
గందరగోళంలో ఇండియా కూటమి
పుదుచ్చేరిలో డీఎంకే–కాంగ్రెస్ మధ్య నాయకత్వ వివాదం..
2026 తమిళనాడు(Tamil Nadu) అసెంబ్లీ ఎన్నికలు దగ్గరపడుతున్న వేళ, ఇండియా కూటమిలో భాగస్వాములైన డీఎంకే (DMK), కాంగ్రెస్(Congress) పార్టీల మధ్య విభేదాలు పెరుగుతున్నాయి. ముఖ్యంగా పుదుచ్చేరిలో కూటమికి ఎవరు నాయకత్వం వహించాలనే అంశం రెండు పార్టీల మధ్య వివాదానికి కారణమైంది.
పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల్లో డీఎంకే ముందడుగు వేయడంతో కాంగ్రెస్ అసంతృప్తి వ్యక్తం చేస్తోంది. తమ ఓట్ల శాతం ఎక్కువగా ఉందని, కూటమికి తామే నాయకత్వం వహించాలనే అభిప్రాయాన్ని కాంగ్రెస్ నేతలు వ్యక్తం చేస్తున్నారు. డీఎంకే మాత్రం ప్రస్తుత శాసనసభలో తమ ఎమ్మెల్యేలు ఎక్కువగా ఉన్నారని చెబుతోంది.
కాంగ్రెస్ ఎంపీ మాణికం ఠాగూర్ మాట్లాడుతూ.. “26 శాతం ఓట్లు ఉన్న కాంగ్రెస్‌ను పక్కనపెట్టి, 8 శాతం ఓట్లు ఉన్న డీఎంకే ఎలా నాయకత్వం వహిస్తుంది?” అని ప్రశ్నించారు. కూటమిలో కాంగ్రెస్‌కు అవమానం జరుగుతోందని అన్నారు. అయితే పార్టీ హైకమాండ్ సరైన సమయంలో నిర్ణయం తీసుకుంటుందని తెలిపారు.
పుదుచ్చేరి అసెంబ్లీకి మొత్తం 30 మంది సభ్యులు ఉంటారు. ప్రస్తుతం అక్కడ బీజేపీ మద్దతుతో AINRC ప్రభుత్వం కొనసాగుతోంది. ప్రతిపక్షంలో డీఎంకేకు ఆరుగురు ఎమ్మెల్యేలు ఉండగా, కాంగ్రెస్‌కు ఇద్దరే ఉన్నారు. గతంలో పుదుచ్చేరిలో కాంగ్రెస్ ప్రధాన భాగస్వామిగా ప్రభుత్వాలు ఏర్పాటు చేసిన చరిత్ర ఉంది.
ఇటీవల డీఎంకే పుదుచ్చేరిలో కూటమి భాగస్వామ్యాలపై సమావేశం నిర్వహించింది. ఈ సమావేశానికి సీపీఐ, సీపీఎం, వీసీకే నాయకులు హాజరయ్యారు. కానీ కాంగ్రెస్‌ను ఆహ్వానించకపోవడం వివాదానికి దారితీసింది. సీట్ల పంపకంపై చర్చలు జరిగినట్లు సమాచారం.
పుదుచ్చేరి కాంగ్రెస్ నాయకులు దీనిపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. మాజీ ముఖ్యమంత్రి వి. నారాయణస్వామి మాట్లాడుతూ, కాంగ్రెస్‌ను పక్కనపెట్టి సమావేశాలు పెట్టడం సరైన పద్ధతి కాదన్నారు. తమిళనాడులో అనుసరిస్తున్న కూటమి విధానాన్నే పుదుచ్చేరిలో కూడా అనుసరించాలని సూచించారు.
రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం ప్రకారం.. డీఎంకే ఉద్దేశపూర్వకంగా కాంగ్రెస్‌ను బలహీనపరచాలని చూస్తోందని భావిస్తున్నారు. సీట్ల పంపకంపై ఇంకా అధికారిక చర్చలు ప్రారంభం కాలేదు. అయినప్పటికీ రెండు పార్టీల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది.
టీవీకే పార్టీ ప్రవేశం కూడా పరిస్థితిని మరింత క్లిష్టం చేస్తోంది. ఈ నేపథ్యంలో ఇండియా కూటమి జాతీయ నాయకత్వం జోక్యం చేసుకుని సమస్యను పరిష్కరించే అవకాశముంది. ఎన్నికలు దగ్గరపడుతున్న కొద్దీ డీఎంకే–కాంగ్రెస్ భాగస్వామ్యం కొనసాగుతుందా లేదా అనే విషయం కీలకంగా మారింది.

