జగన్ వాకౌట్, టీడీపీ పాయింటవుట్, గవర్నర్ స్పీచ్ అవుట్
x
AP Assembly

జగన్ వాకౌట్, టీడీపీ పాయింటవుట్, గవర్నర్ స్పీచ్ అవుట్

సభ ప్రారంభంలోనే అధికార, ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం సాగింది. జగన్ పార్టీ సభ్యులు అసెంబ్లీ నుంచి వాకౌట్ చేశారు


ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల తొలిరోజు ముగిసింది. బుధవారం సభ ప్రారంభమైన కొద్ది నిమిషాల నుంచే అధికార, ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం సాగింది. చివరకు గవర్నర్ ప్రసంగం ముగిసిన అనంతరం స్పీకర్ సభను రేపటికి వాయిదా వేశారు.
జగన్ వాకౌట్.. సభ ప్రారంభం కాగానే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నేతృత్వంలో ఆ పార్టీ ఎమ్మెల్యేలు ఆందోళనకు దిగారు. తమకు ప్రతిపక్ష హోదా కల్పించాలంటూ స్లోగన్లు ఇచ్చారు. సభలో ప్రజా సమస్యలపై మాట్లాడే అవకాశం ఇవ్వడం లేదని ఆరోపిస్తూ గవర్నర్ ప్రసంగం మధ్యలోనే జగన్ తన ఎమ్మెల్యేలతో కలిసి సభ నుండి వాకౌట్ చేశారు. అనంతరం వారు అసెంబ్లీ ఆవరణలో మీడియా ముందు తమ నిరసనను వ్యక్తం చేశారు.

తప్పులను ఎత్తిచూపిన టీడీపీ (Point Out): జగన్ వాకౌట్ చేయడంపై తెలుగుదేశం పార్టీ నేతలు సభలోనే హేళనగా సైగలు చేశారు. ఒకరిద్దరు ఎగతాళిగా కూడా మాట్లాడారు. గత ప్రభుత్వ హయాంలో ప్రతిపక్షాల గొంతు నొక్కిన విషయాన్ని టీడీపీ సభ్యులు ఈ సందర్భంగా పాయింట్ అవుట్ చేశారు. ప్రజలు ఇచ్చిన తీర్పును గౌరవించకుండా, సభలో చర్చకు నిలబడలేక జగన్ పారిపోయారని వారు విమర్శించారు. సభా మర్యాదలను జగన్ కాలరాస్తున్నారని అధికార పక్షం ఆరోపించింది.
ముగిసిన గవర్నర్ ప్రసంగం: ప్రతిపక్షం లేని సమయంలోనే గవర్నర్ అబ్దుల్ నజీర్ తన ప్రసంగాన్ని పూర్తి చేశారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, రాబోయే ప్రాజెక్టుల గురించి ఆయన వివరించారు. ఈ గందరగోళం మధ్యే ఆయన ప్రసంగం సాగడం విశేషం.
ప్రస్తుతం సభ రేపటికి వాయిదా పడింది.
సభకు రేపు వైసీపీ వాళ్లు హాజరవుతారో లేదో తెలియదు. గైర్హాజరు అవుతారనే భావిస్తున్నారు.
అంతకుముందు ఏం జరిగిందంటే...
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభ బడ్జెట్ సమావేశాలు బుధవారం గవర్నర్ ప్రసంగంతో ప్రారంభమయ్యాయి. అయితే ప్రారంభ సమావేశాలే తీవ్ర ఉద్రిక్తతల మధ్య సాగాయి. గవర్నర్ ప్రసంగం కొనసాగుతున్న సమయంలోనే వైఎస్సార్‌సీపీ సభ్యులు నిరసనలకు దిగడంతో సభలో కొంతసేపు హడావుడి నెలకొంది. ప్రధాన ప్రతిపక్ష హోదా ఇవ్వాలని, సభ్యుల హక్కులను కాపాడాలని, రాష్ట్రంలో శాంతిభద్రతలు నిలబెట్టాలని నినాదాలు చేస్తూ వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేలు ఆందోళన వ్యక్తం చేశారు. గవర్నర్ ప్రసంగం కొనసాగుతున్నప్పటికీ నిరసనలు ఆగకపోవడంతో వైఎస్సార్‌సీపీ సభ్యులు అనంతరం వాకౌట్ చేశారు.
గవర్నర్ ప్రసంగం – ప్రతిపక్ష నిరసన
ఉదయం 10 గంటలకు ఉభయ సభలనుద్దేశించి గవర్నర్ ప్రసంగం ప్రారంభమైంది. ఈ సమావేశాలకు వైఎస్సార్‌సీపీ నుంచి 11 మంది సభ్యులు హాజరయ్యారు. గవర్నర్ ప్రసంగంలో ప్రభుత్వ విధానాలు, అభివృద్ధి కార్యక్రమాలు ప్రస్తావించగా, వైఎస్సార్‌సీపీ సభ్యులు వాటిని వ్యతిరేకిస్తూ నినాదాలు చేశారు. నిరుద్యోగ భృతి ఇవ్వాలని, మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. గవర్నర్ ప్రసంగం “అబద్ధాల పుట్ట” అని ఆరోపిస్తూ సభ నుంచి నిష్క్రమించారు.
వైఎస్సార్‌సీపీ నేతల వ్యాఖ్యలు
ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్ మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రజల పక్షాన పోరాడుతున్న ఏకైక పార్టీ వైఎస్సార్‌సీపీనేనన్నారు. తమ పార్టీకి ప్రతిపక్ష హోదా హక్కుగా ఇవ్వాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వంపై నియంత పోకడల ఆరోపణలు చేశారు. 3.2 లక్షల కోట్ల అప్పులు చేశారని, విద్యార్థుల ఫీజు బకాయిలు చెల్లించలేదని విమర్శించారు. వైఎస్ జగన్‌కు సభలో మాట్లాడే హక్కు ఇవ్వాలని డిమాండ్ చేశారు.
ఎమ్మెల్సీ తూమాటి మాధవరావు మాట్లాడుతూ గవర్నర్ ప్రసంగంలో వాస్తవాలు లేవని ఆరోపించారు. పీఏసీ ఛైర్మన్ వ్యవహారంపై కూడా విమర్శలు చేశారు. అప్పుల భారంపై ప్రభుత్వం సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.
ఎమ్మెల్సీ బొమ్మి ఇజ్రాయెల్ తిరుపతి లడ్డూ అంశంపై తప్పుడు ప్రచారం జరిగిందని, సీబీఐ నివేదికలో ఎలాంటి కొవ్వు కలిసలేదని తేలిందని అన్నారు. రాజకీయ దాడులు ఆపాలని ప్రభుత్వాన్ని కోరారు.
ఎమ్మెల్సీ ఇసాక్ బాషా మాట్లాడుతూ సూపర్ సిక్స్ హామీలు అమలు కాలేదని ప్రశ్నించారు. ప్రభుత్వం విమర్శలను సహించలేక దాడులు చేస్తోందని ఆరోపించారు.
బడ్జెట్ సమావేశాల ప్రాముఖ్యత
సభా వ్యవహారాల సలహా సంఘం (బీఏసీ) సమావేశంలో సమావేశాల వ్యవధి, బడ్జెట్ ప్రవేశపెట్టే తేదీ నిర్ణయించనున్నారు. ఇప్పటికే బడ్జెట్ కసరత్తు పూర్తి కాగా, ఈసారి వినూత్నంగా ‘వాటర్ బడ్జెట్’ను ప్రవేశపెట్టనున్నారు. ఆర్థిక, వ్యవసాయ బడ్జెట్‌లతో పాటు నీటి వినియోగంపై ప్రత్యేక బడ్జెట్ ప్రవేశపెడితే దేశంలోనే తొలిసారిగా ఈ ప్రయోగం చేసిన రాష్ట్రంగా ఏపీ నిలుస్తుంది.
స్పీకర్ సభ్యులు అడిగిన ప్రశ్నలకు శాఖలు సకాలంలో సమాధానాలు ఇవ్వాలని ఆదేశించారు. గత సమావేశాల నుంచి పెండింగ్‌లో ఉన్న ప్రశ్నలకు త్వరగా సమాధానాలు అందించాలని సూచించారు. అలాగే రాబోయే వర్షాకాల సమావేశాలను ‘నేషనల్ ఈ-విధాన్’ కింద డిజిటల్ విధానంలో నిర్వహించే యోచన కూడా వెల్లడించారు.
ప్రారంభ సమావేశాలే రాజకీయ వేడిమిని రగిలించగా, రాబోయే రోజుల్లో బడ్జెట్ చర్చలు మరింత తీవ్రంగా సాగనున్నాయనే సంకేతాలు కనిపిస్తున్నాయి. ప్రతిపక్ష హోదా, ఆర్థిక పరిస్థితి, సంక్షేమ హామీల అమలు, వాటర్ బడ్జెట్ వంటి అంశాలు ఈ సమావేశాల్లో ప్రధాన చర్చా అంశాలుగా మారనున్నాయి.
Read More
Next Story