పశ్చిమ బెంగాల్‌లో “S.I.R” వివాదంతో వెనకబడిన ఎన్నికల ప్రచారం
రాజకీయ వ్యూహకర్త, Vote Vibe వ్యవస్థాపకుడు అమితాబ్ తివారి ఏమంటున్నారు?
పశ్చిమ బెంగాల్‌లో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్నా.. గత ఎన్నికల మాదిరిగా ఉత్సాహభరిత రాజకీయ వాతావరణం ఈసారి కనిపించడం లేదని విశ్లేషకులు అంటున్నారు. ఎన్నికల ముందు జరిగిన ప్రత్యేక ఓటరు జాబితా సవరణ ప్రక్రియే ఇందుకు ప్రధాన కారణమని స్వతంత్ర ప్రజాభిప్రాయ వేదిక Vote Vibe వ్యవస్థాపకుడు అమితాబ్ తివారి పేర్కొన్నారు.
ఓటరు జాబితాల ధృవీకరణలో బిజీ
‘‘రాష్ట్రంలో ప్రస్తుతం రాజకీయ పార్టీలు, కార్యకర్తలు, ఓటర్లు అందరూ తమ పేర్లు ఓటరు జాబితాలో ఉన్నాయా లేదా అన్నది పరిశీలించడంలోనే బిజీగా ఉన్నారు. ఎన్నికల సంఘం విడుదల చేసిన తాజా ఓటరు జాబితాలు ఫిబ్రవరి 28న బయటకు రావడంతో, బూత్ స్థాయి నాయకులు తమ మద్దతుదారుల పేర్లు జాబితాలో ఉండేలా చూసుకుంటూ అవసరమైతే ఫిర్యాదులు కూడా నమోదు చేస్తున్నారు. దీంతో ఎన్నికల ప్రచారం కొంత వెనుకబడిండి’ అన్నది తివారి అభిప్రాయం.
ఇతర రాష్ట్రాల్లో పూర్తయిన ప్రక్రియ..
చాలా రాష్ట్రాల్లో ఈ సవరణ ప్రక్రియ ఇప్పటికే పూర్తయింది. కానీ పశ్చిమ బెంగాల్‌లో కొన్ని అడ్డంకుల కారణంగా ఇంకా పూర్తికాలేదు. ఫలితంగా గత ఎన్నికల్లో కనిపించిన భారీ ప్రచార ర్యాలీలు, ప్రధాన నాయకుల పర్యటనలు ఈసారి ఇంకా ప్రారంభం కాలేదని ఆయన చెప్పారు.
ప్రభుత్వానికి మిశ్రమ స్పందన..
Vote Vibe నిర్వహించిన సర్వేలో రాష్ట్ర ప్రభుత్వ పనితీరుకు 44% మంది సానుకూలంగా, 31% మంది అసంతృప్తిగా, సుమారు 15% మంది తటస్థంగా స్పందించారు. అంటే ప్రభుత్వానికి సుమారు 13% ఆధిక్యం ఉన్నట్లు సర్వే సూచిస్తోంది. తటస్థంగా ఉన్న ఓటర్లే ఎన్నికల ఫలితాలను ప్రభావితం చేసే అవకాశం ఉందని విశ్లేషకులు చెబుతున్నారు.
తూర్పు రాష్ట్రాల్లో దీర్ఘకాల పాలన..
తివారి విశ్లేషణ ప్రకారం తూర్పు భారత రాష్ట్రాల్లో ఒకే పార్టీ లేదా నాయకత్వం ఎక్కువ కాలం కొనసాగడం సాధారణం. పశ్చిమ బెంగాల్‌లో ఒకప్పుడు వామపక్షాలు 34 సంవత్సరాలు పాలించగా, ఇప్పుడు ముఖ్యమంత్రి మమతా బెనర్జీ దీర్ఘకాలంగా అధికారంలో ఉన్నారు. సంక్షేమ పథకాలపై ప్రజల ఆధారపడటం కూడా ప్రభుత్వ మార్పుపై సంకోచానికి కారణమవుతుందని ఆయన చెప్పారు.
బీజేపీలో నాయకత్వ విభేదాలు..
రాష్ట్రంలో ప్రతిపక్షంగా ఉన్న బీజేపీలో నాయకత్వం స్పష్టంగా లేదని విశ్లేషకులు చెబుతున్నారు. సువేందు అధికారి, సామిక్ భట్టాచార్య, దిలీప్ ఘోష్ వంటి నేతల మధ్య భిన్నాభిప్రాయాలు ఉన్నాయని తివారి పేర్కొన్నారు.
అయితే ఓటర్లు కేవలం నాయకత్వాన్ని మాత్రమే ఆధారంగా తీసుకుని ఓటు వేయరని ఆయన అన్నారు.
నిరుద్యోగం ప్రధాన సమస్య..
సర్వేలో నిరుద్యోగం రాష్ట్రంలో అతిపెద్ద సమస్యగా మారింది. సమస్యలు ఎన్నికల్లో పూర్తిగా నిర్ణయాత్మకంగా మారకపోయినా, నిరుద్యోగం సుమారు 7% ఓటర్ల నిర్ణయాన్ని ప్రభావితం చేసే అవకాశం ఉందని అంచనా.
అక్రమ వలసలు..
సర్వేలో మరో ఆసక్తికర అంశం వెలుగుచూసింది. తృణమూల్ కాంగ్రెస్ అక్రమ వలసలను ప్రోత్సహిస్తోందనే ఆరోపణను దాదాపు 47% మంది నమ్ముతున్నారని తివారి తెలిపారు. ఇదే సమయంలో బీజేపీ–తృణమూల్ కాంగ్రెస్ మధ్య ఒక రహస్య రాజకీయ అవగాహన ఉందనే అభిప్రాయాన్ని 41% మంది వ్యక్తం చేశారు.
మమతా రాజకీయ వ్యూహం..
తివారి విశ్లేషణ ప్రకారం.. మమతా బెనర్జీ తనపై వస్తున్న కేంద్ర సంస్థల చర్యలను రాజకీయ దాడిగా చూపిస్తూ “బెంగాలీ గౌరవం”తో అనుసంధానించే ప్రయత్నం చేస్తున్నారు. ఈ వ్యూహం వల్ల ఆమె ప్రజాభిప్రాయ పోరులో కొంత ఆధిక్యం సాధించారని ఆయన అభిప్రాయం.
ఎన్నికల ముందు ఆసక్తికర పరిస్థితి..
మొత్తంగా చూస్తే ప్రస్తుతం పశ్చిమ బెంగాల్‌లో ఎన్నికల ప్రచారం కంటే ఓటరు జాబితాల సవరణ ప్రక్రియే ప్రధాన చర్చగా మారింది. SIR ప్రక్రియ పూర్తయిన తరువాతే రాష్ట్రంలో పూర్తి స్థాయి ఎన్నికల రాజకీయ వేడి మొదలయ్యే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు.

