
S.I.R వివాదం: CECపై మమతా బెనర్జీ తీవ్ర విమర్శలు
‘‘ మీరు పెద్ద అబద్ధాలకోరు. జగదీప్ ధంఖర్‌కు పట్టిన గతే మీకు పడుతుంది’’- పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ.
ఓటరు జాబితా ప్రత్యేక సవరణ (S.I.R) ప్రక్రియపై పశ్చిమ బెంగాల్(West Bengal) ముఖ్యమంత్రి మమతా బెనర్జీ (CM Mamata Banerjee) సోమవారం (ఫిబ్రవరి 2న) ఢిల్లీలో ప్రధాన ఎన్నికల కమిషనర్ (CEC) జ్ఞానేష్ కుమార్‌ను కలిసి అభ్యంతరాలు వ్యక్తం చేశారు. ఈసీ పక్షపాతంగా వ్యవహరిస్తోందని, ప్రత్యేకంగా పశ్చిమ బెంగాల్‌ను టార్గెట్ చేసిందని ఆరోపించారు.
సమావేశం అనంతరం మీడియాతో మాట్లాడారు. CECని “పెద్ద అబద్ధాలకోరు” అని అభివర్ణించారు. మాజీ ఉపరాష్ట్రపతి జగదీప్ ధంఖర్‌కు పట్టిన పరిస్థితే ఈసీకి పడుతుందన్నారు. ధంఖర్ 2025 జూలై 21న ఆరోగ్య కారణాలతో రాజీనామా చేసిన విషయం తెలిసిందే. అయితే ఆయన రాజీనామా వెనుక రాజకీయ ఒత్తిళ్లు ఉన్నాయనే ఊహాగానాలు అప్పట్లో వినిపించాయి.
బృందంలో ఎవరెవరు?
టీఎంసీ నాయకుడు అభిషేక్ బెనర్జీతో పాటు 12 మంది సభ్యుల ప్రతినిధి బృందాన్ని మమత ఈసీ వద్దకు తీసుకువెళ్లారు. ఇటీవల విడుదల చేసిన ముసాయిదా ఓటరు జాబితాలో కొంతమంది బతికి ఉన్నా కూడా.. జాబితాలో వారు చనిపోయారని చూపారు. అలాంటి వారు కూడా ప్రతినిధి బృందం వెంట వెళ్లారు. అలాగే S.I.R ఒత్తిడి కారణంగా కొంతమంది చనిపోయారు. వారి కుటుంబ సభ్యులు కూడా బృందంతో పాటు ఉన్నారు.
లక్ష మందితో వస్తా..
మమత CECని తీవ్రంగా హెచ్చరించినట్లు సమాచారం. “మీరూ బీజేపీకి భయపడి ధన్‌కర్‌లాగే పనిచేస్తున్నారు. మీ అండతో బీహార్, హర్యానా, మహారాష్ట్రలో వాళ్లు (బీజేపీ) గెలిచారు. కానీ బెంగాల్‌లో అది కుదరదు” అని అన్నట్లు తెలిసింది. ‘‘అవసరమైతే లక్ష మందితో ఢిల్లీకి వస్తా. ఎస్‌ఐఆర్ ఒత్తిడి వల్ల చనిపోయిన వారికి ఎన్నికల సంఘమే బాధ్యత వహించాలి. మేం కమిషన్ అధ్యక్షుడిని గౌరవిస్తాం. కానీ ఎవరూ శాశ్వతం కాదు’’ అని అన్నట్లు తెలిసింది.
అంత తొందరెందుకు?
ఎన్నికలకు మూడు నెలల ముందు S.I.R ఎందుకు నిర్వహించారని, అస్సాంలో ఎందుకు చేయలేదని, ముసాయిదా జాబితాలో 58 లక్షల ఓటర్ల పేర్లు ఎందుకు తొలగించారని మమత ఈసీని ప్రశ్నించారు. ఈ ప్రక్రియలో AI వినియోగించారని, EC డైరెక్టర్ జనరల్ (IT) సీమా ఖన్నా అర్హతలపై కూడా మమత సందేహాలు వ్యక్తం చేశారు. ఆమె ఎన్నికల సంఘానికి కాకుండా బీజేపీ ఐటీ సెల్‌కు చెందినవారని ఆరోపించారు.
సుప్రీంలో పిటిషన్..
S.I.Rను సవాల్ చేస్తూ మమత సుప్రీంకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. ఎన్నికల సంఘం, పశ్చిమ బెంగాల్ ప్రధాన ఎన్నికల అధికారి మనోజ్ అగర్వాల్‌ను ప్రతివాదులుగా చేర్చి జనవరి 28న పిటిషన్ దాఖలు చేశారు. S.I.R ప్రక్రియ “ప్రణాళికబద్ధంగా లేదని లోపభూయిష్టంగా ఉందని, ఇది పౌర హక్కులను కాలరాస్తుందని ఆమె ఆరోపించారు. అయితే ఈ కేసు ఇంకా విచారణకు రాలేదు.
అసెంబ్లీలో ప్రత్యేక చర్చ..
రాబోయే బడ్జెట్ సమావేశాల్లో S.I.R అంశంపై ప్రత్యేక చర్చ లేదా తీర్మానం ఉండొచ్చని పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ స్పీకర్ బిమన్ బెనర్జీ సూచించారు.
ఈసీ సమాధానం..
అయితే టీఎంసీ లేవనెత్తిన అన్ని ప్రశ్నలకు సమాధానమిచ్చినట్లు ఎన్నికల సంఘం పేర్కొంది. చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకునే వారిపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. కమిషన్ గురించి టీఎంసీ శాసనసభ్యులు అసభ్యకరంగా మాట్లాడారని, BDO కార్యాలయంలో టీఎంసీ ఎమ్మెల్యే మోనిరుల్ ఇస్లాం విధ్వంసాన్ని ఈసీ ఈ సందర్భంగా ప్రస్తావించింది. S.I.R విధుల నిర్వహిస్తున్న అధికారులపై ఒత్తిడి ఉండకూడదని పేర్కొంది. దాదాపు గంటపాటు జరిగిన సమావేశం రాజకీయ వాతావరణాన్ని వేడెక్కించింది.

