
"ఆ భగవంతుడే నాతో చెప్పించాడు": శ్రీవారిలడ్డూపై చంద్రబాబు 'ఛార్జ్ షీట్'
గొడ్డుకొవ్వుపై చంద్రబాబు ఏమన్నారంటే..
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి N. Chandrababu Naidu అసెంబ్లీలో తిరుమల లడ్డూ కల్తీ వ్యవహారంపై ఇవాళ అసెంబ్లీలో సుదీర్ఘ ప్రకటన చేశారు. పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వైసీపీ ప్రభుత్వ హయాంలో దైవ ద్రోహం, అపవిత్రత జరిగిందని నిరూపించే ప్రయత్నం చేశారు. ఈ ప్రకటన కేవలం పరిపాలనా వివరణ మాత్రమే కాకుండా రాజకీయ, నైతిక, ఆధ్యాత్మిక కోణాల కలయికగా కనిపించింది.
“తిరుమల పవిత్రతపై జరిగిన దాడి కేవలం ఒక ప్రసాదం విషయంలో జరిగిన అపచారం కాదు, అది కోట్లాది హిందువుల విశ్వాసానికి తగిలిన గాయం” అని చంద్రబాబు పేర్కొన్నారు. “గొడ్డుకొవ్వు కలిసిందని నేను సొంతంగా చెప్పలేదు… National Dairy Development Board (NDDB) రిపోర్ట్ ఆధారంగానే చెప్పాను. ఆ భగవంతుడే నాతో చెప్పించాడు. నన్ను నమ్మండి, నాకు దురుద్దేశం లేదు” అని వ్యాఖ్యానించారు.
వైసీపీపై నైతిక దాడి...
2019–24 మధ్య 20 కోట్ల లడ్డూలను కల్తీ నెయ్యితో తయారు చేశారని, 59.71 లక్షల లీటర్ల నెయ్యి వినియోగంలో లోపాలున్నాయని, రూ.231 కోట్లకు పైగా అక్రమాలు జరిగాయని పేర్కొంటూ గత ప్రభుత్వంపై తీవ్ర ఆరోపణలు చేశారు. “మహాపాపం” అనే పద ప్రయోగం ద్వారా ఈ అంశాన్ని కేవలం అవినీతి కాదు- భక్తి, ఆస్తిక భావోద్వేగాలకు సంబంధించిన అంశంగా చిత్రీకరించారు. ఇది రాజకీయంగా వైసీపీని రక్షణాత్మక స్థితిలోకి నెట్టే వ్యూహంగా భావించవచ్చు.
తక్కువ ధరకే నెయ్యి సరఫరా చేసేలా టెండర్ నిబంధనలు మార్చడం వల్ల నాణ్యత ఎలా దెబ్బతిన్నదో చంద్రబాబు వివరించారు. కిలో రూ. 320 కే నెయ్యి ఎలా వస్తుందనే లాజిక్‌ను తెరపైకి తెచ్చారు.
ఆధారాల ప్రదర్శన: సాంకేతికత ద్వారా నమ్మకం
చంద్రబాబు తన ప్రసంగంలో National Dairy Development Board (NDDB) రిపోర్ట్, ఫోరెన్సిక్ వివరాలు, టెండర్ మార్పులు, ల్యాబ్ నివేదికల అంశాలను గణాంకాలతో చూపించారు. అలాగే సీబీఐ ఆధ్వర్యంలో సిట్, సుప్రీంకోర్టు సూచనలు వంటి అంశాలను ప్రస్తావించారు. దీని ద్వారా “ఇది రాజకీయ ఆరోపణ కాదు, ఆధారాలపై నిలిచిన అంశం” అనే భావనను బలపరచే ప్రయత్నం చేశారు.
వ్యవస్థలో మార్పులకు సూచన
టెండర్ నిబంధనల సడలింపులు, పాల కొనుగోలు పరిమితుల తొలగింపు, అనుభవ ప్రమాణాల తగ్గింపు వంటి అంశాలను వివరించడం ద్వారా గత పాలనలో విధానపరమైన మార్పులు జరిగాయని చెప్పారు. దీనితో భవిష్యత్తులో టెండర్ వ్యవస్థ, ఫుడ్ సేఫ్టీ ప్రమాణాలపై కఠిన చర్యలు తీసుకునే సంకేతం ఇచ్చినట్టుగా కనిపిస్తోంది.
భక్తి–భావోద్వేగ కోణం
తిరుమల లడ్డూ కేవలం ప్రసాదం కాదు, కోట్లాది భక్తుల విశ్వాసానికి ప్రతీక. ఆ సందర్భంలో జంతు కొవ్వు అంశం ప్రస్తావన అత్యంత సున్నితమైనది. “ఆ భగవంతుడే నాతో చెప్పించాడు” అనే వ్యాఖ్య ద్వారా చంద్రబాబు ఈ విషయాన్ని ఆధ్యాత్మిక, నైతిక బాధ్యతగా చూపించే ప్రయత్నం చేశారు. ఇది భక్తుల మనోభావాలకు అనుసంధానం కల్పించే రాజకీయ వ్యూహంగా కూడా చూడవచ్చు.
దర్యాప్తు తర్వాత ఏమవుతుందంటే...
సిట్ ఏర్పాటు, సీబీఐ నివేదిక, ఏకసభ్య కమిషన్ నిర్ణయం వంటి అంశాలను ప్రస్తావించడం ద్వారా ప్రభుత్వం దర్యాప్తును కొనసాగిస్తోందని స్పష్టం చేశారు. డిప్యూటీ సీఎం Pawan Kalyan కూడా దోషులు ఎవరైనా శిక్షపడాలనే అభిప్రాయం వ్యక్తం చేయడం ద్వారా కూటమి ప్రభుత్వం ఈ అంశంలో కఠిన వైఖరి తీసుకుంటోందనే సందేశం వెళ్లింది.
మొత్తంగా చంద్రబాబు ఇచ్చిన సంకేతం ఏమిటంటే?
గత వైసీపీ పాలనపై అవినీతి, నిర్వాహక లోపాలు జరిగాయి. తిరుమల వంటి ఆధ్యాత్మిక కేంద్రాల పరిరక్షణలో కూటమి ప్రభుత్వం కట్టుదిట్టంగా వ్యవహరిస్తోంది. జగన్ పాలనలో హిందూ దేవాలయాల అపత్రితకు దారులు ఏర్పాడ్డాయి. పరిపాలనా వ్యవస్థలో పారదర్శకత, బాధ్యతాయుత చర్యలపై దృష్టి పెట్టి భక్తుల విశ్వాసాన్ని తిరిగి నిలబెట్టే ప్రయత్నం చేస్తున్నామనే సంకేతం ఇచ్చారు చంద్రబాబు.
చంద్రబాబు నాయుడు ఈ అంశాన్ని కేవలం ఒక 'లడ్డూ వివాదం'గా మిగిల్చకుండా, గత ప్రభుత్వ వైఫల్యాలను, వ్యవస్థల విధ్వంసాన్ని ఎత్తిచూపే ఒక బలమైన ఆయుధంగా మార్చుకున్నారు. ఇది భక్తుల మనోభావాలను గౌరవించే ప్రయత్నమా లేక రాజకీయంగా ప్రత్యర్థిని దెబ్బతీసే వ్యూహమా అన్నది పక్కన పెడితే.. పవిత్రమైన తిరుమల విషయంలో జవాబుదారీతనం ఉండాలని కోరుకునే సగటు భక్తుడికి మాత్రం ఈ వివరణ ఒక భరోసా ఇచ్చిన స్పష్టమైన రాజకీయ ప్రకటనగా కూడా చూడవచ్చు.
ప్రతిపక్షం ఏమంటోంది?
ప్రభుత్వం పెట్టిన ప్రెజంటేషన్‌పై ప్రతిపక్షమైన వైసీపీ 'రాజకీయ కక్ష' అనే వాదనను తెరపైకి తెచ్చింది. చంద్రబాబు నాయుడు ఇంతకన్నా గొప్పగా చెబుతాడని తాము ఊహించలేదని, ఇవన్నీ డైవర్షన్ పాలిటిక్స్ అని వైసీపీ నాయకుడు బొత్స సత్యనారాయణ కొట్టిపారేశారు.
Next Story

