
బ్రాండ్లు మార్చారు.. కోట్లు కొల్లగొట్టారు
మద్యం కుంభకోణంపై నిందితులను నిలదీసిన ఈడీ. రూ. 4 వేల కోట్ల దోపిడీపై ఆరా.
ఆంధ్రప్రదేశ్‌లో గత ప్రభుత్వ హయాంలో జరిగినట్లుగా భావిస్తున్న మద్యం కుంభకోణంపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ED) దర్యాప్తు ముమ్మరం చేసింది. సోమవారం ఈ కేసులో నిందితులుగా ఉన్న కృష్ణమోహన్‌రెడ్డి, ధనుంజయరెడ్డి, వెంకటేశ్ నాయుడు, చాణక్య ఈడీ అధికారుల ముందు విచారణకు హాజరయ్యారు. సుమారు రెండు గంటల పాటు సాగిన విచారణలో అధికారుల ప్రశ్నల వర్షంతో నిందితులు ఉక్కిరిబిక్కిరి అయ్యారు.
రూ. 4,000 కోట్ల నష్టం.. షెల్ కంపెనీల గుట్టు
మద్యం విధానాన్ని ఇష్టారాజ్యంగా మార్చివేయడం వల్ల ప్రభుత్వ ఖజానాకు దాదాపు రూ. 4 వేల కోట్ల నష్టం వాటిల్లినట్లు ఈడీ ప్రాథమికంగా అంచనా వేసింది. అప్పట్లో ముడుపులు ఇచ్చిన వారికే మద్యం తయారీ అవకాశాలు కల్పించడం, ఆ లంచాల సొమ్మును షెల్ కంపెనీల ద్వారా నిందితుల వ్యక్తిగత ఖాతాల్లోకి మళ్లించారనే ఆరోపణలపై ఈడీ అధికారులు ఆరా తీశారు. ముఖ్యంగా నిందితుల మధ్య జరిగిన ఆర్థిక లావాదేవీల చిట్టాను అధికారులు ముందుంచారు.
కొత్త బ్రాండ్లు.. ముడుపుల అజెండా
అప్పటిదాకా ఉన్న పాపులర్ బ్రాండ్లను రాష్ట్రం నుంచి పక్కనపెట్టి, ఎవరూ వినని కొత్త బ్రాండ్లను ప్రవేశపెట్టడం వెనుక ఉన్న మర్మమేంటని అధికారులు నిందితులను ప్రశ్నించినట్లు తెలుస్తోంది. నాణ్యత లేని మద్యం సరఫరా చేయడానికి ఏ శక్తులు సహకరించాయి? ఎవరికి ఎంత వాటా అందింది? అనే కోణంలో విచారణ సాగింది. నిందితులలో ఒకరైన కృష్ణమోహన్‌రెడ్డి విచారణ ముగించుకుని వెళ్లగా, మిగిలిన వారిని అధికారులు ఇంకా ప్రశ్నిస్తూనే ఉన్నారు.
ఆస్తుల అటాచ్మెంట్.. తదుపరి విచారణకు ఆదేశం
ఈ కేసులో ఇప్పటికే రాజ్ కెసిరెడ్డి, వాసుదేవరెడ్డి, చాణక్యకు చెందిన సుమారు రూ. 441.61 కోట్ల విలువైన ఆస్తులను ఈడీ జప్తు చేసింది. విచారణకు హాజరైన నిందితులకు అధికారులు కీలక ఆదేశాలు జారీ చేశారు. వచ్చే విచారణకు తమతో పాటు తమ కుటుంబ సభ్యుల బ్యాంక్ స్టేట్మెంట్లు, పాన్ కార్డులు, ఆస్తుల వివరాలతో హాజరుకావాలని స్పష్టం చేశారు. దీంతో ఈ కుంభకోణంలో మరిన్ని కీలక తలకాయలు బయటపడే అవకాశం కనిపిస్తోంది.
Next Story

