పవన్ కల్యాణ్ హామీ ఇచ్చిన 24 గంటల్లోనే మళ్లీ డోలీ మోతలు
x

పవన్ కల్యాణ్ హామీ ఇచ్చిన 24 గంటల్లోనే మళ్లీ డోలీ మోతలు

ఏజెన్సీలో తీరని గిరిజన కష్టాలు.


మీ కన్నీరు మీ గడప తొక్కకుండా చూస్తాం.. ఏజెన్సీ గడ్డపై ఇక డోలీ మోతలు కనిపించకూడదు అంటూ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ నిన్న శనివారమే గిరిజన హృదయాలకు భరోసా ఇచ్చారు. కానీ.. ఆ మాటలు గాలిలో కలిసిపోకముందే అల్లూరి జిల్లాలో మరో హృదయ విదారక దృశ్యం ఆవిష్కృతమైంది. పవన్ కల్యాణ్ హామీ ఇచ్చిన 24 గంటలు కూడా గడవకముందే.. జి.మాడుగుల మండలం లక్కపాడులో ఓ గర్భిణీని సెల్‌ఫోన్ లైట్ల వెలుగులో, డోలీపై 5 కిలోమీటర్ల మేర మోసుకెళ్లాల్సిన పరిస్థితి తలెత్తింది. ఒకవైపు ప్రభుత్వం అడవితల్లి బాట'లో అభివృద్ధి పరుగులు పెడుతోందని చెబుతున్నా, క్షేత్రస్థాయిలో గిరిజన మహిళల ప్రసవ వేదన మాత్రం ఇంకా చీకట్లోనే కొట్టుమిట్టాడుతుండటం అధికార యంత్రాంగానికి పెను సవాల్‌గా మారింది.


సెల్‌ఫోన్ వెలుగుల్లో 5 కిలోమీటర్ల నరకం

అల్లూరి జిల్లాలోని మారుమూల కొండప్రాంతాల్లో గిరిజనుల తలరాతలు ఇంకా మారడం లేదు అనడానికి లక్కపాడు ఘటనే నిదర్శనం. వసంత అనే గర్భిణీకి అర్ధరాత్రి పురిటినొప్పులు రావడంతో ఆ కుటుంబం అనుభవించిన వేదన వర్ణనాతీతం. గ్రామానికి అంబులెన్స్ వచ్చే దారి లేకపోవడంతో, గత్యంతరం లేక చిమ్మచీకట్లో సెల్‌ఫోన్ లైట్ల వెలుగునే ఆసరాగా చేసుకుని ఆమెను డోలీపై ఉంచారు. రాళ్లు, రప్పలు, వాగులు దాటుతూ 5 కిలోమీటర్ల దూరం ఆమెను మోసుకెళ్లడం ఒక ప్రసవ వేదన అయితే, ఆ ప్రయాణంలో ప్రాణాలు అరచేతిలో పెట్టుకోవడం మరో నరకం. ఈ దృశ్యాలు చూస్తుంటే టెక్నాలజీ యుగంలోనూ అడవి బిడ్డల బతుకులు ఇంకా చీకట్లోనే ఉన్నాయనే చేదు నిజం స్పష్టమవుతోంది.

పవన్ హామీ.. గంటలు గడవకముందే పరీక్ష
సరిగ్గా ఇదే జిల్లాలోని పాడేరు ప్రాంతంలో శనివారం జనసేన 13వ ఆవిర్భావ వేడుకలు జరిగాయి. ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ గిరిజనులను ఉద్దేశించి మీ కష్టాన్ని మీ గుమ్మం తాకనివ్వం అని ఉద్వేగభరితంగా హామీ ఇచ్చారు. నందిగరువు వంటి గ్రామాల్లో కొత్త రోడ్లను ప్రారంభించి గిరిజనుల కష్టాలకు విముక్తి కలిగిస్తామని ప్రకటించారు. అయితే ఆ ప్రకటన వెలువడిన 24 గంటలు తిరగకముందే పక్కనే ఉన్న మండలంలో వసంత అనే మహిళ డోలీపై వెళ్లాల్సి రావడం, పాలకుల హామీలకు.. క్షేత్రస్థాయి వాస్తవాలకు మధ్య ఉన్న భారీ అంతరాన్ని ఎత్తి చూపుతోంది. ప్రభుత్వం మారినా, హామీలు గుప్పించినా గిరిజనుల డోలీ యాత్రకు మాత్రం బ్రేక్ పడకపోవడం విచారకరం.

అభివృద్ధి జరిగిన చోట పండుగ.. అందని చోట దండగ
పవన్ కల్యాణ్ పర్యటించిన నందిగరువు గ్రామానికి రోడ్డు రావడంతో అక్కడ ఆవిర్భావ వేడుకలు పండుగలా జరిగాయి. కానీ, ఏజెన్సీలో ఇంకా లక్కపాడు వంటి వందలాది గ్రామాలు సరైన రహదారి సౌకర్యం లేక మృత్యువుతో పోరాడుతూనే ఉన్నాయి. రాజకీయాలకు అతీతంగా అభివృద్ధి చేస్తాం అన్న మాటలు వినడానికి బాగున్నా.. అవి మారుమూల పల్లెలకు చేరనంత వరకు గిరిజనుల గుండెల్లో ఆందోళన తగ్గదు. నందిగరువులో విముక్తి లభించినట్టే, లక్కపాడు వంటి గ్రామాలకు కూడా ఆ అడవితల్లి బాట ఎప్పుడు పడుతుందోనని గిరిజనులు ఆశగా ఎదురుచూస్తున్నారు.

సవాల్‌గా మారిన మారుమూల గ్రామాలు
కూటమి ప్రభుత్వం గత 18 నెలల్లో 460 కిలోమీటర్ల మేర రోడ్లు నిర్మించినట్లు గణాంకాలు ఊరటనిస్తున్నప్పటికీ, భౌగోళికంగా అత్యంత కష్టతరమైన శిఖర గ్రామాల విషయంలో యంత్రాంగం ఇంకా వెనుకబడే ఉంది. పీపుల్ ఫ్రెండ్లీ ప్రభుత్వం అని చెప్పుకుంటున్న తరుణంలో, గర్భిణీలు డోలీలపై 5 కిలోమీటర్ల నరకాన్ని చూడటం అధికార పీఠాన్ని ప్రశ్నిస్తోంది. ప్రభుత్వం కేవలం ప్రధాన గ్రామాలకు రోడ్లు వేయడమే కాకుండా, కొండల పైనున్న చిన్న పల్లెలకు కూడా అంబులెన్స్ వెళ్లే మార్గాలను యుద్ధ ప్రాతిపదికన నిర్మించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
Read More
Next Story