’నా చేతిలో డబ్బుల్లేవు..రాజధాని నిర్మించాలనే సంకల్పం ఉంది‘
x

’నా చేతిలో డబ్బుల్లేవు..రాజధాని నిర్మించాలనే సంకల్పం ఉంది‘

అమరావతి చట్టబద్ధతపై సీఎం చంద్రబాబు భావోద్వేగం.


నాడు రాజధాని లేని రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టినప్పుడు నా చేతిలో చిల్లిగవ్వ లేదు.. కానీ ఒక అద్భుతమైన ప్రజా రాజధానిని నిర్మించాలనే బలమైన సంకల్పం మాత్రం ఉంది.. ఆ సంకల్పమే నేడు అమరావతికి పార్లమెంటు సాక్షిగా చట్టబద్ధత కల్పించేలా చేసింది అంటూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు భావోద్వేగపూరిత ప్రకటన చేశారు. ఐదేళ్ల అడ్డంకులు, కుట్రలను దాటుకుని అమరావతి సాధించిన ఈ చారిత్రాత్మక విజయం ఐదు కోట్ల ఆంధ్రుల ఆత్మగౌరవానికి దక్కిన గౌరవమని ఆయన అభివర్ణించారు. తనపై నమ్మకంతో వేల ఎకరాల భూములిచ్చిన రైతుల త్యాగమే ఈ విజయానికి పునాది అని స్పష్టం చేస్తూ, రాజధాని ప్రస్థానంలో ఎదురైన ఒడిదుడుకులను ఆయన నెమరువేసుకున్నారు.

శూన్యం నుంచి మొదలైన ప్రస్థానం
రాష్ట్ర విభజన సమయంలో ఆంధ్రప్రదేశ్ ఎదుర్కొన్న గడ్డు పరిస్థితులను చంద్రబాబు గుర్తు చేసుకున్నారు. ఆర్థిక కష్టాలు, వనరుల కొరత, కనీసం కూర్చోవడానికి రాజధాని లేని స్థితిలో విజయవాడకు వచ్చి, ఒక ఎస్ఈ కార్యాలయంలో పాలన ప్రారంభించి, బస్సులోనే బస చేసిన రోజులను ఆయన నెమరువేసుకున్నారు. సమైక్య రాష్ట్రంలో సైబరాబాద్‌ను నిర్మించి సంపద సృష్టించిన అనుభవంతో, ఏపీకి కూడా ఒక ప్రపంచ స్థాయి నగరం కావాలనే పట్టుదలతో అమరావతికి శ్రీకారం చుట్టానని తెలిపారు. పోలవరం ముంపు మండలాలను ఏపీలో విలీనం చేయడం ద్వారా ప్రాజెక్టుకు తొలి అడుగు పడిందని పేర్కొన్నారు.
రైతుల నమ్మకం..ప్రపంచ స్థాయి ప్రణాళిక
అమరావతి నిర్మాణం కోసం 29 వేల మంది రైతులు తమ 34 వేల ఎకరాల సారవంతమైన భూములను కేవలం తనపై ఉన్న నమ్మకంతో ప్రభుత్వానికి ఇచ్చారని చంద్రబాబు కొనియాడారు. సింగపూర్ ప్రభుత్వం ఒక్క పైసా తీసుకోకుండా మాస్టర్ ప్లాన్ ఇచ్చింది. నార్మన్ ఫోస్టర్స్ వంటి అంతర్జాతీయ ఆర్కిటెక్టులతో 9 నగరాల కలయికగా అమరావతిని డిజైన్ చేశాం అని వివరించారు. ల్యాండ్ పూలింగ్ ద్వారా రైతులకు రిటర్నబుల్ ప్లాట్లు ఇస్తూ వారిని అభివృద్ధిలో భాగస్వాములను చేశామని, కేవలం 11 నెలల్లోనే సచివాలయం, అసెంబ్లీ నిర్మించి పరిపాలనను ఇక్కడికి మార్చామని చెప్పారు.
వైసీపీ కుట్రలు.. పార్లమెంట్ శాసనం
గత ఐదేళ్లలో అమరావతిపై జరిగిన దాడులను చంద్రబాబు తీవ్రంగా ఖండించారు. అమరావతిని స్మశానమని, ఎడారి అని పిలుస్తూ ప్రపంచ బ్యాంకుకు లేఖలు రాసి నిధులు రాకుండా అడ్డుకున్నారని మండిపడ్డారు. దేశంలోని 50 రాజకీయ పార్టీలు అమరావతికి అండగా నిలిస్తే, ఇక్కడి నుంచి గెలిచిన వైసీపీ ఎంపీలు మాత్రం రాష్ట్రానికి ద్రోహం చేస్తూ బిల్లును వ్యతిరేకించారు అని ధ్వజమెత్తుారు. మూడు రాజధానుల పేరుతో జగన్ ఆడిన మూడు ముక్కలాటను ప్రజలు తిరస్కరించారని, ఇప్పుడు పార్లమెంట్ ఆమోదంతో అమరావతికి తిరుగులేని చట్టబద్ధత వచ్చిందని, ఇక దీనిని ఎవరూ మార్చలేరని ధీమా వ్యక్తం చేశారు.
అమరావతి ఆంధ్రులకు గుండె, దేశానికి గర్వకారణం
అమరావతి కేవలం ఒక నగరం కాదు, అది ఆంధ్రప్రదేశ్ ఆత్మ అని సీఎం అభివర్ణించారు. విద్య, వైద్యం, ఉద్యోగం, విజ్ఞానానికి ఇది నెర్వ్ సెంటర్ గా మారుతుందన్నారు. అమరావతి అభివృద్ధితో పాటు విశాఖ, తిరుపతి వంటి ప్రాంతాలను కూడా పారిశ్రామికంగా అభివృద్ధి చేస్తున్నామని, గూగుల్, ఆర్సెలార్ మిట్టల్ వంటి దిగ్గజ సంస్థలు వస్తున్నాయని తెలిపారు. 2047 నాటికి రాష్ట్రాన్ని 2.4 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దడంలో అమరావతి చోదక శక్తిగా నిలుస్తుందని ఆకాంక్షించారు.
2029లో ప్రధాని చేతుల మీదుగా ప్రారంభోత్సవం
ప్రస్తుతం రాజధానిలో రూ. 56 వేల కోట్ల విలువైన పనులు జరుగుతున్నాయని, 2028 నాటికల్లా ప్రధాన పనులన్నీ ఒక స్థాయికి వస్తాయని చంద్రబాబు వెల్లడించారు. 2029లో మళ్లీ ప్రధాని మోదీని ఆహ్వానించి ఈ ప్రాజెక్టులన్నీ ప్రారంభింపజేస్తాం అని ధీమా వ్యక్తం చేశారు. రాజధాని నిర్మాణం అనేది నిరంతర ప్రక్రియ అని, ఇన్నర్ రింగ్ రోడ్, అవుటర్ రింగ్ రోడ్, స్పోర్ట్ సిటీ వంటి ప్రాజెక్టులు క్రమానుగుణంగా వస్తాయని చెప్పారు. అమరావతి ఇకపై అన్‌స్టాపబుల్ అని, దీనిని అడ్డుకోవాలని చూసేవారు చరిత్రలో తుగ్లక్‌లుగా మిగిలిపోతారని ఘాటుగా వ్యాఖ్యానించారు.
Read More
Next Story