జగన్ తల ఎందుకు తీయకూడదంటున్న గోరంట్ల బుచ్చయ్య!
x

జగన్ తల ఎందుకు తీయకూడదంటున్న గోరంట్ల బుచ్చయ్య!

బుచ్చయ్య చౌదరి చెప్పిందేమిటీ, కొడాలి నానీ, వంశీ వినందేమిటీ?


"నోరు అదుపులో పెట్టుకోమని ఆ రోజే చెప్పా.. నా మాట విననందుకే ఇప్పుడు ఈ గతి పట్టింది" అంటూ తెలుగుదేశం పార్టీ సీనియర్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి తన మాజీ సహచరులు, మాజీ ఎమ్మెల్యేలు కొడాలి నాని, వల్లభనేని వంశీలపై సంచలన వ్యాఖ్యలు చేశారు. రాజమహేంద్రవరంలో బుధవారం మీడియాలో మాట్లాడిన ఆయన, గతంలో వారిద్దరికీ తాను ఇచ్చిన హెచ్చరికలను గుర్తు చేస్తూ ప్రస్తుత రాజకీయ స్థితిగతులపై విశ్లేషించారు.
అతివ్యాఖ్యలే కొంప ముంచేశాయి!
వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో కొడాలి నాని, వల్లభనేని వంశీ పరిధి దాటి విమర్శలు చేశారని, ఆ సమయంలోనే తాను వారిని వారించానని బుచ్చయ్య చౌదరి పేర్కొన్నారు. "నోరు అదుపులో పెట్టుకోవాలని గతంలోనే వాళ్లకు హితవు పలికాను. కానీ వినలేదు. ఇప్పుడు ఫలితం కళ్లముందే ఉంది" అని ఆయన ఎద్దేవా చేశారు. ప్రజాస్వామ్యంలో విమర్శలు హుందాగా ఉండాలని, హద్దులు దాటిన వారికి కాలమే సమాధానం చెబుతుందని ఆయన వ్యాఖ్యానించారు. కేసీఆర్‌పై సంచలన వ్యాఖ్యలు చేస్తూ జగన్‌కు వార్నింగ్ ఇచ్చారు.

బుచ్చయ్య చౌదరి మీడియాతో మాట్లాడుతూ.. రౌడీల‌ను వెంట పెట్టుకుని జగన్ బయట తిరుగుతున్నాడు, ఇన్ని రోజులు సైలెంట్‌గా ఉన్నాం. ఇకపై జగన్‌ను ఎలా కట్టడి చేయాలో చేస్తాం అని, అధికారంలోకి వస్తానని, వచ్చి రాగానే తలలు నరుకుతామని బెదిరిస్తున్నారు. ఇప్పుడు నీ తల ఎందుకు తీసేయకూడదు అంటూ ప్రశ్నించారు.
అలాగే వైసీపీ నేతలు నోరు అదుపులో పెట్టుకోవాలని, లేకపోతే వల్లభనేని వంశీ, కొడాలి నానిలకు పట్టిన గతే పడుతుందని హెచ్చరించారు. గతంలో వారు తన మాట వినకపోవడం వల్లే ఇప్పుడు చట్టపరమైన, రాజకీయపరమైన పరిణామాలు ఎదుర్కొంటున్నారని విమర్శించారు. వైఎస్ జగన్ ఒక నియంతలా వ్యవహరిస్తున్నారు.. ఆయన డిక్టేటర్ అంటూ మండిపడ్డారు.
అలాగే కేసీఆర్‌పై మాట్లాడుతూ.. అధికారం కోల్పోయినప్పుడల్లా చంద్రబాబుపై అనవసరంగా ఏడవడం కేసీఆర్ నైజం అంటూ ఎద్దేవా చేశారు. విభజన సమస్యలు కొనసాగకుండా ఉండాలంటే నాయకత్వంలో చిత్తశుద్ధి ఉండాలి, అది టీడీపీకే ఉందని అన్నారు. గోదావరిపై దిగువ రాష్ట్రం అయినా ఏపీ బనకచర్ల ప్రాజెక్టు నిర్మించుకుంటే తప్పేంటి? అంటూ ప్రశ్నించారు. సాగునీటి ప్రాజెక్టులు ఏపీ హక్కు అని, వాటిపై వాఖ్య‌లు చేయడం కేసీఆర్‌కు అలవాటుగా మారిందని అన్నారు.
కాగా, ఎవరో వైసీపీ అభిమానులు సినిమా డైలాగుల ఫ్లెక్సీ పెట్టుకుంటే అదే జగన్ అన్నట్లు టీడీపీ, దాని మీడియా ప్రచారం చేస్తుండడంతో పాటు చివరికి జగన్ తల తీసేస్తాం అన్నంత వరకు టీడీపీ నేతలు మాట్లాడుతుండడంతో ముందుముందు రాష్ట్రంలో ఎలాంటి రాజకీయ వాతావరణం ఉండబోతుందో అంచనా వేయచ్చు.
కూటమి ఐక్యతపై క్లారిటీ
ఎన్ని ఇబ్బందులు ఎదురైనా, ఎన్ని అవమానాలు ఎదురైనా టీడీపీ-జనసేన-బీజేపీ కూటమి బలంగా కొనసాగుతుందని బుచ్చయ్య చౌదరి స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ముందుచూపును, ఆయన దక్షతను డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సంపూర్ణంగా అర్థం చేసుకున్నారని కొనియాడారు. సినీ పరిశ్రమకు చెందిన కొంతమందితో పవన్ కళ్యాణ్‌ను రెచ్చగొట్టి కూటమిలో చిచ్చు పెట్టాలని వైసీపీ నీచమైన ఎత్తుగడలు వేస్తోందని ఆయన ఆరోపించారు.
జగన్, కేసీఆర్ కలిసి తెలుగు రాష్ట్రాల మధ్య విభజన సమస్యలను కావాలనే పరిష్కారం కాకుండా అడ్డుకున్నారని ధ్వజమెత్తారు.
ప్రజా సంక్షేమమే లక్ష్యం
ప్రస్తుత ప్రభుత్వం అధికారంలోకి రాగానే తెలుగు యూనివర్సిటీ వంటి దీర్ఘకాలిక పెండింగ్ సమస్యలను పరిష్కరించిందని, జగన్ నియంతృత్వ పాలన వల్ల ప్రజలు ఎంతగా నష్టపోయారో అందరికీ తెలుసని ఆయన పేర్కొన్నారు.
Read More
Next Story