
టీవీకే విజయ్ ఆరోపణలకు ఈపీఎస్ కౌంటర్..
అన్నాడీఎంకే రెండో దఫా హామీల విడుదల
తమిళనాడు(Tamil Nadu) అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో అన్నాడీఎంకే(AIADMK) ప్రధాన కార్యదర్శి ఎడప్పాడి కె. పళనిస్వామి( Edappadi K Palaniswami) రెండో దఫా ఎన్నికల హామీలను ప్రకటించారు. చెన్నై రాయపేటలోని పార్టీ ప్రధాన కార్యాలయంలో జరిగిన జిల్లా కార్యదర్శుల సమావేశంలో ఆయన ప్రసంగించారు. ఈ సందర్భంగా టీవీకే అధినేత విజయ్ చేసిన అవినీతి ఆరోపణలను ఆయన ఖండించారు. అవి రాజకీయ అవగాహన లోపంతో చేసిన వ్యాఖ్యలని పేర్కొన్నారు.
హామీలేంటి?
రెండో దశ హామీల్లో సీనియర్ సిటిజన్లు, వితంతువులు, భర్త వదిలేసిన మహిళలు, వికలాంగులు, ట్రాన్స్‌జెండర్లకు సామాజిక భద్రతా పింఛన్‌ను నెలకు రూ. 1,200 నుంచి రూ.2వేలకు పెంచుతామని ప్రకటించారు. బ్యాంకు విద్యా రుణాలను పూర్తిగా మాఫీ చేసి, ఆ భారాన్ని రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తుందని హామీ ఇచ్చారు. బియ్యం రేషన్ కార్డుదారులకు ఏడాదికి మూడు ఉచిత ఎల్‌పీజీ సిలిండర్లు అందిస్తామని తెలిపారు. జల్లికట్టులో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు రూ. 10 లక్షల పరిహారం, గాయపడిన వారికి వైద్య చికిత్స కోసం రూ. 2 లక్షల సహాయం అందిస్తామని చెప్పారు. జల్లికట్టు నిర్వహణకు రూ.5 లక్షల సబ్సిడీ, ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ రద్దు చేసి మాన్యువల్ విధానాన్ని పునరుద్ధరిస్తామని హామీ ఇచ్చారు. మైనారిటీ మహిళలకు వడ్డీ లేని రుణాలు, సహకార బ్యాంకుల నుంచి వికలాంగులు తీసుకున్న రుణాలను మాఫీ చేస్తామని ప్రకటించారు.
మొదటి దశ హామీల్లో గృహిణులకు నెలకు రూ. 2వేలు సాయం, టౌన్ బస్సుల్లో పురుషులకు ఉచిత ప్రయాణం, “అమ్మ ఇల్లం” పథకం కింద గృహనిర్మాణం, గ్రామీణ ఉపాధి హామీని 150 రోజులకు పెంపు, సబ్సిడీ ద్విచక్ర వాహనాల పథకం వంటివి ఉన్నాయి.
‘‘నిర్దోషిగా బయటపడ్డా..’’
విజయ్ చేసిన అవినీతి ఆరోపణలపైఈపీఎస్ స్పందించారు. తనపై వచ్చిన ఆరోపణలకు సంబంధించి కోర్టులో నిర్దోషిగా నిరూపించుకున్నానని చెప్పారు. కూటమి నాయకత్వం విషయంలో విజయ్‌కు అవగాహన లేదని విమర్శించారు. మరోవైపు టీవీకే ప్రతినిధులు అన్నాడీఎంకే అవినీతి శక్తిగా ఉందని ఆరోపిస్తున్నారు.
రాజకీయ విశ్లేషకులు మాత్రం ఈ హామీల ప్రకటన ఎన్నికల వ్యూహంలో భాగమని అభిప్రాయపడుతున్నారు. విజయ్ ఇటీవల పార్టీపై దాడులను ముమ్మరం చేసిన నేపథ్యంలో ప్రతిస్పందనగా అన్నాడీఎంకే మరిన్ని సంక్షేమ హామీలతో ముందుకు వచ్చిందని వ్యాఖ్యానిస్తున్నారు. అలాగే విజయ్ రాజకీయ వైఖరిలో మార్పులపై కూడా చర్చ జరుగుతోంది.

