
మండలిలో ’హెరిటేజ్‘ మంటలు
లడ్డూ నెయ్యిపై రణరంగంగా మారిన ఆంధ్రప్రదేశ్ శాసన శాసన మండలి.
ఆంధ్రప్రదేశ్ శాసన మండలిలో గురువారం నాడు నెయ్యి యుద్ధం తారాస్థాయికి చేరింది. తిరుమల లడ్డూ ప్రసాదం తయారీలో వాడుతున్న నెయ్యి సరఫరా, దాని వెనుక ఉన్న సంస్థల ప్రమేయంపై అధికార, ప్రతిపక్షాల మధ్య మాటల తూటాలు పేలాయి. వరుసగా మూడో రోజు కూడా సభ గందరగోళం మధ్య వాయిదా పడటం రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశమైంది.
వైసీపీ వాయిదా తీర్మానం.. బొత్స ఘాటు విమర్శలు
తిరుమల లడ్డూ అంశంపై చర్చించాలని కోరుతూ వైసీపీ ఎమ్మెల్సీలు రామసుబ్బారెడ్డి, వరుదు కల్యాణి, మొండితోక అరుణ్ కుమార్ వాయిదా తీర్మానం ఇచ్చారు. అయితే మండలి చైర్మన్ దీనిని తిరస్కరించడంతో వైసీపీ సభ్యులు సభలో నిరసనకు దిగారు. విపక్ష నేత బొత్స సత్యనారాయణ నేరుగా ప్రభుత్వంపై విరుచుకుపడుతూ, ఇందాపూర్ డైరీ ముసుగులో హెరిటేజ్ సంస్థే తిరుమలకు నెయ్యి సరఫరా చేస్తోంది. దేవదేవుడిని అడ్డం పెట్టుకుని రాష్ట్రాన్ని దోచుకుంటున్నారు అని మండిపడ్డారు. మీ వెబ్‌సైట్‌లోనే ఆధారాలు ఉన్నాయని, చర్చకు ఎందుకు భయపడుతున్నారని అచ్చెన్నాయుడికి బొత్స సవాల్ విసిరారు.
మంత్రి అచ్చెన్నాయుడు కౌంటర్: చీజ్‌కు, నెయ్యికి తేడా తెలియదా?
వైసీపీ ఆరోపణలను మంత్రి అచ్చెన్నాయుడు అత్యంత తీవ్రంగా ఖండించారు. చీజ్ ప్యాకెట్ పట్టుకుని నెయ్యి అని ప్రచారం చేసే దౌర్భాగ్యపు ప్రతిపక్షం మనకు ఉంది అంటూ ఎద్దేవా చేశారు. డైవర్షన్ పాలిటిక్స్ కోసమే హెరిటేజ్ సంస్థపై అభాండాలు వేస్తున్నారని, జగన్ మాదిరిగా ప్రభుత్వ సంస్థలను అడ్డం పెట్టుకుని సాక్షి, భారతి సిమెంట్స్ ద్వారా తాము దోచుకోవడం లేదని కౌంటర్ ఇచ్చారు. ఆధారాలు ఉంటే సభలో చూపాలని, ఎంత సేపైనా చర్చకు తాము సిద్ధమని ఆయన సవాల్ విసిరారు.
వరుదు కల్యాణి సంచలన వ్యాఖ్యలు
మీడియా పాయింట్ వద్ద మాట్లాడిన వైసీపీ ఎమ్మెల్సీ వరుదు కల్యాణి, నెయ్యి ధరల పెంపు వెనుక భారీ కుట్ర దాగి ఉందని ఆరోపించారు. గతంలో తక్కువ ధరకు వచ్చిన నెయ్యి, ఇప్పుడు ఇందాపూర్ రూ. 658, నందిని రూ. 710కి ఎలా సరఫరా చేస్తున్నాయి? కేవలం సొంత సంస్థలకు లాభం చేకూర్చడానికే లడ్డూపై తప్పుడు ప్రచారం చేశారు అని ధ్వజమెత్తారు. సిబిఐ జాబితాలో ఉన్నవారిని ఎక్స్‌పర్ట్ కమిటీలో వేశారని, ఇందాపూర్ తమ యూనిటే అని హెరిటేజ్ ప్రకటించినా ప్రభుత్వం ఎందుకు దాస్తోందని ఆమె నిలదీశారు.
విజిల్స్‌తో హోరెత్తిన కౌన్సిల్.. వాయిదాల పర్వం
చర్చకు అనుమతించకపోవడంతో వైసీపీ సభ్యులు చైర్మన్ పోడియం వద్దకు చేరుకుని విజిల్స్ వేస్తూ ఆందోళనకు దిగారు. ఈ తీరుపై మంత్రి అచ్చెన్నాయుడు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ, సభను ఆటంకపరుస్తున్న సభ్యులపై చర్యలు తీసుకోవాలని కోరారు. గందరగోళం మధ్య సభ పదేపదే వాయిదా పడింది. అటు స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ, రాష్ట్రంలో శాంతిభద్రతల వైఫల్యంపై కూడా వైసీపీ సభ్యులు నినాదాలు చేయడంతో సభ రణరంగంగా మారింది.

