
అజిత్ పవార్ వారసత్వంపై చర్చ అమానుషం: సంజయ్ రౌత్
ఎన్‌సీపీ, ఎన్‌సీపీ శరత్ పవార్ వర్గంతో చేతులు కలుపుతుందా?
మహారాష్ట్ర(Maharasthra) ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్(Ajit Pawar) మరణం దేశ రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది. బారామతిలో జరిగిన విమాన ప్రమాదంలో అజిత్ పవార్ మృతి చెందిన మరుసటి రోజే, ఆయన భార్య సునేత్ర పవార్‌కు రాష్ట్ర మంత్రివర్గంలో స్థానం ఇవ్వాలనే అభిప్రాయాలు ఎన్‌సీపీ (NCP)లో విపరీతంగా ప్రచారం జరుగుతోంది. కొందరు నేతలు సునేత్ర పార్టీకి కూడా నాయకత్వం వహించాలని సూచించారు. శివసేన (యూబీటీ) రాజ్యసభ ఎంపీ సంజయ్ రౌత్ శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ.. ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ ఆకస్మిక మరణం జరిగిన వెంటనే పార్టీ నాయకత్వం గురించి మాట్లాడటం “అమానుషం” అని పేర్కొన్నారు. ప్రస్తుతం ఎన్‌సీపీ బీజేపీ నేతృత్వంలోని పాలక మహాయుతి కూటమిలో భాగస్వామిగా ఉంది.
‘ఆ విషయం ఇప్పుడు అప్రస్తుతం’
"నాయకత్వ అంశంపై ఇప్పుడు మాట్లాడటం అమానుషం. ఈ విషయం ఎవరులేవనెత్తినా వారికి మానవత్వం లేనట్లే. వారు మంత్రులైనా, ఎమ్మెల్యేలైనా సరే. ఆ మహిళ (అజిత్ పవార్ భార్య సునేత్ర) తన భర్తను కోల్పోయింది. ఆమె శోకసంద్రంలో ఉంది,” అని రౌత్ అన్నారు.
బారామతి నుంచి 2024 లోక్‌సభ ఎన్నికల్లో ఓడిపోయిన సునేత్ర పవార్ ప్రస్తుతం రాజ్యసభ సభ్యురాలిగా కొనసాగుతున్నారు. పవార్ బారామతి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ఉన్నారు. 66 ఏళ్ల అజిత్ పవార్ బుధవారం జరిగిన విమాన ప్రమాదంలో మృతి చెందిన సంగతి తెలిసిందే. అజిత్ పవార్ మరణం తర్వాత శరద్ పవార్ నేతృత్వంలోని ఎన్‌సీపీ (ఎస్పీ)తో విలీనంపై కూడా జోరుగా ప్రచారం జరుగుతోంది.

