
ఓపీఎస్‌కు శాశ్వతంగా నో ఎంట్రీ చెప్పిన ఈపీఎస్..
విజయ్‌పై అన్నాడీఎంకే జనరల్ సెక్రటరీ బహిరంగ విమర్శ..
పార్టీ నుంచి బహిష్కరణకు గురైన ఓ. పన్నీర్ సెల్వం (OPS) తిరిగి అన్నాడీఎంకేలో చేరే అవకాశమే లేదని అఖిల భారత అన్నా ద్రవిడ మున్నేట్ర కజగం (AIADMK) జనరల్ సెక్రటరీ ఎడప్పాడి కె. పళనిస్వామి (EPS) మరోసారి స్పష్టం చేశారు. అదే సమయంలో, తమిళగ వెట్రి కజగం (TVK) అధినేత, నటుడు విజయ్‌పై ఈపీఎస్ తొలిసారిగా బహిరంగంగా ప్రత్యక్ష విమర్శలు చేశారు.
సేలం జిల్లా ఓమలూరులో గురువారం జరిగిన కార్యక్రమంలో మాట్లాడుతూ.. “ఓపీఎస్‌ను జనరల్ కౌన్సిల్ ఏకగ్రీవంగా ప్రాథమిక సభ్యత్వం నుంచే బహిష్కరించింది. ఆయనకు తిరిగి పార్టీలో చోటు లేదు” అని ఈపీఎస్ తేల్చి చెప్పారు. అయితే, ఓపీఎస్‌ను ఎన్డీఏ కూటమిలో చేర్చే అంశంపై మాత్రం ఆయన స్పందించకుండా తప్పించుకున్నారు. 2026 తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఈపీఎస్ ఎన్డీఏ ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఉన్నారు.
ఇదిలా ఉండగా, తేని జిల్లాలో తన మద్దతుదారులను ఉద్దేశించి మాట్లాడిన ఓపీఎస్.. కేసులు ఉపసంహరించుకుంటే తిరిగి అన్నాడీఎంకేలో చేరేందుకు సిద్ధమని చెప్పారు. ఈపీఎస్‌ను “అరుమై అన్నన్” (ప్రియమైన సోదరుడు) అని పిలవడం రాజకీయ వర్గాల్లో ఆసక్తిని రేపింది.
సీనియర్ జర్నలిస్ట్ ప్రియన్ మాట్లాడుతూ.. “ఈపీఎస్ తన నిర్ణయంపై స్పష్టంగా ఉన్నారు. కానీ ఓపీఎస్ ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు. ఇక ఆయన తన రాజకీయ భవిష్యత్తును తానే నిర్ణయించుకోవాల్సిన పరిస్థితి. టీవీకే లేదా డీఎంకేలో చేరే అవకాశాలు ఉన్నాయి” అని వ్యాఖ్యానించారు.
కరూర్ ఘటనపై ఈపీఎస్ ఏమన్నారు?
గత సెప్టెంబర్‌లో కరూర్‌లో విజయ్ పాల్గొన్న కార్యక్రమంలో జరిగిన తొక్కిసలాటలో 41 మంది మృతి చెందిన ఘటనపై ఈపీఎస్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
“విజయ్ ఎలాంటి ప్రణాళిక లేకుండా కార్యక్రమానికి వెళ్లాడు. అందుకే ఇంతటి ప్రాణనష్టం జరిగింది. ఆయన బాధిత కుటుంబాలను పరామర్శించలేదు. మేము వెళ్లాం. ఇలాంటి వ్యక్తి ఎలా నాయకుడు అవుతాడు?” అని ఈపీఎస్ ప్రశ్నించారు. సినిమాల ద్వారా వేల కోట్ల రూపాయలు సంపాదించినా, రాజకీయాల్లో నిలబడగలడో లేదో సందేహమేనని అన్నారు.
అయితే, విజయ్‌పై చేసిన విమర్శలు సాధారణంగా ఈపీఎస్ చేసే తీవ్ర దాడులతో పోలిస్తే కొంత సంయమనంతోనే ఉన్నాయని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. 2026 ఎన్నికల్లో పోటీ డీఎంకే–టీవీకే మధ్యే జరుగుతుందన్న విజయ్ వ్యాఖ్యను ఈపీఎస్ తోసిపుచ్చుతూ.. “డీఎంకేకు నిజమైన ప్రత్యామ్నాయం అన్నాడీఎంకే మాత్రమే” అని స్పష్టం చేశారు.
రాజకీయ వర్గాల స్పందన..
ప్రియన్ మాట్లాడుతూ.. “ఈపీఎస్ విజయ్‌ను శత్రువుగా మార్చుకోవాలని కోరుకోవడం లేదు. విజయ్ ఇప్పుడు కేవలం నటుడు కాదు, పార్టీ నాయకుడు. భవిష్యత్తులో ఇరువర్గాల మధ్య పొత్తు ఆశ్చర్యం కలిగించదు” అని అన్నారు.
రాజకీయ వ్యాఖ్యాత నందకుమార్ మాత్రం ఈపీఎస్ వ్యాఖ్యలను ప్రశ్నించారు. “ఒక నటుడిని లేదా నాయకుడిని చూడటానికి ప్రజలు పెద్ద సంఖ్యలో రావడం నేరమా? జనసమూహాన్ని నియంత్రించాల్సింది పోలీసులు, అధికారులు. ఒక రాజకీయ నాయకుడిని మాత్రమే ఎలా బాధ్యత వహింపజేస్తారు?” అని ఆయన అన్నారు.
డీఎంకేపై ఈపీఎస్ దాడి ..
ఈపీఎస్ తన ప్రసంగంలో అధికార డీఎంకేపై కూడా విమర్శలు గుప్పించారు. ఎన్నికల హామీల్లో నాలుగింట ఒక వంతు కూడా అమలు చేయలేదని, రాష్ట్రంలో శాంతిభద్రతలు పూర్తిగా క్షీణించాయని ఆరోపించారు. ముఖ్యమంత్రి ఎం.కే. స్టాలిన్ చేసిన రూపక వ్యాఖ్యలను కూడా ఎగతాళి చేశారు. ఇదే సమయంలో, అన్నాడీఎంకే ఐటీ విభాగం, కార్యకర్తలు విజయ్‌ను అనుభవం లేని రాజకీయ నాయకుడిగా చిత్రీకరిస్తూ సోషల్ మీడియాలో ప్రచారం చేపట్టారు. డీఎంకే వ్యతిరేక ఓట్లను చీల్చే పార్టీగా టీవీకేను ఆరోపించారు. దీనికి ప్రతిగా టీవీకే మద్దతుదారులు స్పందించారు. అసెంబ్లీలో విజయ్‌ను ఈపీఎస్ గతంలో ప్రశంసించిన విషయాన్ని గుర్తుచేస్తూ.. అన్నాడీఎంకే భయంతోనే ఈ విమర్శలు చేస్తోందని ఎదురుదాడి చేశారు.

