మూడేళ్లు ఆగు గునపాల నొప్పి చూపిస్తా
x

మూడేళ్లు ఆగు గునపాల నొప్పి చూపిస్తా

మంత్రి కొల్లు రవీంద్రకు పేర్ని నాని మాస్ వార్నింగ్.


బందరు (మచిలీపట్నం) రాజకీయాల్లో ఒక్కసారిగా సెగలు రేగాయి. ఆరో వార్డులో అక్రమంగా ఒక ఇంటిని కూల్చివేయడాన్ని నిరసిస్తూ వైఎస్సార్‌సీపీ నేత, మాజీ మంత్రి పేర్ని నాని క్షేత్రస్థాయిలో పర్యటించారు. కూల్చివేతకు గురైన ఇంటిని పరిశీలించి, బాధితులను పరామర్శించిన అనంతరం ఆయన మంత్రి కొల్లు రవీంద్రపై నిప్పులు చెరిగారు. పేదల ఇళ్లను కూల్చి వారి గుండెల్లో గునపాలు దింపారని, ఈ నొప్పికి ప్రతిఫలం అనుభవించక తప్పదని హెచ్చరించారు.

2029లో వడ్డీతో సహా చూపిస్తా
మంత్రి కొల్లు రవీంద్రకు పేర్ని నాని నేరుగా మాస్ వార్నింగ్ ఇచ్చారు. కొల్లు రవీంద్ర.. మరో మూడేళ్లు ఆగు. పేదల గుండెల్లో నువ్వు దింపిన గునపాల నొప్పి నీకు కూడా రుచి చూపిస్తా. 2029లో మళ్ళీ జగన్ ప్రభుత్వం రాగానే.. ఇప్పుడు ఇళ్లు కూల్చిన ఇదే బాపిరాజు చౌదరిని మళ్ళీ బందరు మున్సిపల్ కమిషనర్‌గా తీసుకొస్తా. అప్పుడు జేసీబీ బకెట్లు దిగితే నొప్పి ఎలా ఉంటుందో నీకు, నీ వెనుక ఉండి ఆడిస్తున్న నీ యజమానికి తెలిసేలా చేస్తా అంటూ ఆవేశంగా వ్యాఖ్యానించారు.
అధికారులారా.. ఎక్కడికి పారిపోయినా వదలను
కూల్చివేతల్లో పాల్గొన్న అధికారులపై కూడా పేర్ని నాని విరుచుకుపడ్డారు. అసిస్టెంట్ కమిషనర్ గోపాలరావు.. నువ్వు ఎక్కడికి పారిపోయినా వదలను. ఆంధ్ర రాష్ట్రంలో ఎక్కడ ఉన్నా సరే.. ఒకవేళ భయపడి తెలంగాణకు వెళ్లినా సరే అక్కడ కేసీఆర్ కాళ్లు పట్టుకునైనా నిన్ను పట్టుకొచ్చి నీ ఇంటి సంగతి చూస్తా అని హెచ్చరించారు. అస్సలు మీరు మనుషులేనా? అని అధికారులను ప్రశ్నించారు. పోలీసులు కూడా నిబంధనలకు విరుద్ధంగా మంత్రి చెప్పినట్లు తందానా అనడం సరికాదని హితవు పలికారు.
విశ్వాసం లేని రాజకీయం వద్దు
మంత్రి కొల్లు రవీంద్ర వెంట పోలీసులు తప్ప టీడీపీ కార్యకర్తలు ఎవరూ లేరని పేర్ని నాని ఎద్దేవా చేశారు. గతంలో తమను వదిలేసి కాపు సామాజికవర్గం నేతలు రవీంద్ర పల్లకి మోశారని, కానీ ఆయన వారికి చేసిందేమీ లేదని విమర్శించారు. తన దగ్గర పనిచేసే వ్యక్తులు ఒక కాపు ఆడబిడ్డకు అన్యాయం చేస్తే న్యాయం చేయలేని వ్యక్తివి నువ్వా అని నిలదీశారు. కనీసం కుక్కకు ఉన్న విశ్వాసం కూడా మంత్రికి లేకపోవడం దురదృష్టకరమని తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.
Read More
Next Story