జస్ట్ పడితేనే విరిగాయి..మరి కొడితే ఇంకెలా ఉండాలి?
x

జస్ట్ పడితేనే విరిగాయి..మరి కొడితే ఇంకెలా ఉండాలి?

వైరల్ గా మారిన రఘురామపై పీవీ సునీల్ కుమార్ సెటైర్లు.


ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో సీనియర్ ఐపీఎస్ అధికారి పీవీ సునీల్ కుమార్, డిప్యూటీ స్పీకర్ రఘురామ కృష్ణంరాజు మధ్య పాత గొడవలు మళ్ళీ పతాక స్థాయికి చేరాయి. రఘురామ కృష్ణంరాజు ఇటీవల ప్రమాదవశాత్తూ కిందపడి గాయపడటాన్ని ప్రస్తావిస్తూ సునీల్ కుమార్ చేసిన ట్వీట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. నిజం ఎప్పటికీ దాగదు.. అబద్ధాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి అంటూ ఆయన వేసిన సెటైర్లు చర్చనీయాంశమయ్యాయి.

ఇంకెన్ని ఫ్రాక్చర్లు ఉండాలి? సునీల్ కుమార్ ప్రశ్న
గతంలో తనను కస్టడీలో ఉంచి పోలీసులు దారుణంగా కొట్టారని, కాళ్లపై గాయాలయ్యాయని రఘురామ ఆరోపించిన సంగతి తెలిసిందే. దీనిని లక్ష్యంగా చేసుకుని సునీల్ కుమార్ తన తాజా ట్వీట్‌లో ప్రశ్నల వర్షం కురిపించారు. రఘురామ జస్ట్ అలా కింద పడితేనే రెండు చోట్ల ఎముకలు విరిగాయి. మరి ఆయన వర్ణించినట్లుగా పోలీసులు నిజంగానే కస్టడీలో అంత దారుణంగా కొట్టి ఉంటే, ఇంకెన్ని ఫ్రాక్చర్లు ఉండాలి? అసలు ఆయన పరిస్థితి ఎలా ఉండేది? అని ప్రశ్నించారు. ఈ వ్యాఖ్యల ద్వారా నాడు రఘురామ చేసిన కస్టడీ హింస ఆరోపణలన్నీ కట్టుకథలేనని సునీల్ కుమార్ పరోక్షంగా కొట్టిపారేశారు.
అరెస్టు చేయాల్సిందే.. సీబీఐకి ట్యాగ్
కేవలం గాయాల పైనే కాకుండా, రఘురామపై ఉన్న ఆర్థిక నేరాల కేసులపైనా సునీల్ కుమార్ విరుచుకుపడ్డారు. బ్యాంకులను వేల కోట్లు మోసం చేసిన కేసులో రఘురామను వెంటనే అరెస్టు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ మేరకు కేంద్ర దర్యాప్తు సంస్థ (CBI)ని ట్యాగ్ చేస్తూ సంచలన ట్వీట్ చేశారు. సాక్షులను బెదిరించే అవకాశం ఉన్నందున, వారిని రక్షించాలంటే నిందితుడిని కస్టడీలోకి తీసుకోవడమే ఏకైక మార్గమని ఆయన సీబీఐకి సూచించారు.
ముదిరిన యుద్ధం
రఘురామ కృష్ణంరాజుపై సీబీఐ ఇప్పటికే రూ. 947 కోట్లు, రూ. 238 కోట్ల ఎగవేత కేసులను విచారిస్తోంది. ఈ తరుణంలో సునీల్ కుమార్ ఒకవైపు ఆయన ఆరోగ్యంపై సెటైర్లు వేస్తూనే, మరోవైపు పాత కేసులను తెరపైకి తెచ్చి అరెస్టు కోరడం ఏపీ రాజకీయాల్లో వేడి పుట్టిస్తోంది. డిప్యూటీ స్పీకర్ హోదాలో ఉన్న వ్యక్తిపై ఒక సీనియర్ ఐపీఎస్ అధికారి ఈ స్థాయిలో పోరాటం చేయడం ఇరుపక్షాల మధ్య ఉన్న వైరాన్ని మరోసారి బహిర్గతం చేసింది.


Read More
Next Story