రతిపక్ష ఎంపీలు డిమాండ్ చేశారు.


ఖర్గే విజ్ఞప్తి తిరస్కరణ..

భారతదేశం దిగుమతి చేసుకునే ముడి చమురులో సుమారు 55 శాతం పశ్చిమాసియా దేశాల నుంచే వస్తోందని రాజ్యసభ ప్రతిపక్ష నేత, ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే గుర్తుచేశారు. ఈ సరఫరాలో అంతరాయం ఏర్పడితే దేశ ఆర్థిక వ్యవస్థపై పెను ప్రభావం పడుతుందని అన్నారు. పశ్చిమాసియాలో మారుతోన్న పరిస్థితులపై చర్చకు అనుమతి ఇవ్వాలని రాజ్యసభ ప్రతిపక్ష నేత, ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే కోరారు. అయితే రాజ్యసభ చైర్మన్ సీపీ రాధాకృష్ణన్ ఖర్గే విజ్ఞప్తిని తిరస్కరించడంతో ప్రతిపక్ష సభ్యులు నిరసనకు దిగారు.


లోక్‌సభలోనూ నిరసనలు..

ఇదే అంశంపై లోక్‌సభలో కూడా ప్రతిపక్ష ఎంపీల నిరసనలు కొనసాగాయి. ఉదయం సమావేశం ప్రారంభమైన కొద్దిసేపటికే సభను మధ్యాహ్నం వరకు వాయిదా వేశారు. తర్వాత మళ్లీ సమావేశమైనప్పటికీ నిరసనలు కొనసాగడంతో సభను పలుమార్లు వాయిదా వేసి చివరకు రోజంతా వాయిదా వేశారు.


బిర్లాపై అవిశ్వాస తీర్మానం..

లోక్‌సభ స్పీకర్‌ను తొలగించాలని ప్రతిపక్షం సమర్పించిన తీర్మానంపై సోమవారం చర్చ జరగాల్సి ఉంది. అయితే సభ వాయిదా పడడంతో ఆ చర్చ జరగలేదు. ఈ తీర్మానం మంగళవారం చర్చకు వచ్చింది.


ప్రతిపక్షంపై కేంద్రం విమర్శలు

కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజుజు ప్రతిపక్షాన్ని తీవ్రంగా విమర్శించారు. ప్రతిపక్షం ఒకవైపు స్పీకర్‌పై అవిశ్వాస నోటీసు ఇచ్చి, మరోవైపు వాయిదా తీర్మానం తీసుకురావడం బాధ్యతారాహిత్యమన్నారు.


ప్రతిపక్ష వ్యూహం..

ఇండియా బ్లాక్ నేతలు సోమవారం ఉదయం సమావేశమై పశ్చిమాసియా పరిస్థితిపై పార్లమెంటులో పూర్తి స్థాయి చర్చ జరగాల్సిందే అని నిర్ణయించారు.

ఇరాన్, ఇజ్రాయెల్, గల్ఫ్ దేశాల్లో సుమారు ఒక కోటి మంది భారతీయులు నివసిస్తున్నారని ప్రతిపక్షం చెబుతోంది. యుద్ధం కొనసాగితే వారి భద్రతతో పాటు భారత ఆర్థిక వ్యవస్థపై కూడా తీవ్ర ప్రభావం పడుతుందని వారు హెచ్చరిస్తున్నారు.

రాహుల్ గాంధీ వ్యాఖ్యలు..

లోక్‌సభ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ మీడియాతో మాట్లాడుతూ పశ్చిమాసియాలో జరుగుతున్న యుద్ధం ప్రపంచ రాజకీయాల్లో పెద్ద మార్పుకు దారితీయవచ్చని అన్నారు. చమురు ధరల పెరుగుదల, LPG ధరల పెంపు, స్టాక్ మార్కెట్ నష్టాలు ఇప్పటికే కనిపిస్తున్నాయని ఆయన తెలిపారు.


అఖిలేష్ యాదవ్ వ్యాఖ్య..

సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ మాట్లాడుతూ.. పశ్చిమాసియాలో పరిస్థితి తీవ్రమవుతున్న నేపథ్యంలో ప్రభుత్వం పార్లమెంటులో చర్చకు అనుమతించాలని కోరారు. దేశ ఇంధన భద్రత, విదేశాల్లో ఉన్న భారతీయుల భద్రత వంటి కీలక అంశాలపై ప్రభుత్వం సమగ్ర సమాచారం ఇవ్వాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు.

Read More
Next Story