
సస్పెన్షన్‌లోనే పదవీ విరమణ? పీవీ సునీల్ కుమార్‌పై సర్కార్ కఠిన నిర్ణయం
1993 బ్యాచ్‌కు చెందిన ఐపీఎస్ అధికారిగా పీవీ సునీల్ కుమార్ సుమారు 33 ఏళ్ల పాటు పోలీస్ శాఖలో వివిధ కీలక హోదాల్లో పనిచేశారు.
గత ప్రభుత్వ హయాంలో, అంతకుముందు టీడీపీ ప్రభుత్వ హయాంలో అత్యంత శక్తివంతమైన అధికారిగా వెలుగొందిన ఐపీఎస్ అధికారి పీవీ సునీల్ కుమార్‌కు కష్టాలు ఇప్పట్లో తీరేలా లేవు. ఆయనపై ఉన్న సస్పెన్షన్ వేటును పొడిగిస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. రఘురామకృష్ణరాజు కస్టడీ వేధింపుల కేసు నుంచి అగ్రిగోల్డ్ నిధుల దుర్వినియోగం వరకు.. వరుస ఆరోపణలు చుట్టుముట్టడంతో ప్రభుత్వం ఈ కఠిన చర్యలు చేపట్టిందా, లేదా కావాలనే ఇలాంటి కక్షపూరితంగా వ్యవహరిస్తూ ఇబ్బందులు పెడుతోందా అనే అటు పోలీసు వర్గాలు, ఇటు రాజకీయ వర్గాల్లోను చర్చనీయాంశంగా మారింది. కేవలం తాత్కాలికంగా కాకుండా, క్రిమినల్ కేసుల విచారణ తేలే వరకు లేదా ఆయన పదవీ విరమణ చేసే వరకు సస్పెన్షన్ కొనసాగుతుందని ఉత్తర్వుల్లో స్పష్టం చేయడంతో.. ఆయన కెరీర్ ఇప్పుడు అనిశ్చితిలో పడింది.
ఈ సస్పెన్షన్ పొడిగింపు కేవలం సాధారణమైనది కాదు. ఇది సునీల్ కుమార్ కెరీర్‌కు ఒక రకంగా డెడ్ ఎండ్ లాంటిదని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వుల్లోని టైమ్ లైన్ అత్యంత కీలకమైనది. ఆయనపై ఉన్న క్రిమినల్ కేసుల విచారణ పూర్తిగా ముగియాలి. లేదా ఆయన ఉద్యోగ విరమణ (Retirement) వయస్సు రావాలి. ఈ రెండింటిలో ఏది ముందు జరిగితే అప్పటి వరకు ఈ వేటు కొనసాగుతుందని ప్రభుత్వం స్పష్టం చేసింది. అంటే, విచారణ ఎంతకాలం సాగితే అంతకాలం ఆయన ఇంటికే పరిమితం కావాల్సి ఉంటుంది. విచారణ ఓ కొలిక్కి వచ్చి, కోర్టుల నుంచి క్లీన్ చిట్ లభించే వరకు ఆయన తిరిగి యూనిఫామ్ వేసుకునే అవకాశం దాదాపు మూసుకుపోయినట్టే కనిపిస్తోంది. ఒకప్పుడు పోలీస్ శాఖలో చక్రం తిప్పిన అధికారికి, ఇప్పుడు తన ఉనికిని కాపాడుకోవడమే అతిపెద్ద సవాలుగా మారింది.
అధికార గర్వం నుంచి ఆరోపణల సుడిగుండం వరకు
గత వైకాపా ప్రభుత్వ హయాంలోను, అంతకు ముందు టీడీపీ ప్రభుత్వ అత్యంత కీలకమైన బాధ్యతలు నిర్వర్తించిన పీవీ సునీల్ కుమార్, నేడు వరుస ఆరోపణల సుడిగుండంలో చిక్కుకున్నారు. ఆయన సస్పెన్షన్ పొడిగింపు వెనుక ఉన్న కారణాలు కేవలం పరిపాలనాపరమైనవి మాత్రమే కాదు, అత్యంత వివాదాస్పదమైన క్రిమినల్ ఆరోపణలు కూడా ఉన్నాయి. ఇందులో ప్రధానంగా నిలిచింది ఆర్ఆర్ఆర్ కస్టడీ వేధింపుల ఉదంతం. అప్పట్లో ఎంపీగా ఉన్న రఘురామకృష్ణరాజును సిఐడి కస్టడీలో ఉంచి, నిబంధనలకు విరుద్ధంగా వేధించారనే కేసులో సునీల్ కుమార్ ప్రధాన నిందితుడిగా ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉన్న వ్యక్తిని సైతం లెక్కచేయకుండా ప్రవర్తించారన్న ఈ ఆరోపణలు ఇప్పుడు ఆయన మెడకు చుట్టుకున్నాయా లేదా చుట్టుకునేట్టు చేశారా అనే చర్చ కూడా ఉంది.
ఉక్కిరిబిక్కిరి
కేవలం వేధింపుల కేసులే కాదు, తీవ్రమైన ఆర్థిక అక్రమాల ఆరోపణలు కూడా సునీల్ కుమార్‌ను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. లక్షలాది మంది బాధితులకు సంబంధించిన అగ్రిగోల్డ్ వ్యవహారంలో ఆస్తుల విక్రయం, నిధుల దుర్వినియోగం జరిగినట్లు ఆయనపై గట్టి ఆరోపణలు ఉన్నాయి. దీనికి తోడు, ఒక బాధ్యతాయుతమైన ఐపీఎస్ అధికారి అయ్యుండి.. కనీసం ప్రభుత్వ అనుమతి కూడా తీసుకోకుండా విదేశీ పర్యటనలకు వెళ్లడం ద్వారా సర్వీస్ రూల్స్‌ను బేఖాతరు చేశారన్న ఫిర్యాదులు సర్కారును ఆగ్రహానికి గురిచేశాయి. ఈ పరిణామాలన్నీ ఒకదాని వెంట ఒకటి వెలుగులోకి రావడంతో, ప్రభుత్వం గతంలోనే వేసిన వేటును ఇప్పుడు మరింత కఠినం చేస్తూ సస్పెన్షన్‌ను పొడిగించింది. పోలీస్ శాఖలోనే ఇది ఇప్పుడు పెను చర్చకు దారితీసింది.
మూడు దశాబ్దాల సర్వీస్..
1993 బ్యాచ్‌కు చెందిన ఐపీఎస్ అధికారిగా పీవీ సునీల్ కుమార్ సుమారు 33 ఏళ్ల పాటు పోలీస్ శాఖలో వివిధ కీలక హోదాల్లో పనిచేశారు. తన సుదీర్ఘ కెరీర్‌లో ఎన్నో కీలక బాధ్యతలు నిర్వర్తించిన ఆయన, పదవీ విరమణకు చేరువలో ఉన్న సమయంలో తీవ్రమైన ఆరోపణలు ఎదుర్కోవడం గమనార్హం. వాస్తవానికి ఆయన 2026, నవంబర్ 30న పదవీ విరమణ చేయాల్సి ఉంది. అయితే, ప్రభుత్వం జారీ చేసిన తాజా ఉత్తర్వుల ప్రకారం, జూన్ 30, 2026 నాటికే ఆయన స్థితిగతులపై ఒక స్పష్టత రానుంది. విచారణలో జాప్యం జరిగితే, ఒక సీనియర్ అధికారి సస్పెన్షన్‌లోనే ఇంటికి వెళ్లాల్సి రావడం ఇప్పుడు పోలీస్ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది.

