
చంద్రబాబును వదలని 'స్కిల్' సెగ.. 54 కోట్ల ఆస్తులు అటాచ్ చేసిన ఈడీ
తాజాగా పీఎంఎల్ఏ (PMLA) కోర్టులో ఈడీ ప్రాసిక్యూషన్ ఫిర్యాదును నమోదు చేయడంతో ఈ వ్యవహారం మళ్లీ మొదటికి వచ్చింది.
ఆంధ్రప్రదేశ్ రాజకీయాలను కుదిపేసిన ’స్కిల్ స్కామ్‘ కేసులో అనూహ్య మలుపు చోటుచేసుకుంది. రాష్ట్ర ఏసీబీ కోర్టులో సీఎం చంద్రబాబుపై ఉన్న కేసును సీఐడీ (CID) ’మిస్టేక్ ఆఫ్ ఫాక్ట్'గా పేర్కొంటూ క్లోజ్ చేసిన కొద్దిరోజుల్లోనే.. కేంద్ర దర్యాప్తు సంస్థ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) రంగంలోకి దిగడం రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తోంది. తాజాగా పీఎంఎల్ఏ (PMLA) కోర్టులో ఈడీ ప్రాసిక్యూషన్ ఫిర్యాదును నమోదు చేయడంతో ఈ వ్యవహారం మళ్లీ మొదటికి వచ్చింది.
ఈడీ దర్యాప్తులో విస్తుపోయే నిజాలు
స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ నిధులు షెల్ కంపెనీల ద్వారా ఎలా దారిమళ్లాయో ఈడీ తన విచారణలో పూసగుచ్చినట్లు వివరించింది. ప్రధానంగా డిజైన్ టెక్ సంస్థ ద్వారా ఈ అక్రమాలు జరిగినట్లు ఈడీ నిర్ధారించింది. ప్రభుత్వ నిధులను నేరుగా ప్రాజెక్టుకు వాడకుండా, ముకుల్ చంద్ర అగర్వాల్, సురేష్ గోయల్ వంటి వ్యక్తుల సహకారంతో సింగపూర్, ఢిల్లీ కేంద్రంగా ఉన్న షెల్ కంపెనీల ఖాతాల్లోకి మళ్లించారు. ఎలాంటి వస్తువులు లేదా సేవలు సరఫరా చేయకుండానే, నకిలీ ఇన్వాయిస్‌లతో నిధులను ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లోకి చేరవేసినట్లు ఈడీ దర్యాప్తులో వెల్లడైంది. వికాశ్ కన్వేల్కర్, సుమన్ బోస్ సహా ఈ కుట్రలో పాల్గొన్న ప్రధాన పాత్రధారుల చిట్టాను ఈడీ కోర్టు ముందుంచింది.
భారీగా ఆస్తుల జప్తు..ఢిల్లీ నుంచి ముంబై వరకు
ఈ కేసులో అక్రమంగా సంపాదించిన ఆస్తులను స్వాధీనం చేసుకోవడంలో ఈడీ రాజీలేని వైఖరిని ప్రదర్శిస్తోంది. మొదటి విడత కింద 2023లోనే డిజైన్ టెక్ సంస్థకు చెందిన రూ. 31.20 కోట్ల విలువైన ఫిక్స్‌డ్ డిపాజిట్లను ఈడీ అటాచ్ చేసింది. రెండో విడత కింద.. తాజాగా జరిపిన లోతైన విచారణలో నిందితులకు చెందిన ఢిల్లీ, ముంబై, పూణే వంటి నగరాల్లోని విలాసవంతమైన నివాసాలు, ఇతర స్థిరాస్తులను గుర్తించి, మరో రూ. 23.54 కోట్లను జప్తు చేసింది. రెండు విడతలుగా కలిపి ఇప్పటివరకు సుమారు రూ. 54.74 కోట్ల విలువైన ఆస్తులను ఈడీ తన ఆధీనంలోకి తీసుకుంది.
కోర్టు విచారణ.. కొత్త సమీకరణాలు
విశాఖపట్నంలోని ప్రత్యేక పీఎంఎల్ఏ కోర్టు ఈడీ దాఖలు చేసిన ప్రాసిక్యూషన్ కంప్లైంట్‌ను విచారణకు స్వీకరించింది. ఒకవైపు రాష్ట్ర సీఐడీ ఈ కేసులో చంద్రబాబుకు క్లీన్ చిట్ ఇచ్చినప్పటికీ, కేంద్ర సంస్థ అయిన ఈడీ నిధుల మళ్లింపు నిజమని ఆధారాలతో సహా ముందుకు వెళ్తుండటం ఇప్పుడు గందరగోళానికి దారితీస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం ఈ కేసును క్లోజ్ చేసినా, మనీ లాండరింగ్ కోణంలో ఈడీ విచారణ కొనసాగడం వల్ల చంద్రబాబుకు ఈ స్కిల్ సెగ ఇప్పట్లో వదిలేలా కనిపించడం లేదు. ఈ పరిణామం ఏపీ రాజకీయాల్లో కొత్త చర్చకు తెరలేపింది. నిజం నిలకడ మీద తెలుస్తుందా? లేక రాజకీయ కక్షసాధింపులో భాగంగానే ఈడీ మళ్ళీ యాక్టివ్ అయ్యిందా? అనే ప్రశ్నలు ఇప్పుడు ప్రజల్లో తలెత్తుతున్నాయి.

