ఆంధ్రరాష్ట్రం ఏర్పాటైన నాడే.. రాజధానిగా విజయవాడ అయి ఉండి ఉంటే, ఈరోజు ఏపీ రాష్ట్ర పరిస్థితులు, అభివృద్ధి గమనం మరోలా ఉండేవి అని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు. శనివారం అసెంబ్లీలో అమరావతికి చట్టబద్ధత కల్పించే చారిత్రాత్మక తీర్మానాన్ని ప్రవేశపెట్టిన సందర్భంగా ఆయన గత స్మృతులను నెమరువేసుకున్నారు. పొట్టి శ్రీరాములు ప్రాణత్యాగం వల్లే తెలుగువారికి ప్రత్యేక రాష్ట్రం సిద్ధించిందని, అయితే ఆనాటి రాజకీయ, భౌగోళిక సమీకరణాల వల్ల రాజధాని విషయంలో జరిగిన ఆలస్యం రాష్ట్ర ప్రగతిపై ప్రభావం చూపిందని అభిప్రాయపడ్డారు. శాతవాహనుల కాలం నుండి పాలనా కేంద్రంగా ఉన్న అమరావతి ప్రాశస్త్యాన్ని గుర్తుచేస్తూ.. గత పాలకుల విధ్వంసకర నిర్ణయాల వల్ల ఏపీ 30 ఏళ్లు వెనక్కి వెళ్లిందని, ఆ లోటును భర్తీ చేస్తూ అమరావతిని దేశంలోనే అగ్రగామి నగరంగా తీర్చిదిద్దుతామని చంద్రబాబు ధీమా వ్యక్తం చేశారు.
హైదరాబాద్ పునాది.. అమరావతి లక్ష్యం
తెలంగాణ నేడు అత్యధిక తలసరి ఆదాయం కలిగిన రాష్ట్రంగా ఎదగడానికి నాడు తాము సైబరాబాద్‌లో వేసిన ఐటీ పునాదులే కారణమని చంద్రబాబు వివరించారు. ఉమ్మడి రాష్ట్రంలో మదరాసీ అన్న ముద్రను తుడిచేసి తెలుగువారి ఆత్మగౌరవాన్ని ఎన్టీఆర్ నిలబెట్టారని, అదే స్ఫూర్తితో అమరావతిని కూడా హైదరాబాద్‌కు దీటుగా, దేశంలోనే అగ్రస్థానంలో నిలిపేలా అభివృద్ధి చేస్తామని స్పష్టం చేశారు. మేము కష్టపడతాం.. అమరావతిని నిర్మిస్తాం అని ఆయన దృఢంగా ప్రకటించారు. వైసీపీ ఊసరవెల్లి రాజకీయం.. విధ్వంసకర పాలన
గత ప్రభుత్వ తీరుపై చంద్రబాబు నిప్పులు చెరిగారు. ఎన్నికల ముందు అమరావతికి మద్దతు తెలిపి, అధికారంలోకి రాగానే మూడు రాజధానుల పేరుతో వైసీపీ ఊసరవెల్లి రాజకీయం చేసిందని మండిపడ్డారు. అమరావతిని వేశ్యల రాజధాని, ముంపు ప్రాంతం అంటూ విషం చిమ్మారని, ప్రజావేదిక కూల్చివేతతో ప్రారంభమైన వారి విధ్వంసకర పాలన వల్ల రాష్ట్రం 30 ఏళ్లు వెనక్కి వెళ్లిందని ఆవేదన వ్యక్తం చేశారు. అమరావతికి నిధులు రాకుండా ప్రపంచ బ్యాంకుకు లేఖలు రాసిన ద్రోహ చరిత్ర వైసీపీదని ధ్వజమెత్తారు. రాజధానిలో జరుగుతున్న వరుస అగ్ని ప్రమాదాలపై ప్రభుత్వం సీరియస్‌గా ఉందని, దీనిపై సిట్ (SIT) వేసినట్లు సీఎం ప్రకటించారు. ఎవరైనా అమరావతిలో హింస సృష్టించాలని చూస్తే.. అదే వారికి చివరి రోజు అవుతుంది. ఇక్కడ నడిచేది అంబేద్కర్ రాజ్యాంగమే తప్ప రాజారెడ్డి రాజ్యాంగం కాదు అని తీవ్రస్థాయిలో హెచ్చరించారు. అమరావతిలో ప్రస్తుతం రూ. 56 వేల కోట్ల విలువైన పనులు జరుగుతున్నాయని, 2028 నాటికి మెజార్టీ పనులు పూర్తి చేస్తామని భరోసా ఇచ్చారు.
ఏకగ్రీవ తీర్మానం.. పార్లమెంట్ బాట
వైసీపీ సభ్యులు ఇవాళైనా సభకు వచ్చి తమ తప్పులను ఒప్పుకుంటారని ఆశించామని, కానీ వారు రాజధాని ద్రోహులుగానే మిగిలిపోయారని చంద్రబాబు అన్నారు. ఏపీకి ఒకే ఒక్క రాజధాని ఉంటుందని, అది అమరావతి మాత్రమేనని ఆయన స్పష్టం చేశారు. అనంతరం, రాజధాని అమరావతికి చట్టబద్ధత కల్పించే తీర్మానాన్ని అసెంబ్లీ ఏకగ్రీవంగా ఆమోదించింది. ఈ తీర్మానం పార్లమెంట్ ఆమోదం పొందిన తర్వాత శాశ్వత చట్టంగా మారనుంది.