నెయ్యిలో జంతువుల కొవ్వే కాదు..బాత్‌రూమ్‌ క్లీనర్లు కూడా: చంద్రబాబు
x
కర్నూలు జిల్లా కలుగొట్ల మీ భూమి-మీ హక్కు కార్యక్రమంలో సీఎం చంద్రబాబు

నెయ్యిలో జంతువుల కొవ్వే కాదు..బాత్‌రూమ్‌ క్లీనర్లు కూడా: చంద్రబాబు

దేవాలయాల పవిత్రతతో పాటు ప్రజల భూములకు రక్షణ కల్పించడమే తమ ధ్యేయమని సీఎం స్పష్టం చేశారు.


తిరుమల లడ్డూ ప్రసాదం కల్తీ వివాదంపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. గత ప్రభుత్వ హయాంలో శ్రీవారి ప్రసాదం విషయంలో తీవ్రమైన అపచారం జరిగిందని, నెయ్యిలో కేవలం జంతువుల కొవ్వు మాత్రమే కాకుండా.. బాత్‌రూమ్‌ క్లీన్ చేసే రసాయనాలను కూడా కలిపారని ఆరోపించారు. కర్నూలు జిల్లా కలుగొట్లలో శుక్రవారం జరిగిన మీ భూమి-మీ హక్కు వేదికగా ఆయన ఈ ఘాటైన విమర్శలు చేశారు.

ఎన్‌డీడీబీ నివేదికే సాక్ష్యం

లడ్డూ ప్రసాదంలో ఎటువంటి కల్తీ జరగలేదని ప్రతిపక్షాలు చేస్తున్న వాదనను చంద్రబాబు తిప్పికొట్టారు. ప్రసాదంలో వాడే నెయ్యిలో జంతువుల కొవ్వు కలిసిందని ఎన్‌డీడీబీ (NDDB) నివేదిక అత్యంత స్పష్టంగా వెల్లడించిందని ఆయన గుర్తు చేశారు. భక్తుల మనోభావాలతో ఆడుకుంటూ, శ్రీవారి పవిత్రతను దెబ్బతీసేలా బాత్‌రూమ్‌ క్లీన్ చేసే రసాయనాలతో కలిపిన కల్తీ నెయ్యిని సరఫరా చేశారు. ఇది కేవలం అవినీతి మాత్రమే కాదు, కోట్లాది మంది హిందువుల విశ్వాసాలపై జరిగిన దాడి అని ముఖ్యమంత్రి ఆవేదన వ్యక్తం చేశారు.

శ్రీశైలంలోనూ అదే దుస్థితి

కేవలం తిరుమలకే పరిమితం కాకుండా, శ్రీశైలం దేవస్థానంలో కూడా రసాయనాలతో ప్రసాదాన్ని కల్తీ చేశారని చంద్రబాబు ఆరోపించారు. గత పాలకుల హయాంలో పుణ్యక్షేత్రాల పవిత్రత గాలికి వదిలేశారని దుయ్యబట్టారు. తాము అధికారంలోకి రాగానే టీటీడీలో ప్రక్షాళన మొదలుపెట్టామని, సమర్థవంతమైన అధికారులను నియమించడం వల్ల ఇప్పుడు లడ్డూ నాణ్యతలో స్పష్టమైన మార్పు కనిపిస్తోందని ఆయన పేర్కొన్నారు.

భూముల రక్షణ.. అక్రమార్కులకు జైలు

దేవాలయాల పవిత్రతతో పాటు ప్రజల భూములకు రక్షణ కల్పించడమే తమ ధ్యేయమని సీఎం స్పష్టం చేశారు. మీ భూమి-మీ హక్కు కార్యక్రమం ద్వారా లంచాల వ్యవస్థకు చరమగీతం పాడుతున్నామని తెలిపారు. రాజముద్రతో ఇచ్చే పట్టాదారు పాస్‌బుక్‌లను ఎవరైనా ట్యాంపర్ చేయడానికి ప్రయత్నిస్తే, వారిని కనికరం లేకుండా నేరుగా జైలుకే పంపిస్తామని చంద్రబాబు ఈ సందర్భంగా భూమాఫియాను హెచ్చరించారు.

Read More
Next Story