చంద్రబాబు ’రాజకీయ మౌత్‌పీస్‘గా షర్మిల మారారా?
x

చంద్రబాబు ’రాజకీయ మౌత్‌పీస్‘గా షర్మిల మారారా?

వైసీపీలో కలకలం రేపిన షర్మిల విమర్శలు. తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తిన వైసీపీ నేతలు.


సొంత సోదరుడిపైనే యుద్ధం ప్రకటిస్తూ ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు వైఎస్ కుటుంబంలోనే కాక, ఏపీ రాజకీయాల్లోనూ మరోసారి కార్చిచ్చు రేపాయి. విశాఖ వేదికగా ఆమె గుప్పించిన విమర్శనాస్త్రాలపై వైఎస్సార్‌సీపీ నేతలు అంతే వేగంతో విరుచుకుపడ్డారు. షర్మిల స్వతంత్రంగా మాట్లాడటం లేదని, ఆమె పూర్తిగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నిర్దేశించిన స్క్రిప్ట్ చదువుతున్న ’రాజకీయ మౌత్‌పీస్‘ గా మారిపోయారని వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సింగారెడ్డి సతీష్ రెడ్డి, అధికార ప్రతినిధి రాచమల్లు శివప్రసాద్ రెడ్డి ఘాటుగా విమర్శించారు. చంద్రబాబు పన్నిన పద్మవ్యూహంలో చిక్కుకుని, సొంత అన్నపైనే బురదజల్లుతున్న షర్మిల తీరును వారు తప్పుబడుతూ.. రాజకీయ లబ్ధి కోసం కుటుంబ గౌరవాన్ని తాకట్టు పెట్టొద్దని హెచ్చరించారు.

షర్మిల గుప్పించి విమర్శలు ఇవే
విశాఖపట్నం వేదికగా ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తన సోదరుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై మునుపెన్నడూ లేని విధంగా విమర్శనాస్త్రాలు సంధించారు. జగన్ తన ప్రవర్తనతో అన్న అనే పవిత్ర పదానికే కళంకం తెచ్చారని, ఆయన వంటి సోదరుడు ఉన్నవారికి శత్రువుల అవసరమే లేదని తీవ్రంగా వ్యాఖ్యానించారు. ముఖ్యంగా వైఎస్ వివేకానంద రెడ్డి హత్యోదంతం వెనుక కడప ఎంపీ టికెట్ రాజకీయం ఉందని ఆరోపించిన ఆమె, సాక్షి మీడియా ద్వారా మొదట దానిని గుండెపోటుగా చిత్రీకరించి ప్రజలను జగన్ మభ్యపెట్టారని మండిపడ్డారు. నిందితులకు రక్షణగా నిలుస్తూ బాధితురాలైన సునీతారెడ్డికి జగన్ అన్యాయం చేశారని, వివేకా మరణాన్ని సానుభూతిగా మార్చుకుని ఆయన ముఖ్యమంత్రి అయ్యారని సంచలన ఆరోపణలు చేశారు.
మరోవైపు రాష్ట్ర రాజకీయ పరిణామాలపై స్పందిస్తూ, అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల నుంచి వాకౌట్ చేసిన జగన్‌ను ఒక్క రోజు మురిపానికే సభకు వెళ్లారా? అని ఎద్దేవా చేశారు. ప్రజల సమస్యల గురించి మాట్లాడే ధైర్యం లేకపోతే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. గత ఎన్నికల్లో ఈవీఎంల ట్యాంపరింగ్ జరిగిందన్న ఆరోపణల్లో నిజాయితీ ఉంటే, కేంద్ర ఎన్నికల కమిషనర్‌పై ఇండియా కూటమి ప్రవేశపెట్టే అభిశంసన తీర్మానానికి వైఎస్సార్సీపీ ఎంపీలతో సంతకాలు చేయించాలని సవాల్ విసిరారు. మూడు రాజధానుల పేరుతో రాష్ట్రానికి రాజధాని లేకుండా చేశారని, విశాఖ అభివృద్ధిని గాలికొదిలేసి కేవలం అధికారం కోసమే పాకులాడారని విమర్శించారు.
చంద్రబాబు కీలుబొమ్మ గా షర్మిల
విశాఖ పర్యటనలో జగన్‌పై షర్మిల చేసిన విమర్శలను వైసీపీ నేతలు తీవ్రంగా కొట్టిపారేశారు. రాచమల్లు శివప్రసాద్ రెడ్డి ఈ వ్యవహారంపై నిప్పులు చెరిగారు. చంద్రబాబుకు రాజకీయంగా ఎప్పుడు కష్టం వచ్చినా, ప్రజల దృష్టిని మళ్లించేందుకు డైవర్షన్ పాలిటిక్స్ లో భాగంగా షర్మిల, సునీతలను తెరపైకి తెస్తారు అని ఆయన ధ్వజమెత్తారు. జగన్ మోహన్ రెడ్డిని అన్న అనే పదానికే కళంకం అని షర్మిల అనడంపై ఆయన మండిపడుతూ.. జగన్, భారతిలే అన్న-వదిన అనే పదాలకు అసలైన అర్థం చెప్పారని పేర్కొన్నారు. ఇంటి గుట్టును ఏబీఎన్ రాధాకృష్ణ, చంద్రబాబు వంటి బద్ధశత్రువుల దగ్గర పెట్టే ఇలాంటి చెల్లెలు ఏ ఇంట్లోనూ ఉండకూడదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
ఆస్తుల వివాదం.. అన్ని కోట్లు ఇచ్చినా ఇంకా ఆశేనా?
ఆస్తుల పంపకం విషయంలో షర్మిల చేస్తున్న ఆరోపణలను సతీష్ రెడ్డి లెక్కలతో సహా తిప్పికొట్టారు. జగన్ మోహన్ రెడ్డి తన కష్టార్జితం నుంచి ఇప్పటికే రూ. 236 కోట్లు షర్మిలకు అందజేశారని, ఇది కేవలం సోదరిపై ఉన్న మమకారంతోనే చేశారని గుర్తు చేశారు. పెళ్లయిన దశాబ్దాల తర్వాత, చట్టపరమైన ఇబ్బందులు ఉన్న ఆస్తుల్లో అదనపు వాటాల కోసం పాకులాడటం ఏ రకమైన న్యాయం? అని ఆయన ప్రశ్నించారు. ఇది కేవలం ఆస్తి కోసం చేస్తున్న పోరాటం కాదని, చంద్రబాబు కనుసన్నల్లో జగన్ ప్రతిష్ఠను దెబ్బతీసేందుకు చేస్తున్న రాజకీయ కుట్ర అని మండిపడ్డారు.
వివేకా కేసుపై దేవుని ముందు ప్రమాణానికి సిద్ధమా?
వివేకానంద రెడ్డి హత్య కేసును స్వార్థ రాజకీయాలకు వాడుకోవద్దని సతీష్ రెడ్డి తీవ్రంగా హెచ్చరించారు. ఈ కేసులో జగన్, భారతిలపై నిరాధారమైన ఆరోపణలు చేస్తున్న షర్మిల, సునీతలకు ఆయన ఒక బహిరంగ సవాల్ విసిరారు. నిజంగా మీకు చిత్తశుద్ధి ఉంటే, మీ కుటుంబ సభ్యులందరితో కలిసి దేవుని ముందు ప్రమాణం చేయడానికి సిద్ధమా? లేదా బహిరంగ చర్చకు రాగలరా? అని ఆయన నిలదీశారు. చంద్రబాబు పన్నిన కుట్రలో పడి కన్నతండ్రి లాంటి వివేకా మరణాన్ని కూడా రాజకీయ లబ్ధి కోసం వాడుకుంటూ సొంత కుటుంబంపైనే బురద జల్లడం అత్యంత దురదృష్టకరమని ధ్వజమెత్తారు.
రాజకీయ వ్యూహమా? కుటుంబ ద్రోహమా?
షర్మిల విమర్శలపై వైఎస్సార్‌సీపీ నాయకులు గతంలోనే ఖండించారు. నాడు అన్న కోసం పాదయాత్ర చేసిన షర్మిల, నేడు అదే అన్నను దెబ్బతీయడానికి చంద్రబాబుతో చేతులు కలపడం విచారకరం అని మాజీ మంత్రి ఆర్కే రోజా అన్నారు. వై.వి. సుబ్బారెడ్డి సైతం షర్మిల తీరుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తూ.. ఆస్తుల వ్యవహారం, వివేకా కేసును అడ్డం పెట్టుకుని కుటుంబాన్ని రోడ్డుపైకి లాగడం వెనుక పెద్ద కుట్ర దాగి ఉందని ఆరోపించారు. మరో సీనియర్ నాయకుడు సజ్జల రామకృష్ణారెడ్డి స్పందిస్తూ.. షర్మిల చేస్తున్నవి రాజకీయ విమర్శలు కావని, కేవలం చంద్రబాబు పగ ప్రతీకారాల స్క్రిప్ట్ అని కొట్టిపారేశారు.
రాచమల్లు జోస్యం..అన్నా తప్పయిందని రావాల్సిందే
ముగింపులో రాచమల్లు శివప్రసాద్ రెడ్డి ఒక ఆసక్తికరమైన జోస్యం చెప్పారు. కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదు. చంద్రబాబు ఎప్పటికైనా షర్మిల, సునీతలను మోసం చేయడం ఖాయం. ఆ రోజు వీరికి జగన్ తప్ప వేరే దిక్కు ఉండదు అని ఆయన పేర్కొన్నారు. అప్పుడు షర్మిల మళ్లీ తన సోదరుడి దగ్గరికే వచ్చి, అన్నా తప్పయిపోయింది.. నన్ను క్షమించు అని ప్రాయశ్చిత్తం చేసుకోవాల్సిన రోజు త్వరలోనే వస్తుందని ఆయన వ్యాఖ్యానించారు. జగన్ అభిమానుల గుండెల్లో ఉన్న స్థానాన్ని ఇలాంటి చిల్లర రాజకీయాలతో ఎవరూ చెరిపివేయలేరని ఆయన స్పష్టం చేశారు.
Read More
Next Story