వైఎస్ కుటుంబంలో ఆస్తుల చిచ్చు ఇప్పుడు క్లైమాక్స్ కు చేరుకుంది. గత కొంతకాలంగా జగన్, షర్మిల మధ్య సాగుతున్న ఆస్తుల యుద్ధం పై ఇన్నాళ్లూ మౌనంగా ఉన్న రాజశేఖర్ రెడ్డి సతీమణి వైఎస్ విజయమ్మ చివరకు నోరు విప్పారు. అడ్వకేట్ నోటరీ సాక్షిగా ఆమె విడుదల చేసిన ప్రకటన ఏపీ రాజకీయాల్లో పెను తుపానును సృష్టించింది. తన కొడుకు జగన్ తన చెల్లెలికి, మేనల్లుడు, మేనకోడళ్లకు అన్యాయం చేశాడని ఆమె కుండబద్దలు కొట్టారు. వైఎస్సార్ భార్యగా చేతులు జోడించి వేడుకుంటున్నాను.. మా కుటుంబ ఆస్తులపై అసత్య ప్రచారాలు మానుకోండి అంటూ ఆమె చేసిన భావోద్వేగపూరిత విజ్ఞప్తి ఇప్పుడు అందరినీ కలచివేస్తోంది. వైఎస్సార్ మరణించే వరకు ఉన్నవన్నీ ఉమ్మడి ఆస్తులేనని, ఇప్పటివరకు అసలు పంపకాలే జరగలేదన్న ఆమె వ్యాఖ్యలు వైఎస్సార్‌సీపీ వర్గాల్లో ప్రకంపనలు పుట్టిస్తున్నాయి. నేషనల్ కంపెనీ లా ట్రైబ్యునల్ (NCLT)లో వివాదం నడుస్తున్న తరుణంలో, దివంగత వైఎస్సార్ సతీమణి వైఎస్ విజయమ్మ విడుదల చేసిన అడ్వకేట్ నోటరీ రాజకీయ వర్గాలను షాక్‌కు గురిచేసింది. తన కుమారుడు జగన్, కుమార్తె షర్మిల మధ్య జరుగుతున్న ఈ పోరులో ఆమె నిష్పక్షపాతంగా నిజాలను వెల్లడిస్తూనే, జగన్ తన చెల్లెలికి అన్యాయం చేశాడని కుండబద్దలు కొట్టారు.
ఆస్తులన్నీ ఉమ్మడివే..పంపకాలు ఎప్పుడూ జరగలేదు
2009లో వైఎస్ రాజశేఖర్ రెడ్డి మరణించే వరకు ఉన్న ప్రతి ఆస్తి ఉమ్మడి కుటుంబ ఆస్తి (Combined Family Assets) మాత్రమేనని విజయమ్మ స్పష్టం చేశారు. ఇప్పటివరకు అధికారికంగా ఎటువంటి ఆస్తి పంపకాలు జరగలేదని ఆమె తేల్చి చెప్పారు. తన నలుగురు మనవలు, మనవరాళ్లకు ఆస్తులన్నీ సమానంగా పంచాలన్నదే వైఎస్సార్ అంతిమ ఉద్దేశమని, అది ఆయన ఆదేశమని కూడా ఆమె గుర్తు చేశారు. ఈ వాస్తవం తమ కుటుంబానికి అత్యంత సన్నిహితంగా ఉండే ప్రతి ఒక్కరికీ తెలుసని ఆమె నోటరీలో పేర్కొన్నారు. షర్మిల వాటాపై జగన్ కోత.. ఎంవోయూ వెనుక అసలు కథ
ఎంవోయూ (MoU) ప్రకారం షర్మిలకు రాసిన ప్రతి ఆస్తి న్యాయబద్ధంగా ఆమెకు దక్కాల్సిందేనని విజయమ్మ డిమాండ్ చేశారు. నిజానికి షర్మిలకు రావాల్సిన వాటా కంటే జగన్ తక్కువే రాశాడని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. సరస్వతి సిమెంట్స్ తో పాటు, ఎంవోయూలో లేని యెలహంక భూమి కూడా షర్మిలదేనని ఆమె వెల్లడించారు. ఆస్తుల విషయంలో జగన్ తన మేనల్లుడు, మేనకోడలికి ఇప్పటివరకు అన్యాయం చేశాడని, ఇప్పటికైనా ఒక తల్లిగా తన కొడుకు వారికి న్యాయం చేస్తాడని ఆశిస్తున్నానని ఆమె పేర్కొన్నారు. డివిడెండ్‌ను ఆస్తిగా చూపిస్తారా? విజయమ్మ సూటి ప్రశ్న
షర్మిలకు భారీగా నగదు ఇచ్చానని జగన్ వర్గం చేస్తున్న ప్రచారాన్ని విజయమ్మ తీవ్రంగా ఖండించారు. జగన్ ఇచ్చినట్లు చెబుతున్న డబ్బంతా వ్యాపారాల ద్వారా వచ్చిన డివిడెండ్ (Dividend) మాత్రమేనని, అది ఆస్తి పంపకం కిందకు రాదని వివరించారు. గతంలో వైఎస్సార్ ఇలాంటి ఆస్తులనే జగన్‌కు కూడా ఇచ్చారని, కానీ వాటిని ఎప్పుడూ పంపకాలుగా పరిగణించలేదని గుర్తు చేశారు. నిజం ఏమిటో దేవుడికి, నా కొడుక్కి కూడా తెలుసు అంటూ ఆమె చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి. అసత్య ప్రచారాలు మానుకోండి
కుటుంబ ఆస్తులపై జరుగుతున్న గోబెల్స్ ప్రచారాన్ని చూసి విజయమ్మ చలించిపోయారు. వైఎస్సార్ భార్యగా చేతులు జోడించి అడుగుతున్నాను.. మా ఆస్తులపై అసత్య ప్రచారాలు మానుకోండి అని ఆమె కంటతడి పెట్టారు. మీడియాలో ఈ విషయాలను మళ్లీ మళ్లీ ప్రస్తావించి తమను బాధపెట్టవద్దని కోరారు. దేవుడి సాక్షిగా తాను రాసినవన్నీ నూటికి నూరు శాతం వాస్తవాలని, ఆ దేవుడే తమకు న్యాయం చేస్తాడని ఆమె తన నోటరీని ముగించారు.