
భారత్–అమెరికా వాణిజ్య ఒప్పందంపై మోదీ ఏమన్నారు?
అమెరికాతో పాటు యూరోపియన్ యూనియన్ లాంటి పెద్ద దేశాలూ భారత్ వైపు చూస్తున్నాయన్న ప్రధాని
భారత్–అమెరికా వాణిజ్య(US- India Trade) ఒప్పందం తర్వాత భారతదేశంపై ప్రపంచ దేశాల విశ్వాసం మరింత పెరిగిందని ప్రధాని నరేంద్ర మోదీ(PM Modi) అన్నారు. గురువారం రాజ్యసభ(Rajya Sabha)లో మాట్లాడుతూ.. ఆర్థిక స్థిరత్వంతో పాటు దేశం అభివృద్ధి వేగాన్ని కూడా ప్రపంచం గమనిస్తోందని తెలిపారు. ఈ ఒప్పందం ముఖ్యంగా భారత యువతకు ఎక్కువ అవకాశాలు తీసుకొస్తుందని ఆయన పేర్కొన్నారు.
అమెరికాతో పాటు యూరోపియన్ యూనియన్ వంటి పెద్ద దేశాలు కూడా భారతదేశంతో వాణిజ్య సంబంధాలకు ఆసక్తి చూపుతున్నాయని ప్రధాని చెప్పారు. భారత్ కుదుర్చుకున్న వాణిజ్య ఒప్పందాలు ప్రపంచానికి సానుకూల సంకేతాలుగా నిలుస్తున్నాయని అన్నారు.
కోవిడ్ తర్వాత ప్రపంచం కొత్త ప్రపంచ క్రమం వైపు సాగుతోందని, ఈ పరిస్థితుల్లో భారత్ “గ్లోబల్ సౌత్” దేశాల గొంతుకగా ఎదిగిందని మోదీ పేర్కొన్నారు. గత కొన్ని రోజుల్లో తొమ్మిది ప్రధాన వాణిజ్య ఒప్పందాలు కుదుర్చుకున్నామని, యూరోపియన్ యూనియన్‌తో ఒప్పందం అత్యంత కీలకమని వివరించారు.
ఈ సందర్భంగా వాకౌట్ చేసిన ప్రతిపక్షాలపై ప్రధాని విమర్శలు గుప్పించారు. గత ప్రభుత్వాల తప్పుల్ని సరిచేయడానికే తమ శక్తిలో పెద్ద భాగం ఖర్చవుతోందని ఆరోపించారు. ప్రస్తుతం దేశం సంస్కరణలు, పనితీరు, పరివర్తన దిశగా ముందుకు సాగుతోందని తెలిపారు.
రాజ్యసభలో నినాదాలు చేస్తున్న ప్రతిపక్ష సభ్యులపై కూడా ప్రధాని వ్యంగ్య వ్యాఖ్యలు చేశారు. మొత్తం మీద భారత్‌పై ప్రపంచ నమ్మకం పెరుగుతోందని, వాణిజ్య ఒప్పందాలు దేశ ఆర్థికాభివృద్ధికి దోహదపడతాయని మోదీ స్పష్టం చేశారు.

