అంబటి నుంచి జోగి రమేష్ వరకు..అంతా విధ్వంసమే : జగన్
x
మాజీ మంత్రి జోగి రమేష్ కుటుంబాన్ని పరామర్శించిన మాజీ సీఎం వైఎస్ జగన్

అంబటి నుంచి జోగి రమేష్ వరకు..అంతా విధ్వంసమే : జగన్

టీటీడీ ప్రక్షాళన కోసమే తీసుకువచ్చామని చెప్పిన శ్యామలరావును హఠాత్తుగా ఎందుకు తొలగించారో సమాధానం చెప్పాలని జగన్ డిమాండ్ చేశారు.


రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం జంగిల్ రాజ్ ను నడిపిస్తోందని, అబద్ధాలతో అల్లిన రాజకీయం బయటపడుతుందనే భయంతోనే వైఎస్సార్‌సీపీ నేతలపై హత్యాప్రయత్నాలకు ఒడిగడుతున్నారని మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ధ్వజమెత్తారు. శుక్రవారం మాజీ మంత్రి జోగి రమేష్ నివాసంపై జరిగిన పెట్రోల్ బాంబుల దాడిని స్వయంగా పరిశీలించిన ఆయన, చంద్రబాబు నాయుడుపై సంచలన విమర్శలు చేశారు. తిరుమల లడ్డూపై చంద్రబాబు సృష్టించిన విష ప్రచారాన్ని సీబీఐ నివేదిక బట్టబయలు చేసింది.. కల్తీ జరగలేదని క్లీన్‌చిట్ రావడంతో తట్టుకోలేక, ఆ నిజాన్ని నిలదీస్తున్న అంబటి రాంబాబు, జోగి రమేష్ వంటి నేతల ఇళ్లపై పెట్రోల్ బాంబులు, యాసిడ్ బాటిళ్లతో దాడులు చేయిస్తున్నారు అని జగన్ మండిపడ్డారు. పోలీసుల సహకారంతోనే టీడీపీ గూండాలు ఈ స్కెచ్ వేశారని ఆరోపిస్తూ, వీడియో ఆధారాలతో సహా బాబు సర్కార్‌ను జగన్ తూర్పారబట్టారు.

రాజకీయ దాడులు.. పోలీసుల పాత్ర

రాష్ట్రంలో ప్రస్తుతం అంబటి రాంబాబు నుంచి జోగి రమేష్ వరకు వైఎస్సార్‌సీపీ నేతలే లక్ష్యంగా విధ్వంసం కొనసాగుతోందని వైఎస్ జగన్ మండిపడ్డారు. గుంటూరులో అంబటి రాంబాబు ఇంటిపై దాడి చేసి, ఆయన కార్యాలయాన్ని తగలబెట్టిన అరాచక శక్తులు, ఇబ్రహీంపట్నంలో జోగి రమేష్ నివాసంపై పెట్రోల్ బాంబులు, యాసిడ్ బాటిళ్లతో విరుచుకుపడటం అమానుషమని ధ్వజమెత్తారు. ఇంట్లో వృద్ధులు ఉన్నారని తెలిసి కూడా ఇలాంటి దాడులకు ఒడిగట్టడం ముమ్మాటికీ హత్యాయత్నమేనని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ దాడుల వెనుక పోలీసుల ముందస్తు పన్నాగం ఉందని ఆరోపిస్తూ, టీడీపీ నేతలతో కలిసి పోలీసులు ఎలా స్కెచ్ వేశారో వివరించే వీడియో క్లిప్పింగ్స్‌ను ఆధారాలుగా చూపుతూ ప్రభుత్వ తీరును జగన్ తూర్పారబట్టారు.

బాబు చిప్ పాడైంది

తిరుమల లడ్డూ ప్రసాదంపై చంద్రబాబు చేసిన ఆరోపణలను జగన్ తీవ్రంగా తిప్పికొట్టారు. లడ్డూలో ఎలాంటి కల్తీ జరగలేదని, జంతువుల కొవ్వు కలవలేదని సీబీఐ తన విచారణలో తేటతెల్లం చేసిందని ఆయన గుర్తు చేశారు. ముఖ్యంగా టీటీడీ మాజీ చైర్మన్లు వైవీ సుబ్బారెడ్డి, భూమన కరుణాకర్‌రెడ్డిలకు సీబీఐ క్లీన్‌చిట్ ఇవ్వడం చంద్రబాబు అబద్ధాలకు నిదర్శనమని మండిపడ్డారు. సీబీఐ ఛార్జ్‌షీట్‌లోని 62వ పేజీని ఉటంకిస్తూ.. చంద్రబాబు హయాంలోనే రిజెక్ట్ అయిన ట్యాంకర్లు దొడ్డిదారిన టీటీడీలోకి వచ్చాయని, మరి ఇప్పుడు పాపం చేసింది ఎవరని నిలదీశారు. అసత్య ప్రచారం చేస్తున్న మీ చిప్ సరిచేసుకోమన్నందుకే జోగి రమేష్‌పై దాడి చేశారు అంటూ జగన్ ఘాటైన సెటైర్లు వేశారు.

అధికారుల నియామకంపై ప్రశ్నల వర్షం

చంద్రబాబు ఆరోపణల్లో ఏమాత్రం చిత్తశుద్ధి లేదని చెప్పడానికి అధికారుల బదిలీలే నిదర్శనమని జగన్ విమర్శించారు. ఒకవేళ తమ హయాంలో తప్పు జరిగి ఉంటే, అప్పట్లో ఈవోగా పనిచేసిన అనిల్ సింఘాల్‌ను మళ్ళీ ఇప్పుడు ఎందుకు టీటీడీ ఈవోగా తెచ్చుకున్నారని ప్రశ్నించారు. అలాగే, టీటీడీ ప్రక్షాళన కోసమే తీసుకువచ్చామని చెప్పిన శ్యామలరావును హఠాత్తుగా ఎందుకు తొలగించారో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. అధికారుల మార్పులే ఈ వివాదం వెనుక ఉన్న రాజకీయ కుట్రను తేటతెల్లం చేస్తున్నాయని ఆయన ధ్వజమెత్తారు.

అరాచకాలపై న్యాయపోరాటం సిద్ధం

రాష్ట్రంలో కొనసాగుతున్న ఈ జంగిల్ రాజ్ పరిపాలనపై తాము మౌనంగా ఉండబోమని జగన్ హెచ్చరించారు. వరుస దాడులు, అక్రమ కేసులు, పోలీసుల ఏకపక్ష వైఖరిపై అత్యున్నత స్థాయిలో పోరాడుతామని స్పష్టం చేశారు. దాడులకు సంబంధించిన వీడియో క్లిప్పింగ్స్, ఇతర ఆధారాలతో జాతీయ మానవ హక్కుల కమిషన్ (NHRC) , సుప్రీంకోర్టును ఆశ్రయిస్తామని తెలిపారు. సామాన్యులకు, పార్టీ కార్యకర్తలకు రక్షణ కల్పించడంలో ప్రభుత్వం విఫలమైందని, ఈ అరాచకాలను దేశవ్యాప్తంగా ఎండగడతామని జగన్ ఈ సందర్భంగా శపథం చేశారు.

Read More
Next Story